YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హాట్ సీట్ గా మారిన కొడంగల్

హాట్ సీట్ గా మారిన కొడంగల్
తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనం కూడా ఆసక్తికరంగా గమనిస్తున్న నియోజకవర్గం కొడంగల్. ఇక్కడి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ 
చేస్తుండటం… ఆయనను ఎలాగైనా ఓడించేందుకు టీఆర్ఎస్ టార్గెట్ చేయడంతో ఇక్కడ రాజకీయాల్లో తీవ్ర రూపం దాల్చాయి. ఇక్కడ రేవంత్ రాజేస్తున్న సెంటిమెంట్ అస్త్రం విజయవంతం అవుతుందా లేదా టీఆర్ఎస్ పార్టీ జపిస్తున్న అభివృద్ధి మంత్రం ఫలిస్తుందా అనే ఆసక్తి తెలుగు ప్రజల్లో ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ వన్ మెన్ ఆర్మీలా పోరాడుతుండగా… ఈసారి రేవంత్ ను ఓడించి ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని టీఆర్ఎస్ అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తోంది. దీంతో మొత్తానికి కొడంగల్ లో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోజుకో వివాదం రెండు పార్టీల నడుమ చోటు చేసుకుంటోంది. ఏకంగా సభలను అడ్డుకోవాలని పిలుపులు ఇవ్వడం, అర్థరాత్రుల్లు అరెస్టులు చేయడం దగ్గరకు పరిస్థితి వెళ్లింది. ఇక ఎన్నికలకు రెండు రోజులే మిగిలి ఉండటంతో కొడంగల్ లో రాజకీయం మరింత వేడెక్కింది.కొడంగల్ నుంచి 2009, 2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. రెండు ఎన్నికల్లోనూ ఆయన 15 వేలకు తక్కువ మెజారిటీనే సాధించారు. స్థానికేతరుడే అయినా ఆయన నియోజకవర్గంలో క్రమంగా పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా మారారు. ఇక తాను కొడంగల్ కే అంకితమని, తన స్వంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ కు బద్ధ శత్రువుగా మారారు. టీఆర్ఎస్ వైఖరిపై, కేసీఆర్ కుటుంబంపై సందర్భం వచ్చినప్పుడల్లా ఒంటికాలితో లేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ కి ఆయన కొరకరాని కొయ్యగా మారిపోయారు. టీఆర్ఎస్ తో పోరాడటానికే ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన కాంగ్రెస్ లో చేరినా ఆయన మనస్సు మాత్రం ఇంకా టీడీపీలో, చంద్రబాబు తో ఉంటుందంటారు ః.కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరినప్పుడే కొడంగల్ లో ఉప ఎన్నికలు వస్తాయనుకుని అప్పుడే ఇక్కడ బలమైన అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డిని టీఆర్ఎస్ అక్కడ రంగంలోకి దింపింది. సంవత్సర కాలంగా టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు తో పాటు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి కొడంగల్ బాధ్యతలు తీసుకున్నారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తరచూ మంత్రులు నియోజకవర్గంలో పర్యటించారు. పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని చాలా బలోపేతం చేశారు. ఇక ఇంతలోనే ఎన్నికలు రావడంతో మూడు నెలలుగా టీఆర్ఎస్ ప్రచారాన్ని ఉదృతం చేసింది. అభ్యర్థి నరేందర్ రెడ్డితో పాటు ఇక్కడ ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన 
గుర్నాధరెడ్డి చాలా కష్టపడుతున్నారు. గుర్నాధరెడ్డికి కూడా ఇక్కడ మంచి పట్టుండటం టీఆర్ఎస్ కు మరింత బలం చేకూర్చుతుంది. హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ప్రచారం 
నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి వర్గంగా ఉన్న పలువురు నేతలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ప్రధానంగా ఓ సామాజకవర్గం వారిని మచ్చిక చేసుకోవడంలో టీఆర్ఎస్ సఫలీకృతమైందనే 
అంచాలు ఉన్నాయి. భారీ మెజారిటీతో గెలుస్తానని రేవంత్ ముందు నుంచీ నమ్మకంగా చెబుతూ వచ్చారు. అయితే, ఆయన స్టార్ క్యాంపెయినర్ కావడంతో నియోజకవర్గానికి ఎక్కువ సమయం 
కేటాయించలేకపోయారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బలంగా మారింది. దీంతో రేవంత్ రెడ్డి కూడా అలెర్ట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఆయన రాజకీయ జీవితానికి 
చాలా కీలకం. ఎలాగైనా పట్టు కోల్పోకుండా ఉండేందుకు రేవంత్ సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల కక్షపూరితంగా చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఏ చిన్న అవకాశం దొరికినా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మలుస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్ హౌజ్ లో డబ్బులు దొరికినప్పుడు కూడా దానికి చాలా పెద్ద ఇష్యూ చేసి ప్రజల్లో చర్చకు పెట్టారు. ఇక సీఎం కేసీఆర్ సభ రోజు నిరసనలకు పిలుపునివ్వడం, అరెస్టు కావడం కూడా రేవంత్ పక్కా వ్యూహం ప్రకారమే చేస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి ఒక పార్టీ అధినేత కేసీఆర్ కి ప్రచారం చేసుకునే హక్కు ఉంది. దీనిపై రాద్దాంతం చేయడం ద్వారా రాజకీయంగా మేలు జరుగుతుందని రేవంత్ భావించినట్లు కనిపిస్తోంది. తమ నాయకుడిపై టీఆర్ఎస్ కక్షసాధిస్తుందనే భావన ప్రజల్లో మరింత ఎక్కువ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక రెండు పార్టీలూ డబ్బు కూడా పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డికి కొంత ఓటమి భయం ఉన్నట్లుగా ఇటీవలి పరిణామాలు చూస్తుంటే తెలుస్తోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts