YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గోషామహల్ లో అంత వీజీ కాదు

గోషామహల్ లో అంత వీజీ కాదు

రాజాసింగ్ లోధ… గోరక్ష ఉద్యమకారుడు.. హిందుత్వవాది… బీజేపీ ఫైర్ బ్రాండ్. పాతబస్తీ హిందువుల్లో మంచి ఇమేజ్ ఉన్న నేత. ముఖ్యంగా రాజాసింగ్ కి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో గోషామహాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా 40 వేల తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఎదురుకుంటున్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి మతానికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల నియోజకవర్గంలో ఆయనపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీనికి తోడు టీఆర్ఎస్ నియోజకవర్గంలో బలంగా మారడం, ప్రజల్లో పట్టున్న నేతను నిలబెట్టడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. దీంతో గోషామహాల్ లో త్రిముఖ పోటీ నెలకొంది.గత ఎన్నికల్లో ముఖేష్ గౌడ్ పై బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన రాజాసింగ్ మళ్లీ బరిలో ఉన్నారు. యన సామాజికవర్గ ప్రజలు, ఉత్తర భారత సెటిలర్లు, హిందూ ఓటు బ్యాంకు తనకు అండగా నిలుస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆధిత్యానాధ్ కూడా రాజాసింగ్ తరపున ప్రచారం నిర్వహించారు. అయితే, ఉత్తర భారత ఓట్లు ఈసారి చీలే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ కి వీరిలో మంచి పట్టు ఉంది. దీంతో ఆయన భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని బేగంబజార్, మహారాజ్ గంజ్, ఉస్మాన్ గంజ్, జాంబాగ్, గోషామహాల్, అగాపురా, ఆబిడ్స్, అఫ్జల్ గంజ్, అశోక్ బజార్ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్నారు. వీరి ఓట్లను ప్రేమ్ సింగ్ రాథోడ్ చీల్చే అవకాశం ఉంది. గతంలో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ముఖేష్ గౌడ్ కి కూడా వీరితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనకు కూడా కొంతమేర మద్దతు లభించే అవకాశం ఉంది. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్.కే.జైన్ కూడా కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది.పాతబస్తీలో హిందువులు మెజారిటీగా ఉన్న ఏకైక నియోజకవర్గం గోషామహాల్. అయినా ఇక్కడ సుమారు 50 – 55 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. జాంబాగ్, దత్తాత్రేయ నగర్ డివిజన్లలో వీరి జనాభా ఎక్కువ. ఈ రెండు డివిజన్ల కార్పొరేటర్లు కూడా ఎంఐఎం నేతలే. అయితే, ఇక్కడ ఎంఐఎం స్వయంగా పోటీ చేయడం లేదు. గతంలో ముఖేష్ గౌడ్ కి మద్దతు ఇచ్చిన ఆ పార్టీ ఈసారి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ స్వయంగా ప్రచారం కూడా చేశారు. అయితే, మైనారిటీ ఓట్లు కూడా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు పడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖేష్ గౌడ్ కి కూడా ముస్లిం ఓటర్లులో మంచి గుర్తింపు ఉంది. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వీరి ఓట్లు చీలనున్నాయి. ఇది రాజాసింగ్ కి కలిసిరానుంది.మొత్తానికి, రాజాసింగ్ అభివృద్ధి విషయంలో కొంత వెనకబడ్డా హిందుత్వ నినాదాన్నే నమ్ముకున్నారు. ధూల్ పేట్, మంగళ్ హట్ వంటి ప్రాంతాల్లోనే తన సామాజకవర్గ ప్రజల బలంతో పాటు ఉత్తర భారత ఓటర్లు కూడా ఎక్కువగా బీజేపీ వైపే ఉండే అవకాశం ఉండటంతో విజయంపై ధీమాగా ఉన్నారు. అయితే, గత ఎన్నిల్లోలా ఏకపక్షంగా మాత్రం ఈసారి ఎన్నికలు ఉండే అవకాశం లేదు. రాజాసింగ్ వైపు కొంత మొగ్గు ఉన్నా… ముఖేష్ గౌడ్, ప్రేమ్ సింగ్ రాథోడ్ గట్టి పోటీ ఇస్తున్నారు. తిరిగి పునర్వైభవం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ముఖేష్ గౌడ్ ప్రచారాన్ని ఉధృతంగా చేశారు. ముగ్గరు మాజీ ఎమ్మెల్యేల బరిలో ఎవరో గెలుస్తారో డిసెంబర్ 11న తేలనుంది.

Related Posts