YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆదిలోనే ఏనుగు పాదం

 ఆదిలోనే ఏనుగు పాదం
అంతా అనుకున్నట్లుగానే జరగుతుంది. ఊహకు అందని విషయమేమీ కాదు. భారతీయ జనతా పార్టీ, మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకతాటిమీదకు తేవాలన్న ప్రయత్నం ఆదిలోనే బెడిసి కొట్టేలా ఉంది. ఈనెల 10వ తేదీన బీజేపీయేతర పార్టీలన్నీ ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించాయి. ముందే సమవేశం కావాలనుకున్నా మమత బెనర్జీ అభ్యంతరం తెలపడంతో ఈనెల 10వ తేదీకి ఆ సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. అయితే ఈ సమావేశానికి కూటమిలో ప్రధాన పక్షంగా ఉంటుందనుకున్న మాయావతి డుమ్మా కొట్టనున్నారని తెలుస్తోంది. ఈనెల 10వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కావడం లేదని ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఎన్నికలకు ముందే జట్టుకట్టాలని భావిస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్ల చీలిక లేకుండా చూసేందుకు, తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ది పొందకుండా ఉండేందుకు ముందుగానే కూటమిని బలంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. నిన్న తెలంగాణ పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సమావేశాన్ని గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మాయావతిని చంద్రబాబు ఆహ్వానిస్తే ఆమె సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు.బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పట్ల మాత్రం అంత అనుకూలంగా మాత్రం లేదనేది వాస్తవం. ముఖ్యంగా సోనియాగాంధీ తప్పుకుని రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాతనే మాయావతిలో ఈ మార్పు వచ్చినట్లు స్పష్టంగా చెబుతున్నారు. రాహుల్ నాయకత్వం కింద పనిచేసేందుకు మాయావతి అస్సలు అంగీకరించడం లేదన్నది వాస్తవం. పైగా ఉత్తర్ ప్రదేశ్ లోని లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసేందుకు కూడా మాయావతి ఇష్టపడటం లేదు. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు జట్టుగా కలసి వెళ్లి లోక్ సభలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలన్నది ఆమె ఆలోచనగా ఉంది.ఇందుకు కూడా ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తే ప్రధాన మంత్రి అభ్యర్థిగా తాను బరిలో ఉండొచ్చన్నది ఆమె స్ట్రాటజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్ వాదీ పార్టీకి అండగా నిలిచి తన పార్టీ మాత్రం లోక్ సభ ఎన్నికలపైనే దృష్టి పెట్టాలన్న మాయా వ్యూహరచన చేస్తున్నారు. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమె ఎక్కడా కాంగ్రెస్ తో కలవలేదని చెబుతున్నారు. ఎస్పీతోనే తాము కలసి ఉంటామని, మరే పార్టీతో కలసి పనిచేసేది లేదని ఆమె ఘంటా పధంగా పార్టీ సమావేశాల్లో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గైర్హాజరు కూటమి ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ప్రారంభ సమావేశంలోనే నేతల మధ్య సమన్వయం లేకుంటే భవిష్యత్ లో మోదీని ఎదుర్కొనడానికి వీళ్లు ఎన్ని ఫీట్లు చేయాల్సి ఉంటుందో చూడాలి మరి

Related Posts