YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ పార్టీలో సంక్రాంతి శోభ

 గులాబీ పార్టీలో సంక్రాంతి శోభ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకున్న ప్రాముఖ్యత అందరికీ తెలుసు. కొత్త సంవత్సరం రావటం, ఆ వెంటనే తొలి పండుగ కావటంతో సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు మిన్నంటుతాయి. అయితే ఈ సారి తెలంగాణాలో సంక్రాంతి పండుగ సంబరాలు ముందే మొదలయ్యాయి. ఎలాగంటారా? రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వర్గాలకు ఈ సంక్రాంతికి ముందుగానే పదవుల రూపంలో పండగను తెచ్చేశారు కేసీఆర్. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టి టీఆర్ఎస్ వర్గాలకు ముందే సంక్రాంతి తెచ్చారు కేసీఆర్.  నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్‌ను నియమించిన కేసీఆర్‌.. మంగళవారం పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని నియమించారు. రానున్న రోజుల్లో కీలకమైన ఆర్టీసీ చైర్మన్‌, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వంటి కీలక పదవులతో పాటు మరిన్ని నామినేటెడ్‌ పదవుల భర్తీ జరుగుతుందని టీఆరెస్ వర్గాలు చెబుతున్నాయి.  ఈ దఫా రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన నామినేటెడ్‌ పదవులను పార్టీ వీర విధేయులకు కట్టబెట్టాలనే తలంపుతో ముఖ్య నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ పదవి వరించినట్లుగా టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఎలాగూ ప్రభుత్వపరమైన ప్రొటోకాల్‌ ఉన్నందున.. టీఆర్‌ఎస్‌ నేతలకు నామినేటెడ్‌ పదవులిస్తే పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించడంతో పాటు ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేసే వీలు చిక్కుతుందని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గెలుపుకు కృషి చేసిన నాయకులకే ఈ నామినేటెడ్‌ పదవుల భర్తీలో పెద్దపీట వేయాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే మిగిలిన నామినేటెడ్‌ పదవుల్లోనూ ఎక్కువగా పార్టీ నేతలకు కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాల విశ్వసనీయ సమాచారం. అన్ని రకాలు, స్థాయిల్లోని నామినేటెడ్‌ పదవులను పరిగణనలోకి తీసుకుంటే, వాటి సంఖ్య ఐదారు వేల వరకు ఉంటుందని, పార్టీ కోసం పనిచేసినప్పటికీ, ఏ పదవీ దక్కలేదనే అసంతృప్తి ఈసారి ఎవరికీ ఉండకూడదనే ప్రణాళికతో పదవుల పంపిణీ చేపట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. అంటే.. ఈ సంక్రాంతి వేళ టీఆరెస్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందన్నమాట! 

Related Posts

0 comments on " గులాబీ పార్టీలో సంక్రాంతి శోభ"

Leave A Comment