YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అడ్రస్ ఎక్కడ..?

అడ్రస్ ఎక్కడ..?
నిత్యం విస్తరిస్తున్న పట్టణాల్లో కావాల్సిన చిరునామాలు దొరకబుచ్చుకోవడం నేడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఇంటి నంబరు, యజమాని పేరు తెలిసినప్పటికీ ఆ చిరునామా ఎక్కడుందో ఒక పట్టాన తెలియదు. ఎవరిని అడిగినా చెప్పరు. పురపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను అడిగినా చెప్పేందుకు గంటకుపైగా సమయం తీసుకుంటారు. అయినప్పటికీ సమగ్ర సమాచారం దొరకడం కష్టమే. ఈ గందరగోళాన్ని అడ్డు పెట్టుకొని చాలా పురపాలికల్లో ఇళ్ల యజమానులు, మున్సిపాలిటీ సిబ్బంది కుమ్మక్కై పురపాలికలకు వచ్చే ఇంటిపన్నుల ఆదాయానికి గండి కొడుతున్నారు. చిరునామా సమస్యతోపాటు ఇతరత్రా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రతి ఇంటికి డిజిటల్‌ నంబర్ల కేటాయింపు  కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇళ్లకు కేటాయించే ఈ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానం చేసి ఆన్‌లైనులో నమోదు చేయాలన్న సంకల్పం నేటికీ పట్టాలెక్కలేదు.
ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైనులో నమోదు చేసిన ప్రాంతాలు, కార్యాలయాలు, ఇతర ప్రదేశాలను సులభంగా గుర్తిస్తున్నాం. పట్టణాల్లో ఇంటి నంబరున్న చిరునామాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. దీనికి కారణం ఆ ఇంటి నంబర్లను ఆన్‌లైనులో నమోదు చేయకపోవడమే. చిరునామా సమస్యను చిటికెలో పరిష్కరించాలన్న ఉద్దేశంతో పురపాలకశాఖ రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలికల్లో ఇంటింటికి డిజిటల్‌ నంబర్లను పెట్టాలని 2018 జనవరి 4న ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు సూర్యాపేట మున్సిపాలిటీలో అమలు చేసిన ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలికల్లో అమలు చేయాలని శాఖాపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడుస్తున్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క పురపాలికలోనూ దీన్ని అమలు చేయలేదు.
డిజిటల్‌ నంబర్లు అందుబాటులోకి తేడవడంతో పన్ను (ఇంటిపన్ను) ఎగ్గొట్టేవారి వివరాలను ఆన్‌లైనులో ఇట్టే తెలుసుకోవచ్చు. ఆస్తి పన్ను వసూళ్లలో ఇళ్ల నిర్మాణాల విస్తీర్ణాన్ని తక్కువ చూపిస్తూ ఏటా లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. డిజిటల్‌ నంబర్లకు ఆధార్‌ నంబరును అనుసంధానం చేయడంతో సంబంధిత యజమానికి ఆయా మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ స్థిరాస్తులున్నాయి.. ఎంత పన్ను చెల్లిస్తున్నారు.. యజమాని అక్రమాలకు పురపాలకశాఖ అధికారులు ఏమైనా వత్తాసు పలుకుతున్నారా.. ఇలా పురపాలికల్లోని ఇళ్ల గురించి సమగ్ర సమాచారం  తెలుసుకునేందుకు వీలుపడుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2018 ఆగస్టు 2 నాటికి ముందున్న పది పురపాలికల్లో 1,15,914 గృహాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడినవి మరో 9 పురపాలికలు ఉన్నప్పటికీ వాటికి పూర్తిస్థాయి మార్గదర్శకాలు జారీ కాలేదు.

Related Posts