YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీమా ధీమా..

 బీమా ధీమా..

దశాబ్దకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీకావు. ప్రధానంగా సాగు పెట్టుబడి ఊహించని విధంగా పెరిగిపోయింది. పెట్టుబడి ఎక్కువగానే పెడుతున్నా చివరికి చేతికందే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రైతులు అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉంటోంది. ఇక ప్రతికూల వాతావరణం ఉంటే దిగుబడి తీవ్రంగా ప్రభావితమవుతుంటుంది. ఇలాంటి స్థితిలో పెట్టుబడి సొమ్ము కూడా రాని దుస్థితి ఎదురవుతోంది. ఇదిచాలదన్నట్లు తెగుళ్లు కూడా ప్రభావితం చేస్తున్నాయి. మొత్తంగా రైతన్నలు వివిధ సమస్యలతో సావాహం చేస్తూనే పంటలు పండిస్తున్నారు. అన్నదాతలకు మద్దతుగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే రైతాంగం సమస్యలకు మాత్రం పూర్తిస్థాయిలో చెక్ పడడంలేదు. కర్షకులకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన పంటలకే కాక జంతువుల దాడిలో నష్టపోయిన పంటలకూ పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తమకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అడవి పందులు, కోతులు తరచూ పొలాల్లోకి చొరబడి ధ్వంసం చేస్తుంటాయి. పందులు, కోతులు ఏ సమయంలో దాడికి తెగబడతాయో తెలీని పరిస్థితి. దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నా పెద్దగా ఫలితం ఉండడంలేదు. ఈ నేపథ్యంలో జంతువుల దాడిలో పంట విధ్వంసానికీ కేంద్రం నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

భారీ వర్షాలు కురిసే సమయంలో తరచూ మెరుపులు, పిడుగుల కారణంగా మంటలు చెలరేగుతుంటాయి. ఈ మంటల వల్ల పొలాల్లో నష్టం భారీగా ఉంటే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనూ బీమా వర్తించే విధంగా మార్గదర్శకాలను సవరించారు సంబంధిత అధికారులు. రైతులకు ఈ బీమా పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. వరి రైతుకు కలిగే ప్రయోజనంలో  1.5 శాతం మాత్రమే బీమా ప్రీమియం చెల్లించాలని అంటున్నారు. బీమాతో ప్రకృతి వైపరీత్యాలు, వన్యమృగాల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉందని వెల్లడించారు. బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని బీమా ప్రీమియం చెల్లింపును అదనంగా చూడకుండా కేవలం పెట్టుబడిగానే పరిగణించి ప్రతీ రైతు చెల్లించాలని సూచిస్తున్నారు. గతంలో మండలం, గ్రామం యూనిట్‌గా తీసుకుని పరిహారం చెల్లించేవారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రైతు యూనిట్‌గా బీమా ఇవ్వనున్నారు. గ్రామ యూనిట్‌గా ఐదేళ్లలో సాధించిన దిగుబడిని సరాసరిగా పరిగణిస్తారు. ప్రస్తుతం వచ్చిన దిగుబడిని గణించి ఈ తేడాలో 80 శాతాన్ని పరిహారంగా పొందే అవకాశం కల్పించారు. ప్రతికూల వాతావరణం, తెగుళ్లతో పంట నష్టపోతే బాధిత రైతులకు పరిహారం అందుతుంది. ఒకే రైతుకు చెందిన పొలంలో పిడుగు పడినా..లేదా వరి కుప్ప కాలిపోయినా బీమా వర్తింపజేస్తున్నారు. మొత్తంగా రైతులకు మద్దతుగా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.  

Related Posts