YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కసరత్తు షురూ..

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కసరత్తు షురూ..

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జరుగబోతున్న ఈ ఎన్నికల్లో పూర్వపు కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుత శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఈసారి ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ ఉద్యమ ఊపులో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌ మద్దతుతో శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ టికెట్‌ ఆశించారని ప్రచారం జరిగినా, అది ఆచరణకు రాలేదు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టత లేదు. స్వామిగౌడ్, టీఎన్‌జీవోలు, అధిష్టానం మద్దతుతో గ్రూప్‌–1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్‌ తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు చెప్పుకుంటూ వార్తల్లోకి వచ్చారు. అంతేగాక సీనియర్‌ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ కూడా ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగడం ఆసక్తికర పరిణామం. ఆయన మొట్టమొదటి శాసనమండలి 2007 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం తన ఆరేళ్ల ఎమ్మెల్సీ పదవీ కాలాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్‌ పిలుపు మేరకు ఏడాదిలోపు త్యాగం చేయగా, ఆ తర్వాత ఆయన ఏ పదవీ చేపట్టలేదు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ రాని కారణంగా తీవ్ర అసంతృప్తికి గురికాగా, ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తామని ఆయనకు పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్‌రావు నచ్చజెప్పినట్లు వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రైవేట్‌ విద్యా సంస్థల రాష్ట్ర సంఘం (ట్రస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్, టీఎన్జీవోల రాష్ట్ర సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి షామీద్, పేర్యాల దేవేందర్‌రావు తదితరులు కూడా ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంలో వీరు పాల్గొంటున్నారు. అయితే వీరిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరు అవుతారన్న విషయమే ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికల ఘన విజయంతో ఊపు మీద ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ యంత్రాంగం చురుగ్గా ఉంది. ఈ కారణంగా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా యంత్రాంగమంతా పని చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆశావహులు అదే స్థాయిలో మండలి టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. పాత కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌ జిల్లాలో అధికార పార్టీ నుంచి పలువురి పేర్లు వినిపిస్తున్నా.. అధినేత కేసీఆర్‌ మదిలో ఎవరున్నారనేది చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వని కారణంగా ఒకవేళ ప్రస్తుత ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ అభ్యర్థిత్వాన్ని మళ్లీ ప్రకటిస్తారా? ప్రకటిస్తే పరిస్థితి అంత సానుకూలంగా ఉంటుందా? అన్న చర్చ అప్పుడే మొదలైంది.

Related Posts