YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కిష‌న్ రెడ్డి దృష్టి

సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కిష‌న్ రెడ్డి దృష్టి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణ రాజ‌కీయాల్లో పార్టీల‌కు అతీతంగా అంద‌రూ గౌర‌వించే వ్య‌క్తి భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత కిష‌న్ రెడ్డి. బీజేపీలో చిన్న స్థాయి కార్య‌క‌ర్త‌గా రాజ‌కీయ ప‌య‌నాన్ని ప్రారంభించిన ఆయ‌న ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కూడా ప‌నిచేశారు. అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న కంచుకోట‌గా మార్చుకొని వ‌రుస విజ‌యాలు సాధించారు. అయితే, ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఈ స్థానంలో కిష‌న్ రెడ్డి ఓట‌మిపాల‌య్యారు. ఆయ‌న‌పై టీఆర్ఎస్ అభ్య‌ర్థి కాలేరు వెంక‌టేష్ స్వ‌ల్ప మెజారిటీతో విజ‌యం సాధించారు. అయినా, కిష‌న్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ఓడిన మ‌రునాటి నుంచే ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. అయితే, అసెంబ్లీలో అడుగుపెట్ట‌లేక‌పోయిన ఆయ‌న ఈసారి పార్ల‌మెంటులో అడుగుపెట్టి త‌న కోరిక నెర‌వేర్చుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.వాస్త‌వానికి, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆయ‌న సికింద్రాబాద్ పార్ల‌మెంటు స్థానానికి పోటీ చేయాల‌ని భావించారు. కానీ, ఆ సీటు చివ‌ర‌కు సీనియ‌ర్ నేత అయిన బండారు ద‌త్తాత్రేయ‌కే అధిష్ఠానం కేటాయించ‌గా ఆయ‌న గెలుపొంది కొంత‌కాలం కేంద్ర‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. వాస్త‌వానికి, గ‌త ఎన్నిక‌ల్లో కిష‌న్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి ఉంటే కేంద్రమంత్రి అయ్యేవారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో, ఈ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కిష‌న్ రెడ్డి మ‌రోసారి దృష్టిపెట్టారు. ఇటీవ‌లి ఓట‌మితో కిష‌న్ రెడ్డి ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంది. పైగా న‌గ‌రంలో ఆయ‌న‌కు మంచి పేరుంది. దీంతో ఆయ‌న నిల‌బ‌డితే బీజేపీ గ‌ట్టి పోటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. అయితే, కిష‌న్ రెడ్డి కోరిక ఈసారి కూడా నెర‌వేరే అవ‌కాశాలు త‌క్కువే అంటున్నారు.ఇక్క‌డి నుంచి మ‌రోసారి పోటీకి బండారు ద‌త్తాత్రేయ సిద్ధ‌మ‌వుతున్నారు. ఆయ‌న‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ కూడా ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీసీ కార్డు కూడా తెర‌పైకి వ‌స్తోంద‌ని స‌మాచారం. కిష‌న్ రెడ్డిని చేవెళ్ల పంపించే ఆలోచ‌న కూడా అంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మొత్తానికి, గ‌త ఎన్నిక‌ల్లో కోల్పోయిన అవ‌కాశం కిష‌న్ రెడ్డికి ఈ ఎన్నిక‌ల్లోనైనా ద‌క్కుతుందో లేదో చూడాలి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్న కాషాయ పార్టీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని ఎంపిక చేస్తుందో చూడాలి.

Related Posts