YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీ కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములా

 టీ కాంగ్రెస్ గుజరాత్ ఫార్ములా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని గుణపాఠంగా తీసుకున్న టీపీసీసీసీ పార్లమెంటు ఎన్నికల‌కు వ్యూహాత్మ‌కంగా సిద్ధ‌మ‌వుతోంది. ఎంపీ ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెలుచుకునే విధంగా వ్యూహరచన చేస్తోంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలో దిగాలని ప్రతిపాదించింది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌కు గుజ‌ర‌త్ ఫార్ములా ధైర్యానిస్తోంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. గుజరాత్‌ తరహాలో సామాజిక కార్యకర్తలను ఎన్నికల బరిలో దించనుంద‌ని స‌మాచారం. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప‌యోగించిన ఫార్ములాను తెలంగాణ‌ లోక్‌సభ స్థానాల్లో అమలు చేయాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. గుజరాత్‌లో సామాజిక ఉద్యమకారులు హార్ధిక్‌ పటేల్‌, జిగ్నేశ్‌ మేవానీ, అల్పేష్‌ ఠాకూర్‌తో బీజేపీకి  ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్‌.. తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు రిజర్వ్‌డ్‌ స్థానాలకు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలు, తటస్థులు, కాంగ్రెస్ సానుభూతిపరులకు టికెట్లు ఇస్తూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే భిన్నంగా ఉద్యమకారులను బరిలో దించే అంశాన్ని పరిశీలిస్తోంది. దళిత, గిరిజన హక్కుల కోసం పోరాడిన సామాజిక ఉద్యమకారులను గుర్తించి, టికెట్లు కేటాయిస్తే ఎలా ఉంటుందన్నవిషయంపై టీపీసీసీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. 
ఈ క‌స‌ర‌త్తులో భాగంగా, ఆదిలాబాద్‌ ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానానికి ఆదివాసీ ఉద్యమ నేత సోయం బాబూరావు,  మహబూబాబాద్‌ ఎస్టీ రిజర్వుడ్  స్థానం నుంచి లంబాడ హక్కుల పోరాట సమితి నేత  బెల్లయ్యనాయక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మందకృష్ణ మాదిగకు వరంగల్‌ లోక్‌సభ సీటు ఇవ్వాలని నిర్ణయించింది. నాగర్‌ కర్నూల్‌ సీటును సతీశ్‌ మాదిగకు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. మాల మహానాడు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్‌ను పెద్దపల్లి లోక్‌సభ  స్థానం నుంచి పోటీ చేయించాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.  పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో  అదే సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌ను రంగంలోకి దింపితే కాంగ్రెస్‌కు లాభం జరుగుతుందని భావిస్తున్నారు. టీ కాంగ్రెస్ ఫార్ములా ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే. 

Related Posts