YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తాగుకు సరే.. మరి సాగుకు…?

తాగుకు సరే.. మరి సాగుకు…?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జిల్లాలోని అన్ని పల్లెలకు మార్చి నెలలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా అవసరాలకు ఎంత నీరు అవసరమనే దానిపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం గోదావరి నదిలో సుమారు 29 టీఎంసీల నీరు ఉంది. ఈ పరిస్థితుల్లో సాగుకు నీరు వినియోగిస్తే నీటి నిల్వ తగ్గిపోయి భగీరథకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. దీంతో ఎత్తిపోతలకు నీటిని నిలిపివేయాలని నిశ్చయించారు. 
జిల్లా సాగునీటి అభివృద్ధి శాఖ నుంచి విద్యుత్తు శాఖకు నాలుగు రోజుల క్రితం లేఖ రాశారు. ఎత్తిపోతల పథకాలకు తాత్కాలికంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని కోరారు. ఈ లేఖను పథకాల కమిటీలకు పంపించారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే పంట చివరి దశలో ఎలా ఉంటుందోనని కలవర పడుతున్నారు. 
జిల్లాలో పంటల సాగుకు ఎత్తిపోతల పథకాలే ప్రధాన ఆధారం. గోదావరి నది బేసిన్‌లో చిన్నవి, మధ్య తరహా కలిపి మొత్తం 22 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి ఆధారంగా సుమారు 1.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవటంతో ప్రాజెక్టులో సుమారు 80 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. దీంతో రెండు పంటలకు ఎలాంటి ఢోకా లేదని రైతులు భావించారు. ఖరీఫ్‌లో ఇబ్బందులు లేకుండా సాగును పూర్తి చేశారు. 
రబీలో మాత్రం ఆదిలోనే అవరోధాలు ఏర్పడుతున్నాయి. పంట ప్రారంభ సమయంలో అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవటంతో రైతులు సాగుకు ఆరంభించారు. ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టారు. ఈ సమయంలో సాగునీటిని నిలిపివేస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింటుందని వాపోతున్నారు. 

Related Posts