YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మోదీని ఒప్పించి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు నైనా సాధించరా! కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి

మోదీని ఒప్పించి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు నైనా సాధించరా!                 కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  
ఎన్డీయే ప్రభుత్వ ఐదేళ్ల పాలనకు మద్దతిచ్చిన సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని ఒప్పించి తెలంగాణకు కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా సాధించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు, పథకాలు తీసుకురావడంలో తెరాస సర్కార్‌ ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు వచ్చాయని, ఆ సమయంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పారు. తెరాస పాలనలో రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలను అణచివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెరాస పాలనలో ప్రజాస్వామ్యం, నైతిక విలువలు అపహాస్యం పాలయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని తెరాస నేతలు చూస్తున్నారన్నారు. తెలంగాణ ఇచ్చి అన్ని రకాలుగా త్యాగం చేసిన కాంగ్రెస్‌ పార్టీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జానా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మోదీని కేసీఆర్‌ పల్లెత్తు మాట అనలేదు: కోమటిరెడ్డి
గత ఎన్నికల్లో మోదీ ఛాయ్‌వాలా అని, పేదల కోసం పనిచేస్తానంటూ మాటలు చెప్పారని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానంటూ ప్రజలకు స్వర్గం చూపించారన్నారు. అనిల్ అంబానీ‌, నీరవ్ మోదీ‌ తదితర పారిశ్రామికవేత్తల కోసమే మోదీ పనిచేశారని మండిపడ్డారు. అవిశ్వాసం నుంచి మొదలుకొని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, నోట్లరద్దు, జీఎస్టీకి కేసీఆర్‌ మద్దతిచ్చారని.. అలాగే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచినా పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. దేశానికి యువనాయకత్వం అవసరమని, కనీస ఆదాయ పథకంతో ఈ ఎన్నికల్లో ముందుకొస్తున్నట్టు చెప్పారు. ప్రధాని పదవికి రాహుల్‌ అన్నివిధాలా అర్హుడని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. త్యాగాల పునాదుల మీద నిలిచిన కుటుంబం నుంచి రాహుల్‌ వచ్చారని చెప్పారు.
నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ ఇంఛార్జిగా సంపత్‌
మాజీ మంత్రి డీకే అరుణ భాజపాలో చేరిన నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంటరీ ఇంఛార్జి బాధ్యతలను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు అప్పగించినట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు.  గద్వాల బాధ్యతలను డీకే సమరసింహారెడ్డి చూస్తారన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఇంఛార్జిగా మల్‌రెడ్డి రంగారెడ్డిని నియమించినట్టు వెల్లడించారు.  

Related Posts