YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎన్నికల వేళ ఎన్ని ప్రత్యేకతలో..!

ఎన్నికల వేళ ఎన్ని ప్రత్యేకతలో..!
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నెల్లూరు: రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. రెండు రుతుపవనాల కాలంలో ఇక్కడ వర్షాలు పడతాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నీటి వనరులు ఉన్నాయి. అందుకు అనుగుణంగా 30 రకాల పంటలు ఇక్కడ సాగులో ఉన్నాయి. నాలుగున్నర లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వీరు ఇప్పుడు తాము సాగు చేసిన పంటలకు అధిక దిగుబడులు వస్తే తమ పంట పండుతుందని ఆశిస్తున్నారు. ఇందుకోసం ముమ్మరంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు రాజకీయ రంగంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడి నుంచి బెజవాడ గోపాలరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి వంటి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిద్దరికంటే ఆలస్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దేశానికి ఉపరాష్ట్రపతిగా కొలువు దీరారు. ఏసీ సుబ్బారెడ్డి, బెజవాడ రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బెజవాడ పాపిరెడ్డి వంటి రాజకీయ ఉద్దండులు నెల్లూరు వాణిని రాష్ట్రం నలు చెరగులా వినిపించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటువంటి ఈ జిల్లాలో ఇప్పుడు ఒకేసారి 17వ లోక్‌సభ, ఈ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండోసారి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. నెల రోజులకన్నా తక్కువ వ్యవధిలో ఇక్కడ అభ్యర్థుల తలరాతను మార్చే ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో తమకు ఓట్ల పంట పండాలంటూ నాయకులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కృషీవలురతో పోటీ పడుతున్నారు.
రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ 146 టీఎంసీల నీటిని నిల్వ చేసే సోమశిల, కండలేరు జలాశయాలున్నాయి. 30 టీఎంసీల నీటిని నిల్వ చేసే చెరువులున్నాయి. జిల్లాలో 110 కి.మీ పొడవునా ప్రవహించే పెన్నానది ఉంది. చిత్తూరు జిల్లాలో పుట్టిన స్వర్ణముఖి నది చివరకు సముద్రంలో చేరేది జిల్లాలోనే కావడం విశేషం. కాళంగి, గొడ్డేరు, పాముల కాల్వ, నెర్రి కాలువ, సోమశిల జలాశయానికి అనుబంధంగా కండలేరు జలాశయం, తెలుగు గంగ పథకంకి అనుగుణంగా పలు కాలువలున్నాయి. వీటన్నిటితో పాటు కాలువలు, వాగులు, వంకలు జిల్లా నలువలలా ఉన్నాయి. జిల్లాలో ఏటా సాధారణంగా 1080.4 మి.మీ వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య రుతుపవనాల సమయంలో అధికంగా, నైరుతి రుతు పవనాల సమయంలోనూ వర్షం లభించే అవకాశం ఉంది.
జిల్లా మొత్తం విస్తీర్ణం 32,31,160 ఎకరాలు కాగా ఇందులో 10,39,850 ఎకరాలకు సాగునీటి వసతి ఉంది. వరి పంట అధికంగా సాగులో ఉంది. వరి పంటతో పాటు చెరకు, పత్తి, వేరుసెనగ, జొన్న, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, ఉలవ, పొద్దుతిరుగుడు, బత్తాయి, బొప్పాయి, నిమ్మ, మిరప, నువ్వులు, పసుపు, ఉల్లిపాయలు, కూరగాయలు, సజ్జ, రాగి వంటి పంటలు సాగులో ఉన్నాయి. వీటితో పాటు చేపలు, రొయ్యల సాగు ఉంది.
జిల్లాలో సన్న కారు రైతులే ఎక్కువగా ఉన్నారు. 3,08,612 మంది సన్నకారు రైతులుంటే, వీరు 3,26,306 ఎకరాల భూమిలో పంటలు సాగు చేస్తున్నారు. 96,262 మంది చిన్నకారు రైతులు 3,18,879 ఎకరాలు, 54 వేల మంది మధ్యతరగతి రైతులు 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా, రెండువేల మంది పెద్ద రైతులు 80 వేల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు.
ఇదే సమయంలో ఇప్పుడు జిల్లాలో ఓట్ల పంట పండించాలని నాయకులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు వ్యవసాయ క్షేత్రాలు ఆధారమైతే, నాయకులకు నియోజకవర్గాలు క్షేత్రాలుగా ఉన్నాయి. వీరు ఓటర్లను పంటగా భావిస్తున్నారు. వారి నుంచి తమకు ఓట్ల పంట పండాలని తాపత్రయ పడుతున్నారు.
రైతులు మాత్రం మంచి దిగుబడులకు పంటకు అవసరమైన ఎరువులు వినియోగిస్తుంటే, నాయకులు మాత్రం లెక్కకు మిక్కిలిగా వాగ్దానాలు చేస్తూ, ఆఖరున ఒకేసారి తాయిలాలు అందించి తమ పంట పండాలని ఓటర్లను ప్రస్తుతానికి దేవుళ్లుగా భావించి మొక్కుకుంటున్నారు. వీరిలో ఎవరికి ఎక్కువ ఓట్ల పంట పండితే వారు చట్ట సభకు ఎన్నికవుతారు. రైతులను మాత్రం ఈసారి పంట బాగా పండినా, నిరుటి అప్పులు, నష్టాలు వెంటాడుతునే ఉంటాయి. వీరి జీవితం మాత్రం సాదాగానే సాగుతుంది. ఓట్ల పంట పండించుకున్న నాయకులు మాత్రం ఒక్కసారిగా తమ స్థాయిని పెంచుకుంటారు. అవకాశం వస్తే మంత్రులూ అవుతారు. 
వరుసగా రెండేళ్ల నుంచి వర్షాభావం కారణంగా జిల్లాలో వరి సాగు ఈసారి తగ్గింది. సోమశిల జలాశయం ఆధారంగా సుమారు 3.5 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. రైతులు జిలకర మసూరి, నెల్లూరు మసూరి, సుగర్‌ లెస్‌ వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంటల నుంచి ఎకరానికి నాలుగు పుట్ల వంతున దిగుబడులు రావాలని కృషి చేస్తున్నారు. సోమశిల జలాశయం ఆధారంగా సాగవుతున్న మాగాణి భూముల్లో ఇప్పుడు వరి పంట కోత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వెన్ను దశలో ఉంది. కనిగిరి రిజర్వాయర్‌కు దిగువ ప్రాంతాల్లో ఇప్పుడు వరి కోతలు పూర్తి చేసిన రైతులు ఫిల్టరు పాయింట్ల ఆధారంగా రెండో పంట సాగుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పుడు నిమ్మకాయలకు గిరాకీ బాగా ఉంది. 50 వేల ఎకరాల్లో సాగులో ఉన్న నిమ్మ పంట బాగా పండితే తమ పంట పండుతుందని నిమ్మ రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా శక్తికి మించి కృషి చేస్తున్నారు.
జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో 22,06,652 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 11,23,625 మంది, పురుష ఓటర్లు 10,82,690 మంది ఉన్నారు. వీరినే ఇప్పుడు నాయకులు నమ్ముకున్నారు. జిల్లాలో తెదేపా, వైకాపాల నుంచి 20 మంది నాయకులు నియోజకవర్గాల నుంచి శాసనసభ బరిలో ఉండనున్నారు. వీరితో పాటు నెల్లూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మరో నలుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరందరూ ఇప్పుడు తమకు ఓట్ల పంట పండాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Posts