YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీని నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు

మోడీని నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయేను నిలువరించడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మే 23న సమావేశాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి యూపీయే భాగస్వామ్య పక్షాలతోపాటు తటస్థ పార్టీలకు కూడా ఆహ్వానిస్తూ సోనియా గాంధీ లేఖలు రాశారు. మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడతున్నందున ప్రజా తీర్పు తర్వాత మోదీ వ్యతిరేక పార్టీలు ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు ఈ సమావేశం దిశనిర్దేశం చేసేలా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. అటు ఎన్డీయే, ఇటు యూపియేలో భాగస్వాములు కాకుండా తటస్థంగా ఉన్న పార్టీలను కూడా సోనియా గాంధీ 23వ తేదీ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పటికే కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతోన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా ఆమె ఆహ్వానాలు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ స్వయంగా మాట్లాడి 23న జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఇక, ఒడిశాను అతలాకుతలం చేసిన ఫణి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించడం పట్ల ఆసక్తిరమైన చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ ఎన్డీయేకు రాదని గుర్తించిన మోదీ.. నవీన్‌ పట్నాయక్‌ను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఫణి తుఫాను సాయం కింద రూ.1,000 కోట్లు ప్రకటించారని అంటున్నారు. అయితే, కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్ 23వ తేదీ సమావేశానికి హాజరు కావడమనేది ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల కిందట డీఎంకే నేత స్టాలిన్‌ను కలిసినప్పుడు యూపీయేకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు, మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... రాహుల్ గాంధీ దేశం కోసం తాపత్రయపడే ఓ మంచి నాయకుడంటూ ప్రశంసలు కురింపించారు. అంతేకాదు, 1996 మాదిరిగా కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీయేతర పక్షాలు ప్రయత్నించి మరో తప్పిదానికి పాల్పడవని భావిస్తున్నట్టు తెలిపారు.

Related Posts