YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయనగరంలో 28 శాతమే నాట్లు

విజయనగరంలో 28 శాతమే నాట్లు

ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రెండు నెలలు దాటిపోయింది. విజయనగరం జిల్లాలో 28 శాతమే నాట్లు పడ్డాయి. సరైన వర్షాలు పడక పొలాల్లో  ఉభాలు జరగట్లేదు. జిల్లాలో జూన్‌ 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ సరాసరిన 381 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 299 మి.మీ. మాత్రమే కురిసింది. ప్రధానంగా జామి, బొబ్బిలి, మెరకముడిదాం, ఎల్‌.కోట, పాచిపెంట, గంట్యాడ, మక్కువ, కొమరాడ, భోగాపురం, ఎస్‌.కోట, బాడంగి, సాలూరు తదితర 21 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. జిల్లాలో సుస్థిర వ్యవసాయానికి అవకాశముందని చెప్పుకునే సాగునీటి ప్రాజెక్టుల దిగువ భూములకు తిప్పలు తప్పట్లేదు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న విస్తీర్ణం 1,13,093కు 25,478 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయంటే ప్రాజెక్టుల్లో నీటిమట్టాల పరిస్థితిని అంచనా వేయొచ్చు. దాదాపుగా సాగునీటి ప్రాజెక్టులన్నింట్లోనూ నీటి మట్టాలు అడుగంటిపోయాయి. తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 105 మీటర్లకు గాను 104 మీటర్ల వరకూ నీరుంది. ఒకవిధంగా చెప్పాలంటే జిల్లాలోని ప్రాజెక్టులన్నింట్లోకి తోటపల్లి ఒక్కటే కాసింత మెరుగని చెప్పొచ్చు. వెంగళరాయ్‌సాగర్‌లో 161 మీటర్లకు  156.97 మీటర్లు, పెద్దగెడ్డలో 213.8 మీటర్లకు 207.72 మీటర్లు, వట్టిగెడ్డ జలాశయంలో 121.62 మీటర్లకు 117.44 మీటర్ల మేర నీటి మట్టాలున్నాయి. తాటిపూడి ప్రాజెక్టులోనైతే 297 అడుగులకు 274 అడుగుల వరకే నీరుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టుల కింద 50 శాతం ఆయకట్టుకైనా నీరందదని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం నీరు కిందకు వదిలినా ఎక్కువ దూరం వెళ్లగలిగే పరిస్థితి లేదు. ఇక చివరాయకట్టు రైతుల పరిస్థితైతే ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. సాధారణంగా నీటి మట్టాలు బాగుంటేనే కాలువలు బాగోక, నీరు చివరి వరకూ రాక పంటలు ఎండిపోతున్నాయని గగ్గోలు పెట్టే రైతాంగం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌కి నీటి మీద ఆశలు వదులుకోవడం నయమన్న భావనలో ఉన్నారు. దీంతో వరుణుడు కరుణించాలని, ప్రాజెక్టులు నిండాలని అన్నదాతలు ప్రార్థిస్తున్నారుజిల్లాలో చాలా ప్రాంతాల్లో చెరువులు సైతం ఎండిపోయాయి. కొన్ని మండలాల్లో అప్పుడప్పుడూ చిరుజల్లులు పడుతున్నా అది సాగుకి సరిపోయే వర్షం కానేకాదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎల్‌.కోట, కొత్తవలస మండలాల్లో ఇప్పటికే నారుమళ్లు ఎండుముఖం పట్టాయి. రైతాంగం వాటిని బతికించుకోవాలన్న తాపత్రయంతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చి బిందెలతో తడుపుకొంటున్నారు. మరికొందరైతే ట్యాంకర్లతో నీటిని కొనుక్కుని తెచ్చుకుని సైతం నారు తడిపించుకుంటున్నారు. వర్షాభావం కారణంగానే వరి పంట సాధారణ విస్తీర్ణం 1,19,530 హెక్టార్లు కాగా ఇప్పటివరకూ 33,748 హెక్టార్లలో మాత్రమే ఉభాలు జరిగాయి. మిగిలిన చోట్ల నారుమళ్లు వేసి ఇప్పటికే 25 రోజుల నుంచి 40 రోజులు గడవడంతో అవన్నీ ముదిరిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం నాలుగైదు రోజులు వర్షాలు పడితే తప్ప ఈ ఏడాది ఖరీఫ్‌ గట్టెక్కేలా కనిపించట్లేదు. నెలాఖరుకి పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలో కరవు తాండవించడం ఖాయం. మరోవైపు వరి సంగతి పక్కనబెడితే ఇతర పంటలైనా బాగా సాగయ్యాయా అంటే అదీ లేదు. జిల్లాలో మొత్తం ఖరీఫ్‌ విస్తీర్ణం 1,90,862 హెక్టార్లకు 84,250 హెక్టార్లలో మాత్రమే సాగు మొదలైందంటే పరిస్థితి అర్థం చేసుకోవొచ్చు.మరోవైపు ఇప్పటికే వేలాది ఎకరాల్లో నాట్లు వేసి 25 రోజుల నుంచి 40 రోజులు గడిచిపోవడంతో ఆ నారంతా ముదిరిపోతోంది. మరింత జాప్యమైతే ఆ నారుని ఊడ్చినా దిగుబడిపై పడటం ఖాయం.. అందుకే మరో రెండు వారాలు వేచి చూసి అప్పటికీ వర్షాలు రాకపోతే పొలాలు ఖాళీగా వదిలేయకుండా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకి జిల్లా వ్యవసాయశాఖ రెడీ అవుతోంది.

Related Posts