YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీలోనూ... పొలిటికల్ సైకోఫాన్సీ

బీజేపీలోనూ... పొలిటికల్ సైకోఫాన్సీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విభజించి పాలించు అన్నది దేశంలో బ్రిటిష్ కాలంలో వినిపించిన, కనిపించిన సిద్దాంతం. తాజాగా విపక్షాలు కకావికలమవుతుంటే.. కేంద్రంలోని అధికారపార్టీ అనూహ్యంగా బలపడుతోంది. ఆనాటి పొలిటికల్ స్ట్రాటజీలు నేటి భారత్ లోనూ వర్తిస్తుండటమే ఇందుకు కారణం. గుత్తాధిపత్య రాజకీయాలు దేశంలో స్థిరపడుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెసు పార్టీకి తిరుగుండేది కాదు. కానీ నెహ్రూ విధానాలతో విభేదించే అగ్రనాయకులుండేవారు. సర్దార్ పటేల్, అంబేడ్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ వంటి వారు సీరియస్ గానే ప్రధాని నిర్ణయాల పట్ల అసమ్మతి గళం వినిపించేవారు. అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్ వంటివారు ప్రధానులుగా కొనసాగిన కాలంలోనూ భిన్నాభిప్రాయాలకు కొంతమేరకు విలువ ఉండేది. ఇందిర హయాం నుంచి ఏకపక్ష రాజకీయ ధోరణులు ప్రబలుతూ వచ్చాయి. ఇండియా అంటే ఇందిరా గాంధీయే అంటూ కోటరీ పల్లవి అందుకోవడం. దానికి పార్టీ మొత్తం కోరస్ పాడటంతో పొలిటికల్ సైకోఫాన్సీ పతాకస్థాయికి చేరుకుంది. విధానాలు, సిద్ధాంతాల పరంగా వ్యక్తిపూజ కంటే వ్యవస్థీకృత విధానాలకు పెద్ద పీట వేసే బీజేపీ లోనూ ఈ ధోరణి క్రమేపీ ప్రబలుతోంది. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఇద్దరే అగ్రనాయకులు
కనిపిస్తున్నారు. బీజేపీ సిద్దాంతాలను వారు ముందుకు తీసుకెళుతున్న విధానంతో మిగిలిన నాయకులు వారి ముందు మరుగుజ్జులుగా మారిపోతున్నారు. నిర్ణయాలు అమలు చేసే పద్దతిలోనూ, వ్యూహాలు, ఎత్తుగడల్లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఇద్దరి అడుగు జాడలు అఖండభారత్ కు భవిష్యత్ కార్యాచరణగా మారుతున్నాయి.భారత్ లెక్కల ప్రకారం జమ్ముకశ్మీర్ లో మూడో వంతు భాగం ఇంకా పాకిస్తాన్ అధీనంలోనే ఉంది. అందులో కొంత భాగాన్ని చైనాకు ధారదత్తం చేసి మిత్రత్వాన్ని నడుపుతోంది పాక్. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనల సందర్భంగా హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన పాకిస్తాన్ లోనూ ప్రకంపనలు పుట్టించింది. పీఓకే కూడా తమ అజెండాలో ఉందని ఆయన విస్పష్టంగా చెప్పేశారు. కశ్మీర్ అంశానికి ముగింపు అంటే పీఓకే ను కూడా కలిపి చూడటమేనంటూ హోం మంత్రి పేర్కొనడంలో రాజకీయ వ్యూహం దాగి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఎటువంటి దుస్సాహసాలకు పాల్పడకుండా చెక్ చెప్పడం ఒక అంశం. మరింతగా
తెగిస్తే మొదటికే మోసం వస్తుందని దాయాదికి సంకేతాలు పంపడమే అమిత్ షా ఆంతర్యం. అదే సమయంలో తమ అజెండాలో ఆక్రమిత కశ్మీర్ ఉందనడం ద్వారా విపక్షాలకు కళ్లెం వేయడమూ లక్ష్యమే. ప్రజల్లో ఉండే భావోద్వేగాల నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్న వాదనను ప్రజల్లోకి పంపేందుకు హోం మంత్రి ప్రకటన దోహదం చేసింది. చాలా వ్యూహాత్మకంగా హోం మంత్రి ఈ రకమైన పద్ధతిని ఎంచుకున్నారని చెప్పాలి. నిజంగానే పీఓకేపై దాడి చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కచ్చితంగా యుద్దానికి దారితీయవచ్చు. చైనా పాకిస్తాన్ కు సహకరించే ప్రమాదమూ ఉంది. ఈవిషయాలన్నీ తెలిసి కూడా అమిత్ షా సాహసోపేతంగా మాట్టాడటం వెనక దేశంలోని మెజార్టీ ప్రజల్ని సంఘీభావం చేయడమనే ఉద్దేశం దాగి ఉంది.అమిత్ షా పార్లమెంటులో గట్టిగా దుమ్ము దులిపేశారు. కానీ ప్రధానమంత్రి జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో మరో ఎత్తుగడ మనకు కనిపిస్తుంది. దూకుడు కనిపించకుండా కశ్మీర్ విషయంలో పూర్వాపరాలపై ప్రధాని ద్రుష్టి సారించారు. పీఓకే అంశాన్ని తెలివిగా దాచేశారు. అట్టడుగు వర్గాలకు ఆరాధ్యదైవంగా భావించే అంబేద్కర్, సంస్థాలను విలీనం చేసి దేశానికి సమగ్ర స్వరూపాన్నిచ్చిన సర్దార్ పటేల్, జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామప్రసాద్ ముఖర్జీ ముగ్గురూ ఆర్టికల్ 370 ని
వ్యతిరేకించారని ప్రధాని చెప్పారు. దీంతో సంఘ్ పరివార్ వాదనకు బలం చేకూర్చడం, అంబేద్కర్, పటేల్ ల పట్ల అనేక వర్గాల్లో సుహ్రుద్భావం ఉంది. ఆయా వర్గాలను సైతం తమ వైఖరికి అనుగుణంగా మార్చుకోవడం లక్ష్యంగా కనిపిస్తుంది. రిజర్వుడ్ వర్గాలకు, మహిళలకు, స్థానిక మైనారిటీలైన హిందువులు, ఇతర వర్గాలకు కశ్మీర్ లో అన్యాయం జరుగుతోందని చెప్పడం ద్వారా దేశంలోని ఆయా వర్గాలను తాజా నిర్ణయానికి అనుకూలంగా సంఘటితపరచాలనే ఉద్దేశమూ కనిపించింది. అదే సమయంలో ప్రతిపక్షాలను మాట్లాడలేని నిస్సహాయ స్థితికి తోసేయాలని భావించారనుకోవచ్చు.భారతీయ జనతా పార్టీని, కేంద్రప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీల సంఖ్య బాగా పడిపోయింది. ప్రస్తుతం చేతివేళ్లమీద వాటిని లెక్కించవచ్చు. కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ ,
కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే తమ వ్యతిరేకతను చాటుకుంటున్నాయి. మిగిలిన చిన్నాచితక పార్టీలు లెక్కించదగినవి కావు. నరేంద్రమోడీ పట్ల తీవ్రంగా విరుచుకుపడే ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం కేంద్రానికి సహకరిస్తున్నారు. కాంగ్రెసులో కమలం చిచ్చు కొనసాగుతోంది. అధిష్ఠానం నిర్ణయాలను పార్టీలో అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజామద్దతు పొందుతున్నాయని పార్టీలు భావిస్తున్నాయి. స్వాతంత్ర్యానంతర కాలంలో కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల దశాబ్దాలపాటు ఏకచ్ఛత్రాధిపత్యం వహించింది. ఇప్పుడు కాంగ్రెసుతోపాటు అనేక ప్రాంతీయపార్టీలు, వామపక్షాలు ఉన్నప్పటికీ బీజేపీ రోజురోజుకీ బలపడుతోందంటే అందుకు కారణం నరేంద్ర మోడీ, అమిత్ షా ల విభజించి పాలించు రాజకీయాలే.

Related Posts