YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వైద్యానికి సుస్తీ.. (కృష్ణా జిల్లా)

వైద్యానికి సుస్తీ.. (కృష్ణా జిల్లా)

వైద్యానికి సుస్తీ.. (కృష్ణా జిల్లా)
కైకలూరు, :  నియోజకవర్గ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సేవలు అధ్వాన్నంగా ఉంది. ఇక్కడి సేవలు మాత్రం పీహెచ్‌సీకి ఎక్కువ, సీహెచ్‌సీకి తక్కువ అన్నట్లుగా ఉంటాయి. కొల్లేటి లంక గ్రామాలకు పెద్దదిక్కుగా ఉండాల్సిన ఈ ఆసుపత్రికి సుస్తీ చేసింది. వైద్యుల నిర్లక్ష్యం.. సిబ్బంది కొరత.. మందుల లేమి రోగుల పాలిట ప్రాణసంకటంగా తయారయ్యాయి. కైకలూరు నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. 30 పడకల ఆసుపత్రిగానే ఉండడంతో సౌకర్యాలు, నిధులు, మందులు తగినంతగా అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా శివారున ఉన్న కైకలూరు నియోజకవర్గంలో ప్రజలకు ఏ రకమైన వైద్యం అవసరమొచ్చినా జిల్లా కేంద్రానికో, విజయవాడ, గుడివాడ, ఏలూరు వైపో చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ దుస్థితిని తొలగించడానికి గత ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించిన కామినేని శ్రీనివాస్‌ చొరవ చూపారు. రూ. 10 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలను కల్పించి.. ఆసుపత్రి స్థాయిని పెంచారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి మంచి రోజులు వచ్చాయని, మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని భావించిన స్థానికుల సంతోషం ఎంతో కాలం నిలవలేదు. సిబ్బంది నిర్లక్ష్యం, వైద్యుల కొరత, మందుల లేమి, సమయపాలన లోపించడం.. ఇలా పలు సమస్యలతో కొట్టిమిట్టాడుతోంది. సమస్యల నడుమ సామాన్యులకు వైద్యసేవలు అందడం లేదు. భారమైనా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
కైకలూరు సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని సకల సౌకర్యాలతో నిర్మించి ఏడాది దాటుతున్నా ఇప్పటికీ 30 పడకల ఆసుపత్రిగానే కొనసాగుతోంది. ఈ ప్రాంతంతో పాటు పొరుగు జిల్లా ప.గోదావరి నుంచి కూడా వస్తుండటంతో నిత్యం 200 వరకు రోగుల సంఖ్య నమోదవుతోంది. ఇక్కడ వారికి సంతృప్తికరమైన సేవలు అందడంలేదు. 50 పడకల ఆసుపత్రిగా నిర్మించినా 30 పడకల నుంచి స్థాయి పెరగలేదు. వైద్యులు, నిధులు, మందుల కొరత వెక్కిరిస్తోంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రసవాలు జరగడం లేదు. ముఖ్యంగా శస్త్రచికిత్స చేసి ప్రసవం చేయాల్సి వస్తే ఏలూరు జిల్లా ఆసుపత్రికి లేదా ప్రైవేటు ఆసుపత్రులకు తరలించేస్తున్నారు. శస్త్రచికిత్స చేసేందుకు అన్ని వసతులున్నా చేయడానికి మాత్రం వైద్యులు ముందుకు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల ఓ గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో మృత శిశువుకు జన్మనిచ్చింది.  వైద్యులు ఉండాల్సిన సమయాల్లో ఆసుపత్రిలో లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతకు ముందు కైకలూరుకు చెందిన విశ్రాంత ఉద్యోగికి ఏకంగా కాలం చెల్లి సంవత్సరం గడిచిన మాత్రలను ఇచ్చారు. రోగాలను నయం చేసి ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుల నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారుతోంది. నిత్యం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఏమాత్రం సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు ఆలస్యంగా వస్తున్నారు. ప్రస్తుతం జ్వరాల సీజన్‌ కావడంతో వారు వచ్చేటప్పటికే ఆసుపత్రి రోగులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. ఓపీ కోసం డాక్టర్‌ వద్ద గంటల కొద్ది వేచి ఉండలేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి ఓపిక నశించేలా చేస్తున్నారు. కనీసం రోగులకు మర్యాద కూడా ఇవ్వకుండా సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
జిల్లా శివారును ఉన్న ఈ సామాజిక ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కొల్లేరు లంక గ్రామాలకు దగ్గరలో ఉన్న పెద్దాసుపత్రి ఇదే కావడంతో నిత్యం ఎంతో మంది కుక్క, పాము కాట్లతో వస్తున్నారు. ఒక్కోసారి ఇక్కడ మందులు నిల్వ లేకపోవడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఆరోగ్యకేంద్రంలో వైద్యులు సైతం అంతంత మాత్రంగానే ఉన్నారు. ప్రస్తుతం సూపరింటెండెంట్‌, ఒక గైనకాలజిస్టు, మరో వైద్యురాలు మాత్రమే విధులను నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లల వైద్యురాలు ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్నారు. సహజ సర్జన్‌ (డీసీఎస్‌), దంత వైద్యుడు, స్టాఫ్‌నర్సు, రేడియాలజిస్ట్‌, తోటి వంటి సిబ్బంది లేరు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో ఒకరు సెలవు పెడితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

Related Posts

0 comments on "వైద్యానికి సుస్తీ.. (కృష్ణా జిల్లా)"

Leave A Comment