YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బీజేపీ వైపు రఘరామరాజు చూపు

బీజేపీ వైపు రఘరామరాజు చూపు

బీజేపీ వైపు రఘరామరాజు చూపు
న్యూఢిల్లీ, నవంబర్ 21, 
 వైఎస్ఆర్సీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును పార్లమెంట్ హాలులో ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన లోక్ సభలో.. తెలుగు భాష గురించి మాట్లాడటం.. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్‌కు ఆగ్రహం తెప్పించింది. పశ్చిమగోదావరి జిల్లా ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డి వద్ద నర్సాపురం ఎంపీ తీరు పట్ల జగన్ అసహనం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. ఎంతటి వారైనా సరే.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే.. వేటు తప్పదని జగన్ హెచ్చరించారు.పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీలతో సమావేశమైన జగన్.. విజయసాయి రెడ్డి లేనిదే ప్రధాని మోదీని నేరుగా కలవద్దని సూచించారని సమాచారం. కానీ నర్సాపురం ఎంపీ లోక్ సభలో తెలుగు భాష గురించి మాట్లాడటం.. ఇప్పుడు ప్రధాని మోదీ ఆయన్ను ఆప్యాయంగా పలకరించి భుజం తట్టడం.. రాజుగారూ బాగున్నారా అని తెలుగులో పలకరించడం.. తోటి వైఎస్ఆర్సీపీ ఎంపీలను ఆశ్చర్యపరిచింది.ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి.. మళ్లీ టీడీపీలోకి వెళ్లారు. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి.. నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి నాగబాబు మీద గెలుపొందారు.ఏపీలో ఎలాగైనా ఎదగాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఆపరేషన్ కమలంలో భాగంగా ఇప్పటికే టీడీపీ రాజ్యసభా పక్షాన్ని తమలో విలీనం చేసుకుంది. ఇప్పుడు ఆ పార్టీ కన్ను వైఎస్ఆర్సీపీ ఎంపీలపై పడిందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనమయ్యాయి.అక్రమ ఆదాయం కేసుల్లో జనవరి నాటికి జగన్ బెయిల్ రద్దవుతుందని. ఆయన జైలుకు వెళ్తారని.. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన 14 మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్తారని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. సీబీఐ కోర్టులో విచారణకు జగన్ ప్రతివారం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని న్యాయస్థానం తీర్పు వెలువరించిన నాటి నుంచి ఈ ప్రచారం మొదలు కావడం గమనార్హం. ఈ 14 మంది పార్లమెంటు సభ్యులు బీజేపీలో చేరేందుకు రఘురామకృష్ణంరాజు రంగం సిద్ధం చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయిపార్టీలో తమకు ప్రాధాన్యం లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. జగన్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని వారు విజయసాయి రెడ్డి దగ్గర వాపోయారని వార్తలొచ్చాయి. దీంతో వైఎస్ఆర్సీపీ పట్ల అసంతృప్తితో ఉన్నవారిని బీజేపీ తమవైపు లాగేసుకుంటుందని చెబుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండ్రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్.. ఢిల్లీలోని నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు నివాసంలోనే ఉన్నారని టీడీపీకి చెందిన కొందరు ప్రచారం చేస్తున్నారు. నర్సాపురం ఎంపీ ఆధ్వర్యంలోనే పవన్.. బిజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులను కలిశారని ప్రచారం జరుగుతోంది.తెలుగు భాషపై తాను చేసిన వ్యాఖ్యల్లో ప్రభుత్వ తీరును ఎక్కడా తప్పుబట్టలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. జగన్ కోరితే వివరణ ఇస్తానని తెలిపారు. ఈ వివాదం సమసిపోతుందనుకున్న తరుణంలో.. ఆయన్ను ప్రధాని స్వయంగా పలకరించడంతో.. ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయ్యింది.ఇక పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటన విషయానికొస్తే.. అది ఆయన వ్యక్తిగత పర్యటన అని జనసేన చెబుతోంది. ఆయన ఢిల్లీ టూర్‌కు సంబంధించి ఎక్కడా లీక్ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ తన అన్నయ్య నాగబాబును ఓడించిన రఘురామకృష్ణంరాజు నివాసంలోనే జనసేనాని బస చేశారని వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవు. అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారే తప్ప.. శత్రువులు ఉండరు.

Related Posts