YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అందని బంధు (ఆదిలాబాద్)

అందని బంధు (ఆదిలాబాద్)

అందని బంధు (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, డిసెంబర్ 05 ఉమ్మడి జిల్లాలో ఉన్న అటవీహక్కు పత్రాలు ఉన్న గిరిజన రైతులకు అందాల్సిన ఖరీఫ్‌ పెట్టుబడి సాయం ఇంకా అందలేదు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం నిరుపేద రైతులకు మేలు చేకూర్చినా అధికారుల తప్పిదాల వల్ల చాలా మంది పెట్టుబడి సాయానికి దూరం అవుతున్నారు. హక్కు పత్రాలను సరిచేసేలా చర్యలు తీసుకోకపోవడంతో కొంత మంది గత ఖరీఫ్‌, రబీలో అందించిన పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు. ఈ ఏడాదికి సంబంధించిన ఖరీఫ్‌ పెట్టుబడి సాయం సాధారణ రైతులకు అందించారు. అటవీహక్కు పత్రాలు ఉన్న రైతులకు ఇప్పటి వరకు ఖరీఫ్‌ సాయం అందలేదు. పట్టాలు ఉన్న రైతులతో పాటు అటవీ హక్కుల చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పత్రం కలిగి ఉన్న రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో 38,785 మంది రైతులు అటవీహక్కు పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. గతంలో హక్కు పత్రాలు ఉండి, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి పెట్టుబడి సాయాన్ని అందించారు. హక్కు పత్రం కలిగిన వారిలో కొంత మంది మృతి చెందారు. మరి కొంతమంది వివరాలు లభ్యం కాలేదు. కొందరు ఆ గ్రామాలను విడిచి వేరే గ్రామాలకు వెళ్లారు. కొంత మంది పేర్లు తప్పుగా ఉన్నాయి. మరికొంతమంది ఫొటోలు వేర్వేరుగా ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో 8,844 మంది పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు. కొంత మంది కొన్నేళ్లుగా భూములు సాగు చేస్తున్నా.. అటవీహక్కు పత్రాలు లేవు. కొత్తగా అటవీహక్కు పత్రాలు ఇవ్వకపోగా, గతంలో తప్పుగా ఉన్న వాటిని సవరించకపోవడంతో గిరిజన రైతులు పెట్టుబడి సాయాన్ని పొందలేని పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా జిల్లాలో అటవీ భూములను సాగు చేస్తూ పంటలు పండిస్తున్న గిరిజన రైతులకు గత ప్రభుత్వం అటవీహక్కు పత్రాలు ఇచ్చింది. మొదట్లో వాటిపై బ్యాంకులు పంట రుణాలు ఇచ్చాయి. ప్రభుత్వాలు మారిన తరువాత రుణాలు ఇవ్వడం మానేశాయి. అప్పటి నుంచి గిరిజన రైతులు సొంత పెట్టుబడితో సాగు చేసుకుంటున్నారు. పట్టాపాస్‌ పుస్తకాలు లేకుండా కేవలం పోడు వ్యవసాయం చేసుకునే నిరుపేద గిరిజనులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలోనే అటవీహక్కు పత్రాలు గిరిజనుల వద్ద ఉండటంతో వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. తరువాత సాయం అందించే సమయంలో క్షేత్రస్థాయిలో అనేక లోటుపాట్లు వెలుగుచూశాయి. అన్ని వివరాలు సరిగా ఉన్న వారికి సాయాన్ని అందించి, మిగిలిన వారికి తిరస్కరించారు. గతంలో సాయాన్ని అందించే సమయంలో తప్పుల వారీగా వర్గీకరించారు. ఈ లెక్కన కేవలం ఆదిలాబాద్‌ జిల్లాలో పత్రాలు ఉండి చనిపోయిన వారు 1233 ఉన్నారు. వీరి స్థానంలో పేరు మార్చి కొత్త అటవీహక్కు పత్రం ఇచ్చి రైతుబంధు సాయం అందించాల్సి ఉంది. జిల్లాలో పెట్టుబడి సాయం కింద చెక్కులు ఇచ్చే సమయంలో 1812 మంది రైతుల వివరాలు లభ్యం కాలేదు. వారు వలస వెళ్లి ఉండటం లేదా అందుబాటులో లేని వారిగా గుర్తించారు.. గతంలో అటవీహక్కు పత్రాలు ఉన్న రైతులను గుర్తించి, వాటిని సరిచేసి గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాల్సిన బాధ్యత అధకారులపై ఉంది. ఈ ఏడాది సాధారణ రైతులకు ఖరీఫ్‌ సాయం అందించిన ప్రభుత్వం అటవీహక్కు పత్రాలు ఉన్న గిరిజన రైతులకు ఇవ్వలేదు. వీరి వివరాలు సేకరించి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ పంపించినా.. నిధులు లేక సాధారణ రైతుల్లో 35 వేల మందికి, గిరిజన రైతుల్లో 28 వేల మందికి ఖరీఫ్‌ సాయం అందలేదని తెలిసింది. రబీ ప్రారంభమైన ఖరీఫ్‌ సాయం అందకపోవడం, గతంలో ఉన్న అటవీహక్కు పత్రాల్లో ఉన్న లోటుపాట్లు సవరించకపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకొని అవసరమైన రైతుల అటవీహక్కు పత్రాల్లో చేర్పులు, మార్పులు చేస్తే నిరుపేద గిరిజన రైతులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం అందే అవకాశముంది.

Related Posts