YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నీటికి కొరత లేదు (మహబూబ్ నగర్)

నీటికి కొరత లేదు (మహబూబ్ నగర్)

నీటికి కొరత లేదు (మహబూబ్ నగర్)
మహబూబ్ నగర్, డిసెంబర్ 05 : ఉమ్మడి జిల్లాలోని ఎత్తిపోతల పథకాల ద్వారా రబీలో 2,93,650 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించాలనే దానిపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వం వద్దకు పంపించారు. అక్కడి నుంచి అనుమతి వస్తే ఈ యాసంగికి పాలమూరు ప్రాజెక్టుల ద్వారా సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టులో జూరాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఇప్పటి వరకు ఎగువ నుంచి జూరాలకు సుమారుగా 1,300 టీఎంసీల వరద వచ్చి చేరింది. వీటిని నెట్టెంపాడు, కోయిలసాగర్‌, భీమా ఎత్తిపోతల పథకాల ద్వారా తోడిపోతను కొనసాగించారు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలకు సుమారు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులను, జలాశయాలను నింపారు. శ్రీశైలం జలాశయం ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని జలాశయాలను నింపారు. ఈ నెల మొదటి వారం వరకు వరద జలాలు పోటెత్తడంతో ప్రస్తుతం జలాశయాల్లో నీళ్లు వచ్చి చేరాయి. దీంతో ఈ రబీలో పంటలకు సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన సాగునీటి పారుదలశాఖ అధికారుల అత్యున్నత స్థాయి సమావేశంలో మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టుల ద్వారా ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలనే దానిపై చర్చించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందితే ఈ రబీలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
యాసంగిలో ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా అత్యంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 1.86 లక్షల ఎకరాలను సాగునీటిని అందించనున్నారు. తరవాత నెట్టెంపాడు, జూరాల ద్వారా 30వేల ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీరు అందనుంది. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఉండటంతో ఆర్డీఎస్‌ కాలువ ద్వారా మరో 20వేల ఎకరాలకు సాగునీరు రానుంది. కోయిలసాగర్‌, భీమా-2 ఆయకట్టు తక్కువగా ఉంది. ఇక్కడ నీటి లభ్యత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఈ ఎత్తిపోతల పథకాల జలాశయాల నుంచి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. యాసంగిలో నీటి విడుదలపై ఇప్పటికే రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది ఎత్తిపోతల పథకాల కింద రబీలో సైతం వరినాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రబీలో 1.30లక్షల హెక్టార్లలో వరినాట్లు వేయనున్నారని అధికారులు అంచనాలు వేశారు. దీంతో పాటు ఆరుతడి పంటలైన వేరుశెనగ, పప్పుశెనగను ఉమ్మడి జిల్లాల్లో రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ రెండు పంటలు కలిపి సుమారు 70వేల హెక్టార్లలో సాగు ఉంటుందని అంచనా. సాగునీటి పారుదల శాఖ అధికారులు మాత్రం ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటుండగా, రైతులు మాత్రం సాగునీరు అందుబాటులో ఉన్న ఆయకట్టు కింద వరి పంటలను వేయడానికి సిద్ధపడుతున్నారు. వీరికి ఎత్తిపోతల పథకాల నీరే ఆధారం. ఈ నేపథ్యంలో రైతులకు ఆశించిన స్థాయిలో రబీకి సాగునీరు సరఫరా జరుగుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని ఎత్తిపోతల పథకాల ద్వారా ఏ ఆయకట్టుకు ఎంత నీరు ఇవ్వాలనేదానిపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి  ప్రభుత్వానికి పంపించారు.

Related Posts