YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 బీహార్ లో కమలం ఆచితూచి అడుగులు

 బీహార్ లో కమలం ఆచితూచి అడుగులు

 బీహార్ లో కమలం ఆచితూచి అడుగులు
పాట్నా, జనవరి 14 
అసెంబ్లీ ఎన్నికల్లో వరస ఓటముల నేపథ్యంలో బీహార్ పై భారతీయ జనతా పార్టీ ఆచితూచి అడుగేస్తుంది. ఈ ఏడాది అక్టోబరు నెలలో జరగాల్సిన ఈ తూర్పు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆర్భాటపు ప్రకటనలకు దూరంగా ఉంది. వాస్తవిక థృక్పధంతో, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో సొంత బలంతో అధికారాన్ని చేపట్టాలని ఆశించి భంగపడింది. హర్యానాలో మిషన్ 70 పేరుతో ముందుకు వెళ్లినప్పటికీ తలబొప్పి కట్టింది. జార్ఖండ్ లో మిషన్ 60 పేరుతో హడావిడి చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కలేదు. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ చక్కని పనితీరు కనపర్చింది.మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలకు గాను కమలం 23 గెలుచుకోగా, అప్పటి మిత్రపక్షం శివసేన 18 చోట్ల విజయం సాధించింది. హర్యానాలో పదికి పది, జార్ఖండ్ లో పన్నెండులో పది స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడింది. ఈ చేదు అనుభవాల నేపథ్యంలో బీహార్ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని కమలం ఆలోచిస్తుంది. వాస్తవానికి గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అద్భుత విజయాలు ఏమీ సాధించలేదు. మొత్తం 40 లోక్ సభ స్థానాలకు గాను కమలం ఖాతాలో జమయింది పదిహేడు సీట్లు మాత్రమే. దాని మిత్రపక్షమైన రామ్ విలాస్ పాశ్వాని నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఆరు చోట్ల గెలుపొందింది. 16 స్థానాల్లో జేడీయూ విజయం సాధించింది. మిగిలిన ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ కనీసం ఖాతా సయితం తెరవలేకపోయింది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ పెద్దలు తొందరపాటు ప్రదర్శించడం లేదు.2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బీహార్ లో అద్భుతాలు సాధించినప్పటికీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమయింది. మొత్తం 243 స్థానాలకు గాను 81 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ 70 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 26 స్థానాలతో సరిపెట్టుకుంది. అంతటి ప్రభంజనంలోనే మూడో స్థానానికే బీహార్ లో పరిమితమైన బీజేపీ ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల్లో పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. మిత్రపక్షమైన జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నమ్మదగ్గ మిత్రుడిలా కన్పించడం లేదు. అయినప్పటికీ ఆయనతోనే కలసి నడవాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీది. నితీష్ తప్ప మిగిలిన లాలూ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీలు కమలం పార్టీకి బద్ధ శత్రువులు. వారితో కలసి ప్రయాణించడం అసాధ్యం. ఈ విషయాన్ని గ్రహించిన నితీష్ కుమార్ ఒక్కోసారి కొండెక్కి కూర్చుంటున్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం కు రాజ్యసభలో మద్దతు పలికిన జేడీయూ జాతీయ పౌర పట్టిక కు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. దాని వల్ల మైనారిటీల ఓట్లు పోతాయన్నది జేడీయూ భయం.ఈ నేపథ్యంలో జనతాదళ్ యు కు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించి మచ్చిక చేసుకోవాలన్నదది కమలనాధుల ఆలోచన. గతంలో ఈ విషయమై రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తగినన్ని పదవులు, ప్రాధాన్యం గల శాఖలు కేటాయించలేదన్న అలకతో జేడీయూ అసలు పదవులనే తిరస్కరించింది. ఒక్క కేబినెట్ పదవి ఇస్తామనడంతో అసంతృప్తితో ఉంది. తాజాగా స్వతంత్ర ప్రతిపత్తిగల ఓ సహాయ మంత్రి పదవి, మరో రెండు సహాయ మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉంది. మిత్రపక్షాలకు పదవులు కట్టబెట్టడం ద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్డి కలుగుతుందని బీజేపీ అంచనా. ప్రకాష్ జవదేకర్, హరదీప్ సింగ్ పూరి వద్ద గల అదనపు శాఖలను కొత్తవారికి సర్దుబాటు చేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచన. ఇప్పటికే కాషాయ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు రవిశంకర్ ప్రసాద్ (పాట్నా సాహిబ్), గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్), ఆర్కే సింగ్ (ఆరా), అశ్వనీకుమార్ చౌబే (బక్తర్), నిత్యానందరాయ్ (ఉజయ్ పూర్), మిత్రపక్షమైన ఎల్జీపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కేంద్రమంత్రివర్గంలో ఉన్నారు. వీరికి తోడు జేడీయూ నాయకులకు పదవులు కట్టబెట్టడం ద్వారా ఎన్నికల గోదారి ఈదాలన్నది బీజేపీ నాయకుల ఆలోచన. మరి ఏం చేయనున్నారో చూడాలి.

Related Posts