YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అస్తవ్యస్తం (అనంతపురం)

అస్తవ్యస్తం (అనంతపురం)

అస్తవ్యస్తం (అనంతపురం)
అనంతపురం, ఫిబ్రవరి 24(న్యూస్ పల్స్): జిల్లాలో ఇసుక సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే ఇంటి వద్దకే ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించినా కార్యాచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. గుర్తించిన రేవులు ఖాళీ కావడం.. ఆన్‌లైన్‌ సేవలు సక్రమంగా అందకపోవడం.. అక్రమ రవాణా.. అధికారులు ప్రత్యామ్నాయం చూపకపోవడంతో రోజురోజుకీ సైకతానికి డిమాండ్‌ పెరుగుతోంది. సకాలంలో ఇసుక అందక వినియోగదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిర్మాణాలు ఆగిపోతున్నాయి. అభివృద్ధి పనులపైనా ప్రభావం చూపుతోంది. ఇసుక లభ్యమయ్యే వాగులు, వంకలు జిల్లాలో 20 ఉన్నాయి. వీటిలో 10 వినియోగంలో ఉండగా.. 4 పనిచేయడం లేదు. 5 రేవులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. గోరంట్ల మండలంలోని మందలపల్లి రేవు ఇసుక నిల్వలు 36,000 మెట్రిక్‌ టన్నులు ఉన్నాయి. అయితే ఇక్కడ స్థానికంగా పంచాయతీ సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాకపోవడం, హాజరైనా తక్కువ మందికే పర్మిట్లు ఇస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. పర్మిట్లు ఉన్నా పోలీసులు వాహనాలను నిలిపేస్తున్న కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. రొళ్ల మండలం హొట్టెబెట్ట వంకలో ఇసుక తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. అదే మండలం దొడ్డేరి రేవులో 2250 టన్నులు గుర్తించినా, ఇసుక నాణ్యత లేకపోవడంతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఇంటి వద్దకే ఇసుక విధానం గత నెలలో జిల్లా వ్యాప్తంగా ఏపీఎండీసీ అధికారులు ప్రారంభించారు. యార్డులను ఐదు క్టస్లర్లుగా విభజించారు. ఆన్‌లైన్‌, శాండ్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఆన్‌లైన్‌ చేసుకునే సమయంలో తప్పులు దొర్లుతున్నాయి. వినియోగదారుడు తనకు సమీపంలో గానీ, తాను కోరుకున్న యార్డు నుంచి ఇసుకను బుక్‌ చేసుకుంటే.. వేరే యార్డులో నమోదు చేసుకున్నట్లు సందేశాలు వెళ్తున్నాయి.  వాగులు, వంకల్లో ఇసుకను తరలించాలంటే ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు పర్మిట్లు జారీ చేయాల్సి ఉంది. వినియోగదారులు అక్కడికక్కడే నగదు చెల్లించి, అనుమతి పత్రం ద్వారా ఇసుకను తీసుకెళ్లవచ్ఛు అయితే పంచాయతీ సిబ్బంది సకాలంలో రేవుల వద్ద పర్మిట్లు ఇవ్వడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా బుక్కరాయసముద్రం మండలంలోని నీలంపల్లి, పొడరాళ్ల రేవుల వద్ద అధికారులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదు. వారంలో రెండు మూడురోజులు మాత్రమే పర్మిట్లు ఇస్తున్నట్లు తెలిసింది. హిందూపురం మండలం సంతేబిదనూరు రేవుకు డిమాండ్‌ అధికంగా ఉంది. ఇక్కడ తక్కువ పర్మిట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇసుక డిమాండ్‌ ఉన్నా మరో రీచ్‌ను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.  జిల్లాలో ఇసుక నిర్వహణలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రీచ్‌ల గుర్తింపు, యార్డుల నిర్వహణ సక్రమంగా సాగలేదు. ఓపెన్‌ రీచ్‌ల్లో తవ్వకాలు కూలీల చేత చేయించాలి. కూలీలు అధికంగా డిమాండ్‌ చేస్తుండటంతో కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కాక పనుల నుంచి తప్పుకొంటున్నారు. తిరిగి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయడంలో జాప్యం జరగడంతో తవ్వకాలు నిలిచిపోతున్నాయి. ఆన్‌లైన్‌, యాప్‌లలో తలెత్తే సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించలేక పోతున్నారు. రేవుల సామర్థ్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్తవి గుర్తించి ఏర్పాటు  చేయాలి. నిల్వలు ఖాళీఅయిన వెంటనే మరో రేవును ఏర్పాటు చేయాల్సి ఉంది. పట్టాభూముల్లో ఇసుక అనుమతికి ఐదు శాఖల రిపోర్టు తప్పనిసరి. అధికారుల మధ్య సమన్వయ లేమి కారణంగా వారంలోగా రావాల్సిన అనుమతులు నెలకు పైగా పడుతోంది. ఫలితంగా నిల్వ కేంద్రాలు మూత పడుతున్నాయి. ఇటీవల కుమ్మెత వద్ద నిల్వలు ఖాళీ అవడంతో, దీనిమీద  ఆధారపడిన కొర్రపాడు కేంద్రం ఇరవై రోజులుగా మూత పడింది. అలాగే గుర్తించిన రేవుల నుంచి అక్రమ రవాణాను అరికట్టలేకపోతున్నారు.

Related Posts