YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంతా అక్రమం (తూర్పుగోదావరి)

అంతా అక్రమం (తూర్పుగోదావరి)

అంతా అక్రమం (తూర్పుగోదావరి)
కాకినాడ, ఫిబ్రవరి 24 జిల్లాలో అనధికారిక లేఅవుట్లకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతరంగా మార్చకపోవడం.. 10 శాతం భూమిని సామాజిక అవసరాలకు వదలక పోవడం.. కనీస నిబంధనలు పాటించక పోవడంతో పాటు స్థానిక సంస్థల అనుమతులు లేకుండా లేఅవుట్లను ఏర్పాటు చేసి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీల్లో క్రమబద్ధీకరణకు అవకాశం లేకపోవడం.. క్షేత్ర స్థాయిలో నిఘా సన్నగిల్లడంతో పరిస్థితి అదుపుతప్పుతోంది. దీనిపై నిఘా వేసిన గోదావరి నగరాభివృద్ధి సంస్థ (గుడా) ఇప్పటి వరకు 1,037 అనధికార లేఅవుట్లను గుర్తించింది. వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ జాబితాను జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. తాజాగా గుడా పరిధి పెరగడంతో ఆయా ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల భూములను సైతం ఈ జాబితాలో చేర్చనున్నారు. ఈ చర్యలతో జిల్లా వ్యాప్తంగా 2,500 ఎకరాల భూములు చిక్కుల్లో పడినట్లే. జిల్లాలో మొత్తం 1,822 లేఅవుట్లు ఉన్నట్లు పంచాయతీ యంత్రాంగం గుర్తించింది. వీటిలో 767 లేఅవుట్లు అనధికారమని గత ఏడాది డిసెంబరులో తేల్చారు. విజిలెన్స్‌ విభాగం క్షేత్రస్థాయి తనిఖీల్లో భారీ స్థాయిలోనే అక్రమాలను గుర్తించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై గుడా దృష్టిసారించింది. అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన ప్లాట్లలో గృహాలు నిర్మిస్తున్నా చర్యలు చేపట్టక పోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. ఇంటి స్థలాలు చేతులు మారుతుండగా అనుమతులులేని ఇలాంటి వాటిని కొన్నవారు అష్టకష్టాలకు గురవుతున్నారు. గుడా పరిధిలో అత్యధికంగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో 274 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం పరిధిలో 240, రాజానగరంలో 150, తునిలో 75, సామర్లకోటలో 58, కరపలో 55, కోరుకొండలో 34, పెదపూడిలో 25, గోకవరంలో 15, రావులపాలెం, తొండంగిలో 14 చొప్పున గుర్తించారు. పిఠాపురం, అమలాపురం, కడియం, శంఖవరం, జగ్గంపేట, అనపర్తి, ఆలమూరు తదితర మండలాల్లోనూ అనధికారిక లేఅవుట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో విజిలెన్స్‌ విభాగం అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసిన యాజమాన్యాలకు ఇప్పటి వరకు రూ.432.20 కోట్ల అపరాధ రుసుము విధించింది. ఇందులో గత ఏడాది డిసెంబరు వరకు రూ.102.39 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ప్రతినెలా సమీక్షలు నిర్వహించి వసూళ్లను ముమ్మరం చేసే దిశగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 8న అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం- 2020ని ప్రభుత్వం ప్రకటించింది. గుడా పరిధిలోని  నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో 2019 ఆగస్టు 31కి ముందు వేసిన అనధికారిక లే-అవుట్లలోని ప్లాట్లు నిర్ణీత అపరాధ  రుసుము, 14 శాతం ఓపెన్‌ స్పేస్‌ మొత్తం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 6లోగా వచ్చిన దరఖాస్తులకు 14 శాతం ఓపెన్‌ స్పేస్‌కు కట్టాల్సిన మొత్తంలో 50 శాతం మినహాయింపు ఇవ్వనున్నట్లు గుడా ప్రకటించింది. దరఖాస్తుతో చెల్లించాల్సిన 50 శాతం అపరాధ రుసుముతోపాటు మిగిలిన రుసుము కూడా ఫిబ్రవరి 21లోగా చెల్లిస్తే..చెల్లించాల్సిన  మొత్తం అపరాధ రుసుములో 10 శాతం మినహాయింపు ఇవ్వనున్నారు.

Related Posts