YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

 నిధులున్నాయ్..  నీళ్లులేవ్..

 నిధులున్నాయ్..  నీళ్లులేవ్..

 నిధులున్నాయ్..  నీళ్లులేవ్.. (కర్నూలు)
కర్నూలు, ఫిబ్రవరి 24 : జిల్లాలో ఏటా వేసవిలో పల్లె ప్రజల దాహార్తి పేరుతో భారీగా నిధులు దుర్వినియోగమవుతున్నాయి. వేసవిలో మంచినీటి రవాణాకు రూ.కోట్ల నిధులను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేస్తుండగా అందులో చాలావరకు పక్కదారి పడుతున్నాయి. గతేడాది వేసవిలో రూ.19 కోట్లను మంచినీటి ఎద్దడి నివారణకు ఖర్చు చేయగా ఈ ఏడాది రూ.15 కోట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే తప్పుడు నివేదికలు తయారుచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. 40 మండలాల పరిధిలో 236 ఆవాసాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి వచ్చే అవకాశముందని, ఈ గ్రామాల్లోని ప్రజలతోపాటు పశువులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రూ.15.06 కోట్లు అవసరమని అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు తాగునీటి సమస్యను అధిగమించేందుకు నిధులు అవసరమని ప్రతిపాదించారు. ఈఎన్‌సీ ఆదేశాలమేరకు ఈ ప్రణాళికను ప్రభుత్వానికి పంపినట్లు కర్నూలు ఎస్‌ఈ పీఏ (డీఈఈ) ఉదయ మనోహర్‌ తెలిపారు.  కాగా 2019-20లో మంచినీటి కొరత తీర్చేందుకు రూ.19 కోట్లుతో ప్రణాళిక సిద్ధం చేయగా రూ.7 కోట్లు వరకు బిల్లులు మంజూరయ్యాయి. బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఇప్పటికీ ఎస్‌ఈ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో 1,503 ఆవాసాలున్నాయి. పల్లెల్లో 29 లక్షల జనాభాతోపాటు 8.5 లక్షల వరకు పశువులున్నాయి. పల్లెలకు శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కరించకుండా ఏటా భారీ నిధులు వ్యయం చేస్తున్నారు. వీటిలో నిధులు దుర్వినియోగమవుతున్నాయనే విమర్శలున్నాయి. గత పదేళ్లుగా ప్రతి వేసవిలో రూ.15 కోట్లుకు తక్కువ కాకుండా పల్లె ప్రజల దాహార్తి తీర్చేందుకు వ్యయం చేస్తున్నారు. గతేడాది రూ.19 కోట్లు వెచ్చించగా.. ఈ ఏడాది రూ.15 కోట్లుకు వరకు అంచనా వేయడం గమనార్హం.  జిల్లాలోని 40 మండలాల పరిధిలో 236 గ్రామాలకు మంచినీటి రవాణా చేసేందుకు రూ.13.07 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఒక్కో ట్యాంకు ట్రిప్‌నకు రూ.27,106 వ్యయమవుతుందని, ఈ మేరకు ఒక్కో నీటి ట్యాంకరు నీటిని రవాణా  చేసేందుకు రూ.800-రూ.1000 వరకు ఖర్చువుతుందని, 1,27,249 ట్రిప్‌లు రవాణా చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. 65 ఆవాసాల్లో పశువులకు నీటిని సరఫరా చేసేందుకు రూ.109 లక్షలు అవసరమవుతాయని, 21 ప్రాంతాల్లో మంచినీటి వసతి ఉన్న బావులను అద్దెకు తీసుకునేందుకు రూ.10.65 లక్షలు, 28 మండలాల్లో బోర్ల మరమ్మతులకు రూ.1.60 లక్షలు, 145 గ్రామాల్లో బోర్లను మరమ్మతులతోపాటు లోతుగా చేసి నీటి వనరులు పెంచేందుకు రూ.69.20 లక్షలు, వేసవి కుంటలు (ఎస్‌ఎస్‌ ట్యాంకులు) నింపేందుకు రూ.3 లక్షలు నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు.

Related Posts