YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గోదారమ్మ ఎటుపోతోంది.

గోదారమ్మ ఎటుపోతోంది.

 గోదారమ్మ ఎటుపోతోంది..?(ఖమ్మం)
ఖమ్మం, ఫిబ్రవరి 24  భద్రాచలం రాములోరి పాదాలను తాకుతు ప్రవహిస్తున్న జీవనది గోదావరి ఏటికేడు బిక్కిపోతోంది. నీటిమట్టం పడిపోతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన ఏడాది ఈ సమయంలో సుమారు 6 అడుగుల నీటిమట్టం నమోదవ్వగా ఇప్పుడు 4 అడుగులు దాటడమే కనాకష్టంగా మారింది. వేసవికి ముందే ప్రమాద ఘంటికలు మోగుతుండటంతో తీరప్రాంత వాసులు అధికారులు తీసుకునే నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నారు. రెండో వంతెన నిర్మాణం కారణంగా ఆ పనులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కట్టను నిర్మించారు. ఈ కట్ట వల్ల నీళ్లు నిలిచి ఇన్‌టేక్‌ వెల్‌ వద్ద ప్రస్తుతానికి సరిపడా ప్రవాహం ఉంది. పట్టణంలోని పలు కాలనీల మురుగు నీళ్లు ఎగువ ప్రాంతంలో గోదావరిలో నేరుగా కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో భరించరాని దుర్వాసన వస్తోంది. ఇవి నదిలో కలిసిన తర్వాత దిగువ ప్రాంతంలో ఉన్న ఇన్‌టేక్‌ వెల్‌ వరకు ప్రవహిస్తున్నాయి. వీటినే మంచినీరుగా సరఫరా చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు చొరవ చూపాల్సి ఉంది. ఏమాత్రం అశ్రద్ధ వహించినా లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలి. గత ఏడాది జనవరిలోనే భద్రాచలంలో మంచి నీటికి కటకట ఏర్పడింది. నది ఇసుకలోనే ఇంకిపోవడంతో చిన్నచిన్న పాయలు మిగిలాయి. వాటిని ఇన్‌టేక్‌ వెల్‌(తాగు నీటిని అందించే బావి) వైపు మళ్లించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారానికి నీటి కొరత ఏర్పడి కొద్ది రోజులు మూసేశారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు ఆటంకం కలిగింది. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో నిర్మించిన విద్యుత్తు ప్రాజెక్టును కొన్ని రోజులు తెరవనే లేదు. వీటిని అధికారులు పరిగణలోకి తీసుకుని ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రజారోగ్య శాఖ పరిధిలో తాగు నీటి సరఫరా ఉన్నప్పుడు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులను చేశారు. అప్పుడు 4 వేల నళ్లాలకు మంచి నీటిని అందించడం వల్ల నెలకు రూ.4 లక్షల వరకు బిల్లుల రూపంలో ఆదాయం వచ్చేది. ఖర్చు దీనికి రెట్టింపు ఉండడంతో రూ.4 కోట్ల మేర అప్పులు మిగిలాయి. ఈ దశలో దీన్ని మిషన్‌ భగీరథలో చేర్చి ఆర్‌డబ్ల్యుఎస్‌కు అప్పగించారు. ఆ తర్వాత మిషన్‌ భగీరథ పనులకు రూ.10 కోట్లు వెచ్చించి 55 కి.మీ పొడవున పైపు లైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని విధాలుగా 10 వేల నళ్లాలకు నీటి సరఫరా అవుతోంది. ఇంకా 12  కి.మీ పొడవైన పైపులను నిర్మించి రూ.2 కోట్లతో అందరికీ తాగు నీళ్లను అందించేందుకు చర్యలు మొదలయ్యాయి. మార్చి మాసాంతానికి అన్ని పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎండాకాలం వచ్చిందంటే మారుమూల కాలనీలకు ట్యాంకర్ల ద్వారా గ్రామ పంచాయతీ నీటిని పంపించేది. మిషన్‌ భగీరథ అమలు అవుతున్నందున ఈసారి ట్యాంకర్ల ఏర్పాటు కష్టమేనని అధికారులు అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సి ఉంది.

Related Posts