YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సింధియాకు... ముందుంది...

సింధియాకు... ముందుంది...

భోపాల్, జూలై 8, 
భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియాకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన వర్గానికి చెందిన 12 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఇటీవల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంత్రివర్గాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే. మొత్తం 28 మంది మంత్రివర్గ సభ్యులను కొత్తగా తన కేబినెట్ లో చేర్చుకున్నారు. ఇందులో సగం సింధియా వర్గానికి, సగం బీజేపీ నేతలకు దక్కాయి.మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి జ్యోతిరాదిత్య సింధియా కారణమని చెప్పక తప్పదు. ఆయన వెంట 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరడం వల్లనే మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ ఆవిర్భవించింది. ఈ 22 మందిలో 12 మందికి చోటు దక్కిందంటే సింధియాకు మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. త్వరలో సింధియాకు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కనుంది.అయితే మంత్రి పదవులు దక్కగానే జ్యోతిరాదిత్య సింధియా సంబరపడిపోతే సరిపోదు. ముందున్న సవాళ్లను ఆయన మీద పెట్టేందుకే ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చిందన్నది టాక్. త్వరలోనే మధ్యప్రదేశ్ లో 25 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికల్లో సింధియా వర్గానికి చెందిన వారే పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా సింధియాపైనే ఉంటుంది.అందుకే సింధియా వర్గానికి ఊహించని విధంగా మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో పెద్దపీట వేశారంటున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానిక బీజేపీ సీనియర్ నేతలు, బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాతే ఎక్కువ సంఖ్యలో సింధియా వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల్లో గెలుపు బాధ్యతను సింధియా తీసుకుంటారన్నదే బీజేపీ వ్యూహంగా ఉంది. మొత్తం మీద సంబరపడి ప్రయోజనం లేదు. రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తేనే ప్రభుత్వ మనుగడ ఉంటుండటంతో సింధియాకు ముందున్నది పరీక్షాకాలం.

Related Posts