YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ వైపు... సీనియర్ల చూపు

బీజేపీ వైపు... సీనియర్ల చూపు

విజయవాడ, ఆగస్టు 8,
టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో జగన్ టార్చర్ నుంచి త్వరగా బయటపడాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ స్పీడ్ మీదున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని రక్షించగలగేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. కేంద్రంలో అధికారంలో ఉండటం, జగన్ పై కేసులు ఉండటంతో కంట్రోల్ చేయగలిగిన శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉంది. అందుకే టీడీపీ నేతలు కాషాయ పార్టీని దువ్వే కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోయారు.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కీలక నేతలు, జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనుకున్న నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. జగన్ టార్గెట్ లో ఉన్నామని భావించిన నేతలు ముందుగానే సర్దుకున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సర్దుకున్నారు. ఇక కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పసుకున్నారు. ఏపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో పార్టీని విలీనం చేసేశారు.బీజేపీ కూడా పార్టీలోకి నేతలు వస్తుండటంతో వరసగా కండువాలు కప్పేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే చంద్రబాబు తాను మోదీతో మళ్లీ చేయి కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. అయినా బీజేపీ నుంచి ఇప్పటి వరకూ సానుకూల సంకేతాలు రాలేదు. తాజాగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నియమితులు కావడంతో ఉన్న చిన్న ఆశ కూడా అడుగింటిపోయిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీజేపీకి దగ్గరవ్వడానికి సీనియర్ నేతలను చంద్రబాబు ఉపయోగిస్తున్నారు.మొన్న అయ్యన్న పాత్రుడు ప్రతి ఒక్కరూ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి పది రూపాయలు పంపాలని కోరారు. మోదీని ప్రశంసలతో అయ్యన్న పాత్రుడు ముంచెత్తారు. తాజాగా మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సయితం ఆగస్టు 5వ తేదీ చిరస్మరణీయమైన రోజు అని ప్రకటించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అద్భుతమైన అనుభూతి అని సోమిరెడ్డి తన్మయత్వానికి లోనయ్యారు. సీనియర్ నేతలే బీజేపీ అనుకూల నినాదాలు చేస్తుండటంతో చంద్రబాబు వెనకుండి ఇలా మాట్లాడిస్తున్నారని సులువుగా అర్థమవుతుంది. మొత్తం మీద సీనియర్ నేతలతో బీజేపీ చెంతకు చేరేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related Posts