YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేతలు ఎదురు తిరుగుతున్నారా..

నేతలు ఎదురు తిరుగుతున్నారా..

విజయవాడ, నవంబర్ 21, 
జగన్ అంటేనే జడుసుకునే రోజులు పోయాయా..? జగన్ పేరు చెప్పి కట్టడి చేయాలనుకుంటే అసలు కుదిరే వ్యవహారం కాదా. జగన్ అన్న మూడు అక్షరాలతో ఎందరో దిగ్గజ నేతలకు చుక్కలు చూపించిన మొనగాడు జగన్ కి సొంత పార్టీ నేతలే ఝలక్ ఇస్తున్నారా. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తుంది. ఏ జగన్ ని తమ దేవుడని కీర్తించారో, ఏ జగన్ తమ అధినాయకుడి అని చెప్పుకుని ఊరూరా తిరిగి దండోరా వేశారో ఇపుడు ఆ జగన్ మాటల్నే ధిక్కరిస్తున్నారు. జగన్ ఆదేశాలనే కాలదన్నుతున్నారు. వైసీపీలో ఇది గతంలో ఎన్నడూ చూడని వైపరిత్యం. భావికి ఇది ప్రమాద సంకేతం.జగన్ మాట వేదంగా భావించే నేతలే ఇపుడు ఎదురు తిరుగుతున్నారు. జగన్ టికెట్ ఇస్తే ఆయన బొమ్మ పెట్టుకుని జనంలోకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే తోక జాడిస్తున్నారు. జగన్ అయితేనేంటి అన్న నిర్లక్ష్య భావం వారిలో నెలకొంది అని చెప్పడానికి తాజాగా ఎన్నో ఉదాహరణలు కళ్ళ ముందు ఉన్నాయి. పార్టీని అధినాయకుడిని వీధిలో పెట్టి చేస్తున్న రచ్చ వల్ల వైసీపీకి దిబ్బందులే తప్ప మేలు జరిగేది ఏమీ ఉండదు. అయినా తెప్ప ఎందుకు తగలబెడుతున్నారు అంటే ఏరు దాటేశామన్న ధీమాతోనేనా.ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ సర్కార్ మీద చేసిన కామెంట్స్ జనంలోకి బాగానే వెళ్ళిపోయాయి. జగన్ తప్ప మరో నాయకుడు లేని వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తులు ఇపుడు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. వారికి ఉక్కబోత ఎక్కువగా ఉండవచ్చు. కనీసం గాలి వీచేందుకు చిన్న పాటి కిటికీ అయినా లేకపోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ జంజాటంలో నోరు తెరచి అన్నీ బయటపెట్టేస్తున్నారు. విశాఖలో ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమరనాధ్, గోదావరి జిల్లాలో పి గన్నవరం ఎమ్మెల్యే, గుంటూరులో ఉండవల్లి శ్రీదేవి ఇలా పార్టీ పరువు బజారున పెట్టేశారు. జగన్ మాటలను సైతం కాదని ముందుకు వచ్చేశారు. ఒక ఎమ్మెల్యే మంత్రుల మీద విమర్శలు చేస్తే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కుడి భుజం లాంటి నాయకుడి మీదనే బాణాలు వేశారు. మరో ఎమ్మెల్యే అయితే ఏకంగా జగన్ సామాజికవర్గాన్నే టార్గెట్ చేసి విమర్శలు చేశారు.ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూంటే పార్టీ పరువే పోయేది. అది తెలిసి కూడా వారు ఇంతలా తెగించారు అంటే ఆ తప్పు కచ్చితంగా అధినాయకత్వానిదే. తమ గోడు వెళ్ళబోసుకునేందుకు ఏడాదిన్నర అయినా అధినేత జగన్ దర్శనం దొరకడంలేదు. ఇక జగన్ మొత్తం పాలనను ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా లాగించేస్తున్నారు. జగన్ మానస పుత్రిక గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇపుడు ఎమ్మెల్యేల పాలిట గుదిబండలా మారింది. దాంతో తాము ఉత్త ఎమ్మెల్యేలు అయిపోయామన్న బాధ వారిలో ఉంది. దానికి తోడు చిన్నపాటి పలుకుబడి ఉపయోగించి ఏ పనీ చేసుకోనీయకుండా ఆంక్షలు కూడా ఉన్నాయి. అవినీతి రహిత పాలన అంటే జనాలకు బాగానే ఉన్నా కోట్లు పెట్టి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రం బుర్ర ఖరాబ్ అయ్యేలా ఉందిట. అందుకే వారు మరో మూడున్నరేళ్ళు ఇలాగే నామమాత్రం ఎమ్మెల్యేలుగా ఉంటేనేంటి లేకుంటేనేంటి అన్న బాధతోనే మనసులోని బాధను కక్కేస్తున్నారు. ఈ అసంతృప్తి చెలియల కట్టను దాటి పార్టీని మింగేయకముందే జగన్ మేలుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

Related Posts