YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిల్లాల విభజనకు కసరత్తు

జిల్లాల విభజనకు కసరత్తు

శ్రీకాకుళం, నవంబర్ 21, 
ల్లా విభజన కసరత్తు వేగవంతమైంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డివిజన్లు, ఆయా కార్యాలయాల వివరాలను డిస్ట్రిక్ట్‌ రీఆర్గనైజేషన్‌ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. వీటితో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రం ఎంత దూరంలో ఉందో పొందుపరుస్తున్నారు. రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ఉన్న కార్యాలయాలు అద్దె భవనమా?, సొంత భవనమా? అనే వివరాలతో కార్యాలయ వైశాల్యం, ఖాళీ స్థలం వంటి వివరాలను నమోదు చేసే ప్రక్రియ వేగవంతమైంది.జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 464 కార్యాలయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 380 కార్యాలయాలకు సంబంధించిన వివరాలను అప్‌లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఖాళీ భూముల వివరాలు, వివాదాస్పద భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా అధికారులు పొందుపరిచారు. ఆయా కార్యాలయాల పరిధిలో 77.48 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో 18 ప్రభుత్వ కార్యాలయాల వివరాలను పొందుపరిచారు. ఆ ప్రభుత్వ శాఖలకు 243 భవనాలు ఉండగా, 49 భవనాల్లో జిల్లా కార్యాలయాలు, 31 భవనాల్లో డివిజన్‌ కార్యాలయాలు, 20 సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటి పరిధిలో 143 మండల కార్యాలయాలకు భవనాలు ఉన్నాయి. మొత్తం వీటి విస్తీర్ణం 169.95 ఎకరాలు ఉంది. టెక్కలి డివిజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 87 భవనాల వివరాలను నమోదు చేశారు. వాటి పరిధిలో ఏడు డివిజనల్‌ కార్యాలయాలు, 25 భవనాల్లో సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు, 55 భవనాల్లో మండల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మొత్తం వీటి విస్తీర్ణం 45.07 ఎకరాలుగా ఉంది. పాలకొండ డివిజన్‌కు సంబంధించి 50 భవనాల వివరాలను పొందుపరిచారు. వీటి పరిధిలో ఐదు డివిజన్‌ కార్యాలయాలకు, నాలుగు సబ్‌ డివిజన్‌ కార్యాలయాలకు, 41 మండల కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. ఇవి 21.69 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి.కొత్త జిల్లాల ఏర్పాటుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలు తరగతులకు చెందిన ప్రజల్లో దీనిపై చర్చ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రాతిపాదికన జిల్లాలను విభజిస్తే, జిల్లాలో భౌగోళికంగా కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఆ రెండూ విజయనగరం జిల్లాలో చేరొచ్చనే చర్చ మొన్నటి వరకు నడిచింది. ఇటీవల డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్‌ ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగుతుందని ప్రకటించడంతో, కొంత ఊరట లభించినట్లయింది. పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లా విభజన జరిగితే ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాన్ని వదులుకోవాల్సి వస్తుందనే ఆవేదన అన్ని తరగతుల్లోనూ కనిపించింది. జిల్లాల విభజన అంశం తొలిసారి తెర పైకి వచ్చినప్పుడు పలురూపాల్లో ఆవేదన వ్యక్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఆ మేరకు డిప్యూటీ సిఎంకు వచ్చి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న రాజాం నియోజకవర్గం విషయంపై ఏమీ మాట్లాకపోవడంతో విజయనగరంలో చేర్చొచ్చనే మాట వినిపిస్తోంది.పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో గిరిజనులు ఎక్కువగా నివసించే ప్రాంతాలతో కలిపి పార్వతీపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఎమ్మెల్యేలు ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిసింది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన సాగిస్తునట్లు సమాచారం. దీంతో పార్వతీపురం జిల్లా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు అధికారులు, అధికార పార్టీ నాయకుల చర్చల్లో వినిపిస్తోంది. అటు పోలీసుశాఖ ప్రతిపాదనల్లో పార్వతీపురం కేంద్రంగా జిల్లా పోలీసు కార్యాలయం ప్రతిపాదన ఉండడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. దీంతో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం జిల్లా పరిధిలోకి చేరనుందని చర్చించుకుంటున్నారు.

Related Posts