YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ లో బీహార్ ప్రకంపనలు

కాంగ్రెస్ లో బీహార్ ప్రకంపనలు

కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం వ్యాఖ్య కొంత సకారణంగా కనిపిస్తున్నది. బీహార్ ఎన్నికల్లో దారుణంగా వీగిపోయిన తర్వాత ఆ పార్టీలో అసమ్మతి మళ్లీ తలెత్తడాన్ని తప్పుపట్టలేము. పార్టీ పని తీరులో మార్పు తీసుకురావాలని కోరుతూ మొన్న ఆగస్టులో 23 మంది నేతలు అధిష్ఠానానికి లేఖ రాసిన తర్వాత ఇంచుమించు అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ నెలకొనడాన్ని అర్థం చేసుకోవచ్చు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం ఆ పార్టీని అప్రతిష్ఠపాలు చేయడంతో ఆగకుండా మొత్తం ఆర్‌జెడి నాయకత్వంలోని మహా కూటమి పుట్టినే ముంచివేసింది. దీనిపై ఆగస్టు 23 బృందంలోని ఒకరైన కపిల్ సిబల్ స్పందన దూకుడుగానూ, అధిష్ఠానాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఉద్దేశించినదిగానూ అనిపించింది. పార్టీ మారిన పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోతున్నదని, ప్రజలు కాంగ్రెస్‌ను జాతీయ ప్రత్యామ్నాయంగా చూడడం మానుకున్నారని సిబల్ చేసిన వ్యాఖ్యలో కసి దట్టించి ఉన్నది. కాని ఆ 23 మందిలో లేని చిదంబరం, పార్టీ నాయకత్వాన్ని ఆలోచింప చేసే రీతిలో అభిప్రాయపడ్డారనవచ్చు.క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ ఉనికి లేకపోడమో, గణనీయంగా బలహీనపడడమో బీహార్ ఫలితాల్లో కనిపిస్తున్నదని చిదంబరం అన్న మాటల్లో వాస్తవమున్నది. అలాగే ఆర్‌జెడి నాయకులు ఎత్తిచూపించినట్టు కాంగ్రెస్ తన సామర్థానికి మించి ఎక్కువ స్థానాల్లో టిక్కెట్లు పొందడం తప్పు అని చిదంబరం అన్నారు. తీసుకున్న 70 సీట్లలో 25 బిజెపి, దాని మిత్రపక్షాలకు బలమున్నవేనని వాటిని తిరస్కరించి 45 స్థానాలనే తీసుకుని ఉండవలసిందని చిదంబరం చేసిన సూచన, విమర్శ హేతుబద్ధంగా ఉన్నాయి. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ విధేయులైన, నిబద్ధులైన కార్యకర్తల బలం లేదన్నది ముమ్మాటికీ వాస్తవం. క్షేత్ర స్థాయిలో దానిని బలహీనపరుస్తున్న అంశమదే. పార్టీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని కార్యకర్తలతో కూడిన సంస్థాగత నిర్మాణం లేని రాజకీయ పక్షానికి ఎంత మంచి తలకాయ ఉన్నా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో బిజెపి, కమ్యూనిస్టు పార్టీల కంటే కాంగ్రెస్ అతిచిన్న గీతే. అధికారంలో కొనసాగినంత కాలం అత్యంత విధేయులుగా అంటిపెట్టుకొని ఉండి ఊడిపోయిన తర్వాత ఓటి ఓడను వదిలేసినట్టు వీడిపోయే వారే కాంగ్రెస్‌లో అధికంగా కనిపిస్తారు.నిన్న మొన్ననే రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ గెలిచిన సంగతినీ చిదంబరం గుర్తు చేశారు. అటువంటి పార్టీకి బీహార్‌లో ఏమైంది అనేది ఆత్మవిమర్శ చేసుకోవలసిన అంశమే. ఆర్‌ఎస్‌ఎస్ తదితర హిందుత్వశక్తుల దన్ను దండిగా ఉన్న బిజెపితో పోరాటమంటే మాటలు కాదు. దాని స్థాయిలో దాన్ని ఢీ కొట్టడానికి కాంగ్రెస్‌కున్న సంస్థాగత బలం చాలదు. సిద్ధాంతాలు, వైఖరులపరంగా కమలం పార్టీకి గట్టి ప్రత్యామ్నాయ శక్తి అనిపించుకోలేకపోడమూ కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న మరో బలహీనత అని అంగీకరించాలి. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఈ బలహీనత దానిలో స్పష్టంగా బయటపడింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును అక్కడి గుప్తకర్ పార్టీలతో పాటు వ్యతిరేకిస్తే మిగతా దేశంలో ఓటర్లకు దూరమవుతామేమోనన్న భయంతో ముందు వెనుకలాడడం కాంగ్రెస్‌ను బిజెపికి దీటైన శక్తిగా నిలబెట్టలేకపోతున్నది. మెతక హిందుత్వను అనుసరిస్తున్నదనే పరిగణనను తొలగించుకోలేకపోతే పూర్వపు స్థితి ఆ పార్టీకి పునరుద్ధరణ కావడం కష్టమే. ఎందుకంటే దాని ఓటు బ్యాంకు బలహీన వర్గాలు, మైనారిటీలే. అగ్రవర్ణ ఓటర్లు ఎప్పుడో బిజెపి కైవసమయ్యారు. మైనారిటీలు, ఎస్‌సిలు, బిసిలు సమాజ్‌వాదీ, బిఎస్‌పి, ఆర్‌జెడి, జెడి(యు) వంటి పార్టీల వైపు మళ్లిపోయారు.అందుచేత పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేసుకోడం, సైద్ధాంతికంగా బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం అనిపించుకునేలా మార్పులు తీసుకురావడం ఇప్పుడు కాంగ్రెస్‌కు అత్యవసరం. ప్రధాని మోడీ వైఖరులను, నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఎత్తిచూపడంలో కృతకృత్యుడవుతున్న రాహుల్ గాంధీకి అండగా సీనియర్ నాయకులు ఎవ్వరూ కొట్టవచ్చినట్టు కనిపించకపోడమూ పార్టీని పలచబరుస్తున్నది. బీహార్‌లో అంతగా బలహీనపడినా అనుల్లంఘనీయుడుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీశ్ కుమార్ మాదిరిగానే ఎంత నీరుగారిపోయినప్పటికీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తి కాగల సత్తా కాంగ్రెస్‌కే ఉందన్న మాటను ప్రస్తుతానికి కాదనలేము. యుపిఎ పాలనలో తీసుకున్న గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, భూ సేకరణ చట్టం వంటి విశిష్ట నిర్ణయాలను ప్రచారం చేసుకోడం ద్వారానైనా అది తిరిగి పుంజుకోవచ్చు. అందుకు పార్టీలోని అందరినీ కలుపుకోడమే శరణ్యమవుతుంది గాని అధీర్ రంజన్ చౌదరి ప్రకటన మాదిరి విదిలింపు ధోరణి, ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోండి అనడం మాత్రం మంచి కాదు.

Related Posts