YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు టీడీపీలో నిస్తేజం

గుంటూరు టీడీపీలో నిస్తేజం

గుంటూరు, ఫిబ్రవరి 23, 
రాజ‌ధాని జిల్లా గుంటూరులో దూకుడు ప్రద‌ర్శిస్తున్న ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అనుకున్న విధంగా వ్యూహాలు ప్రద‌ర్శించ‌లేక‌ పోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. కొంద‌రు నాయ‌కులు అనుస‌రిస్తున్న వ్యవ‌హారంతో పార్టీ కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టు కోల్పోతోంద‌నే టాక్ వినిపిస్తోంది. బాప‌ట్ల, మాచ‌ర్ల‌, మంగ‌ళ‌గిరి, న‌ర‌సారావుపేట లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు ద‌శాబ్దాలుగా పార్టీ జెండా ఎగ‌ర‌డం లేదు. ఇక గుంటూరు న‌గ‌రంలో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పార్టీ ప‌రిస్థితి రెండు ద‌శాబ్దాలుగా దీన‌స్థితిలో ఉంది. ఇక్క‌డ టీడీపీ జెండా మోసే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. చిత్రమైన విష‌యం ఏంటంటే.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాల‌యం.. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి కూత వేటు దూరంలోనే ఉండ‌డం. దీంతో ఈ కార్యాల‌యానికి నిత్యం పార్టీ పెద్దలు వ‌స్తూనే ఉంటారు.అయినా.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై ఎవ‌రూ దృష్టి పెట్టడం లేదు. గ‌తంలో పార్టీకి సేవ చేసి.. రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన లాల్ జాన్ బాషా వార‌సులు ఇక్కడ నుంచి జెండా ఎగ‌రేయాల‌ని గత ఎన్నిక‌ల స‌మ‌యం లోనే కోరారు. అయితే అప్పట్లో కార‌ణాలు ఏవైనా.. వారికి అవ‌కాశం ఇవ్వలేదు. ఇక‌, ఇక్కడి ప‌రిస్థితి చూస్తే.. 1999 నుంచి పార్టీ గెలిచింది లేదు. వ‌ర‌సుగా నాలుగు సార్లు టీడీపీ ఓడిపోయింది. 2009లో లాల్ జాన్ భాషా సోద‌రుడు జియావుద్దీన్ భ‌యంక‌రంగా ఓడిపోవ‌డంతో పాటు మూడో స్థానంలో నిల‌వ‌డంతో చంద్రబాబు ఆ కుటుంబాన్ని పూర్తిగా ప‌క్కన పెట్టేశారు. 2009లో మ‌స్తాన్ వ‌లీ కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఇక్కడ కాంగ్రెస్ హ‌వా త‌గ్గి కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి అనుకూలంగా మారిపోయింది.దీంతో 2014, 2019 ఎన్నిక‌ల్లో ముస్తాఫా వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఇటీవ‌ల కాలంలో ముస్తఫాపై వ్యతిరేక‌త వ‌స్తోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. ఆయ‌న ఇక్కడి క‌నీసం అవ‌స‌రాలు తీర్చడం లేద‌ని ముస్లిం సామాజిక వ‌ర్గమే ఆరోపిస్తోంది. తూర్పులో ప్రధాన‌మైన స‌మ‌స్య నీటి ఎద్దడి. దీనిని తీర్చాల‌ని ఎన్నిక‌ల స‌మయంలో నేత‌ల‌కు ఇక్కడి ప్ర‌జ‌లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ , డ్రైనేజ్ స‌మ‌స్య కూడా తీవ్రంగా ఉంది. అయితే.. ఏ ఒక్కరూ కూడా ఈ స‌మ‌స్యను ప‌రిష్కరించేందుకు ముందుకు రావ‌డం లేదు. దీంతో ముస్తాఫాపై వ్యతిరేక‌త పెరుగుతోంది.కేబినెట్ మార్పుల్లో అయినా మంత్రి ప‌ద‌వి రాదా ? అన్న ఆశ‌తో ఆయ‌న ఉన్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో ఈ వ్యతిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ ప్రయత్నించ‌క‌పోవ‌డం. లాల్‌జాన్ బాషా వార‌సుల‌ను కూడా ప్రోత్సహించ‌క‌పోవ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీ వ‌దిలేసుకుందా ? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయ‌ని అంటున్నారు పార్టీ కార్యక‌ర్తలు. పార్టీ ఇన్‌చార్జ్‌గా గ‌త ఎన్నిక‌ల్లో పోటి చేసిన మహ్మద్ న‌సీర్ ఉన్నా ఆయ‌న ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తేనా ? అన్న సందేహాలు జిల్లా పార్టీ నేత‌ల‌కే ఉన్నాయి. మ‌రి చంద్రబాబు ఇప్పటికైనా గుంటూరు తూర్పుపై దృష్టి పెడితే 2024లో అయినా టీడీపీ ఇక్కడ గెల‌వ‌క‌పోయినా గ‌ట్టి పోటీ ఇవ్వొచ్చు..!

Related Posts