YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉప్పల్ స్టేడియం అంటే చిన్నచూపేనా

ఉప్పల్ స్టేడియం అంటే చిన్నచూపేనా

హైదరాబాద్, మార్చి 3, ఏడు సార్లు ఫైనల్‌‌కు ఆతిథ్యం ఇచ్చింది. నాలుగుసార్లు బెస్ట్‌‌ గ్రౌండ్‌‌ అవార్డు అందుకుంది. అద్భుతమైన స్టేడియం. ఏ మ్యాచ్‌‌ జరిగినా వేల సంఖ్యలో ఫ్యాన్స్‌‌ పోటెత్తుతారు. పైగా, కరోనా సెకండ్ వేవ్ లేదు. అయినా ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌ వేదికల జాబితాలో హైదరాబాద్‌‌ ఉప్పల్‌‌ స్టేడియానికి చోటు దక్కలేదు. ఈ విషయాన్ని భాగ్యనగర క్రికెట్‌‌ అభిమానులు  జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీసీఐ నిర్ణయించిన జాబితాలో హైదరాబాద్‌‌ పేరు లేకపోవడం మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌ నేతృత్వంలోని హెచ్‌‌సీఏ పాలక వర్గానికి అవమానంగా చెప్పొచ్చు. ఎందుకంటే అంతర్గత కుమ్ములాటలతో పాటు  టాలెంటెడ్‌‌ ప్లేయర్లకు అవకాశం ఇవ్వకుండా స్టేట్‌‌ టీమ్స్‌‌లో ప్లేస్‌‌లను అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలతో హెచ్‌‌సీఏ ఈ మధ్య వార్తల్లో నానుతోంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, ఈ కారణంగానే భాగ్యనగరాన్ని బోర్డు విస్మరించిందని తెలుస్తోంది. తమ ప్రాథమిక ప్రణాళికలో  హైదరాబాద్‌‌ కూడా ఉన్నప్పటికీ హెచ్‌‌సీఏలో జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఉంచుకొనే భాగ్యనగరం స్థానంలో ఢిల్లీకి చాన్స్‌‌ ఇచ్చిందని నేషనల్‌‌ మీడియా సైతం చెబుతోంది.  ఈ సారి బయో బబుల్‌‌లో మ్యాచ్‌‌లను కండక్ట్‌‌ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌‌కు ఆ చాన్స్‌‌ ఇచ్చినా ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న హెచ్‌‌సీఏ పెద్దలను నమ్మే పరిస్థితి లేదు. అజర్‌‌పై మిగతా ఆఫీస్ బేరర్లు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ల అవినీతిపై మాజీ మెంబర్స్, క్లబ్ సెక్రటరీలు పోరాడుతున్నారు.  పైగా, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా అజర్ అండ్ కో ఇప్పటిదాకా ఏజీఎం నిర్వహించలేదు. అంబుడ్స్మన్‌‌, ఎగ్జిక్యూటివ్‌‌ ఆఫీసర్‌‌, క్రికెట్‌‌ అడ్వైజరీ కమిటీ, సీనియర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీలనూ నియమించలేదు. . అదే టైమ్‌‌లో హెచ్‌‌సీఏకు ఉప్పల్‌‌ తప్పితే మరో స్టేడియం అందుబాటులో లేదు.  ఇక, ఈ సీజన్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ ఫ్రాంచైజీ ఒక్క లోకల్‌‌ ప్లేయర్‌‌ను కూడా కొనుగోలు చేయలేదు. దాంతో, సన్‌‌రైజర్స్‌‌ మ్యాచ్‌‌లు అడ్డుకుంటామని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు హెచ్చరించారు. ఈ పర్యవసానాల నేపథ్యంలోనే హైదరాబాద్ను బీసీసీఐ పట్టించుకోలేదు. ఇక,  బోర్డు  వేదికలను నిర్ణయించే సమయంలో  అజర్‌‌ అహ్మదాబాద్‌‌లోనే ఉన్నాడని సమాచారం. అయితే,హెచ్‌‌సీఏ పాలనను గాలి కొదిలేశాడని  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అతను హైదరాబాద్‌‌ను విస్మరించొద్దని బోర్డు పెద్దలను  కోరే సాహసం చేయలేకపోయాడట. బోర్డు నిర్ణయం వెలువడిన తర్వాత హైదరాబాద్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌‌ చేసిన ట్వీట్‌‌కు మద్దతిచ్చాడు తప్పితే హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా బీసీసీఐని డిమాండ్‌‌ చేయలేకపోయాడని పలువురు విమర్శిస్తున్నారు. ఐపీఎల్‌‌ను కండక్ట్‌‌  చేసే సత్తా హైదరాబాద్‌‌కు ఉందని ట్వీట్‌‌ చేసిన అజర్‌‌ ముందుగా తాను ప్రెసిడెంట్‌‌గా ఉన్న అసోసియేషన్‌‌లో అవినీతిని ఎందుకు అరికట్టడం లేదని క్రీడాభిమానులు దుయ్యబట్టారు. రూల్స్‌‌కు విరుద్ధంగా ఇద్దరు సెలెక్టర్లతో స్టేట్‌‌ టీమ్‌‌ను ఎంపిక చేయడం, సెలెక్షన్స్‌‌ను వేలం పాటగా మార్చేసిన హెచ్‌‌సీఏ పరువు పోగొట్టుకున్నప్పుడు నోరు మెదపని అజర్‌‌కు ఐపీఎల్‌‌ మ్యాచ్‌‌లు కేటాయించమని బీసీసీఐని అడిగే హక్కు లేదని అంటున్నారు. ఏదేమైనా హెచ్సీఏ పాలకుల నిర్వాకంతో భాగ్యనగర అభిమానులు ఐపీఎల్ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోతున్నారు.హైదరాబాద్‌‌ను ఐపీఎల్‌‌ వేదికల నుంచి తప్పించడం వల్ల  హెచ్‌‌సీఏ ఆర్థికంగానూ భారీగా నష్టపోతుంది. ఒక్కో మ్యాచ్‌‌ నిర్వహణకు గాను బీసీసీఐ, ఫ్రాంచైజీ  చెరో రూ. 50 లక్షలు (గతంలో చెరో 30 లక్షలు) ఆతిథ్య అసోసియేషన్కు చెల్లిస్తాయి.  ఒకవేళ హైదరాబాద్‌‌ వేదికగా ఎంపికై  ఇక్కడ 7 మ్యాచ్‌‌లు జరిగితే హెచ్‌‌సీఏకు రూ.ఏడు కోట్ల మొత్తం లభించేది. కానీ, ఇప్పుడు ఆ ఆదాయాన్ని అసోసియేషన్‌‌ కోల్పోయింది.  మరోవైపు హెచ్‌‌సీఏ రాజకీయాలతో విసుగుచెందిన హనుమ విహారి, అంబటి రాయుడు వంటి స్టార్లు, రవికిరణ్‌‌ లాంటి టాలెంటెడ్‌‌ ప్లేయర్లు ఇప్పటికే  హైదరాబాద్‌‌ను వీడి ఇతర రాష్ట్రాల టీమ్స్‌‌కు ఆడుతున్నారు. ఆఫీస్‌‌ బేరర్లంతా తమ కుమారులు, బంధువుల పిల్లలు, పైసలు ఇచ్చిన వాళ్లనే ఎంపిక చేస్తుండడంతో  స్టేట్‌‌ టీమ్స్‌‌ ఆట దిగజారింది. హెచ్‌‌సీఏలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ఇప్పటికైనా అసోసియేషన్‌‌ను ప్రక్షాళన చేయాలని మాజీ క్రికెటర్‌‌ టి. సుమన్‌‌ అంటున్నాడు. బీసీసీఐ లేదా గంగూలీ, ద్రవిడ్‌‌, లక్ష్మణ్లలో ఎవరో ఒకరు ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాలని కోరాడు.

Related Posts