YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాళేశ్వరంపై డిస్కవరీ గ్రౌండ్ రీపోర్ట్...

కాళేశ్వరంపై డిస్కవరీ గ్రౌండ్ రీపోర్ట్...

హైదరాబాద్, జూన్ 23, 
కాళేశ్వరం ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన ఓ అద్భుతం. ఈ భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఘనత, ప్రాముఖ్యత మరోమారు అంతర్జాతీయ స్థాయిలో మారు మోగనుంది. ఇప్పటికే కాళేశ్వరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ ప్రాజెక్టుపై ప్రఖ్యాత డిస్కవరీ చానల్‌ ఓ డాక్యుమెంటరీని ప్రపంచ ప్రజల ముందుంచనుంది. ప్రాజెక్టు నిర్మాణాల్లో వినియోగించిన అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలో మరెక్కడా లేని అతి భారీ పంపులు, మోటార్లు, ఇంజనీర్లు, కార్మికుల శ్రమ, అన్నిటికీ మించి తమ కలల ప్రాజెక్టు సాకారానికి ప్రభుత్వం చేసిన కృషిని వివరించనుంది.గోదావరి జలాలను ఎత్తిపోస్తున్న వైనంపై ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’పేరిట డిస్కవరీ కథనాన్ని ప్రసారం చేయనుంది. ఈ నెల 25న శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు, ఇంగ్లిష్‌ సహా ఆరు భారతీయ భాషల్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. దీనిపై ప్రచారాన్ని మొదలు పెట్టిన డిస్కవరీ చానల్‌.. అన్ని దేశాల్లో తన మీడియా వ్యవస్థల ద్వారా ప్రోమోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. మనుషులు, మెషీన్లు కలిసి అసాధ్యమనుకున్న కార్యాన్ని ఏ విధంగా సుసాధ్యం చేశాయో తెలుసుకోవాలంటే దీన్ని వీక్షించాలని చెబుతోంది.2017లో ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పూర్తి చేసిన నిర్మాణాలను చూపుతూనే.. నీటిని ఆయకట్టు ప్రాంతాలకు తరలించే క్రమంలో ఎదురైన అనుభవాలను డాక్యుమెంటరీలో చూపనుంది. రోజుకు గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకం కింద 20 పంపుహౌస్‌లలోని 104 భారీ పంపులు, మోటార్లను ఏర్పాటు చేయడంలో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ చేసిన కృషిని వివరించనుంది. ముఖ్యంగా గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రం లోని 139 మెగావాట్ల భారీ పంపులు, మోటార్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. డిస్కవరీ వీటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. రూ.80 వేల కోట్లకు పైగా వ్యయంతో 40 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ భారీ ప్రాజెక్టుకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్న విధానాలు, రైతులు, పారిశ్రామిక రంగాల వారికి ప్రయోజనాలు, వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే తీరు తదితర అంశాలను చానెల్‌ విశ్లేషించనుంది. రెండ్రోజుల కిందట కామారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ డాక్యుమెంటరీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన అద్భుతాన్ని అంతర్జాతీయ సమాజం తెలుసుకుంటుందన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం, ఆర్ధిక సం ఘం, నీతిఆయోగ్, వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణులు, విదేశీ ప్రముఖులు కొనియాడటం గమనార్హం.

Related Posts