YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మంత్రి పదవిపై కోటి ఆశలు

మంత్రి పదవిపై కోటి ఆశలు

నెల్లూరు, జూన్ 24, 
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన వెంటనే టీడీపీ నుంచి వచ్చిన తొలి నేత ఆయనే. అందుకే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే జగన్ కు ప్రత్యేక అభిమానం. ఈసారి కేబినెట్ విస్తరణలో నల్లపురెడ్డికి చోటు ఉంటుందా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి ఖచ్చితంగా నల్లపురెడ్డికి జగన్ కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందని తెలుస్తోంది.ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత కావడం, జగన్ నే నమ్ముకుని పార్టీలోకి రావడం వంటివి ఆయనకు ప్లస్ అంటున్నారు. తొలి దశలోనే ఆయనకు మంత్రి పదవి దక్కాల్సి ఉంది. అయితే సామాజిక సమీకరణాల కారణంగా తొలి దఫా మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీనిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొంత అసంతృప్తిగానే ఉన్నారు. ఇంకో ఆరు నెలల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంది.దీంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. ఎలాంటి వివాదాల జోలికి పోవడం లేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి మంత్రిపదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ ను నమ్మి వచ్చిన తనకు అన్యాయం చేయరని ఆయన సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ను నేరుగా కలవకపోయినా తన మనసులో మాటను ఆయనకు చేరవేసినట్లు ఆయన వర్గీయులు చెబుతన్నారు.నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువ. ప్రస్తుత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంటుంది. కానీ మేకపాటిని కొనసాగిస్తూనే ఆ జిల్లాలో జగన్ మరో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిలో ఆశలు పెరిగాయి. మిగిలిన జిల్లాల్లో బీసీ ఇతర వర్గాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. దీంతో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అన్న టాక్ జిల్లాలో జోరుగా నడుస్తుంది.
అనిల్ కు చెక్ పెడతారనే ప్రచారం
జగన్ కేబినెట్‌లో ఫైర్ బ్రాండ్ మంత్రులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో పార్టీ కోసం నిలబడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు. నెల్లూరు సిటీ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ కేబినెట్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్‌ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తుంటారు. సందర్భాన్ని బట్టి పరుష పదజాలం సైతం వాడుతూ, ప్రత్యర్ధులపై విరుచుకుపడుతుంటారు. జ‌గ‌న్ కేబినెట్లో ఉన్న ఫైర్ బ్రాండ్ మంత్రుల్లో అనిల్ కూడా ఒక‌రు. జ‌గ‌న్‌పై ప్రత్యర్థి పార్టీ నేత‌లు ఈగ కూడా వాల‌నివ్వకుండా అనిల్ కుమార్ యాదవ్ ఎదురు దాడికి దిగుతుంటారు.ఇలా ప్రత్యర్ధులపై దూకుడు ప్రదర్శించే అనిల్ కుమార్ యాదవ్ తన సొంత నియోయజకవర్గంలో దూకుడుగా ఉన్నారా? అంటే…ఉన్నారనే చెప్పొచ్చు. ఓ వైపు మంత్రిగానే ఉంటూ, మరోవైపు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సేవలు చేస్తున్నారు. మంత్రిగా ఉండటంతో నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు తెచ్చుకోగలుగుతున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు మరింత అడ్వాంటేజ్ కానున్నాయి. ఇలా నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ మరింత బలం పెంచుకుంటున్నారు. 2014లోనే భారీ మెజార్టీతో గెలిచి స‌త్తా చాటారు. మొత్తంగా ద‌శాబ్దంన్నర కాలంగా అనిల్ ఇక్కడ పాతుకుపోయారు.ఇంత బలంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు చెక్ పెట్టాలంటే ప్రత్యర్ధి టీడీపీ నుంచి అంతే బలమైన నాయకుడు కావాలి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే నాయకుడు ఉండాలి. అలాగే నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి. ఇక ఈ విషయాల్లో ఎలాంటి లోటు చేయకుండా టీడీపీ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దూసుకెళ్తున్నారనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ మీద మాజీ మంత్రి నారాయణ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగారు. దీంతో చంద్రబాబు, కోటంరెడ్డిని రంగంలోకి దించారు. బాలయ్యతో సన్నిహితంగా ఉండే కోటంరెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దూకుడు కనబరుస్తున్నారు.
జిల్లాలో మిగతా టీడీపీ నాయకులు పెద్దగా నోరువిప్పకపోయినా సరే, కోటంరెడ్డి మాత్రం వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. అస‌లు జిల్లాలో టీడీపీకి అసెంబ్లీలో ప్రాధినిత్యమే లేదు. ఓడిపోయాక ఆరేడుగురు ఇన్‌చార్జ్‌లు అస‌లు ప్రజ‌ల్లోకి వెళ్లడం లేదు. వీరంద‌రికి కంటే కూడా కొత్తగా ఇన్‌చార్జ్‌గా వ‌చ్చిన కోటంరెడ్డి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్యవ‌హ‌రిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోనే సమస్యలపై పోరాటం చేస్తూ, మంత్రి అనిల్‌పై విమర్శలు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉండటం, తాను మంత్రిగా ఉండటంఅనిల్ కుమార్ యాదవ్ కు కలిసొచ్చే అంశం. మాజీ మంత్రి నారాయ‌ణ కంటే కూడా కోటంరెడ్డే అనిల్‌కు స‌రైన ప్రత్యర్థి అన్న టాక్ అయితే ఆయ‌న ఇప్పటికే సొంతం చేసుకున్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోటంరెడ్డి పై చేయి సాధిస్తారా ? లేదా ? అన్నది చూడాలి.

Related Posts