YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అప్పుల్లో కార్పొరేషన్లు...

అప్పుల్లో  కార్పొరేషన్లు...

గుంటూరు, మే 16,
ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థికంగా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ అవసరాల కోసం చేస్తున్న అప్పులు సంపదసృష్టికి అక్కరకు రావడం లేదని ఆయా సంస్థల అధికారులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన అకౌంటెంటు జనరల్‌ కార్యాలయం కూడా నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఆర్థికశాఖకు ఒక లేఖ రాసింది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో లేకుండా తీసుకుంటున్న ఇటువంటి రుణాల వివరాలు సమర్పించాలని నిర్దేశించింది. ప్రభుత్వ రంగ సంస్థలైన అనేక కార్పొరేషన్లు ఇటీవల కాలంలో భారీగా రుణాలు తీసుకుంటు న్నాయి. దాదాపు 33 సంస్థలు రెండు లక్షల కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో సింహభాగం ప్రభుత్వ అవసరాలకు పిడి ఖాతాల ద్వారా మళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. మొత్తం ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ కింద 33 సంస్థలు రూ.2.14 లక్షల కోట్ల వరకు రుణాలు సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రూ.35 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇంధన శాఖకు సంబంధించి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ.14 వేల కోట్లు, పవర్‌ కో-ఆర్డినేషన్‌ సంస్థ ద్వారా డిస్కామ్‌లు రూ.11 వేల కోట్లు, జెన్‌కో రూ.5 వేల కోట్లు, పవర్‌ డెవలప్‌మెరటు కార్పొరేషన్‌ రూ.వెయ్యి కోట్లు రుణంగా తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టిడ్కో రూ.12 వేల కోట్లు, గృహ నిర్మాణ సంస్థ రూ.4 వేల కోట్లు రుణంగా సమీకరించుకున్నట్లు తెలిసింది. రహదారుల అభివృద్ధి సంస్థ, నీటివనరుల అభివృద్ధి సంస్థ, ఆర్‌టిసి కూడా ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ తీసుకున్న జాబితాలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటుచేసిన రాష్ట్రాభివృద్ధి సంస్థ రూ.23 వేల కోట్లు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ రూ.10 వేల కోట్లు తీసుకోగా, గ్యారెంటీలు లేకుండా మరికొన్ని సంస్థలు రూ.65 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం రుణంలో కొన్ని సంస్థలు తామే రుణం తీసుకుని, తామే చెల్లించుకుంటున్నది రూ.50 వేల కోట్ల వరకు ఉంటుందని, దీంతో ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్స్‌ మొత్తం 1.64 లక్షల కోట్లకు చేరుకున్నట్లుగా ఉందని తెలిసింది. ఇంత భారీ రుణాలపై ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల వరకు అసలుకు వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో పెను భారంగానే మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఎజి కార్యాలయం రాసిన లేఖ ఆర్థికశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి వ్యయం అంతా నిర్ధిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని పేర్కొంది. అనుమతి లేకుండా చేసే రుణాలు ప్రభుత్వ రుణాలుగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకే అనేక కోణాల్లో వివరాలు కూడా కోరింది. ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఎంత రుణం తీసుకుంది, అందులో ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న రుణం ఎంత అన్న వివరాలతోపాటు, రుణమిచ్చిన ఆర్థిక సంస్థ, అందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల వివరాలు కూడా సమర్పించాలని కోరింది.
3 వేల కోట్లలో 782 కోట్లే వచ్చింది
రాష్ట్ర ఖజానా మళ్లీ ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి చేరిపోయింది. జీతాలకు కూడా డబ్బుల్లేక ఈ నెల ఐదో తేదీన రూ.2,118 కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి ఆర్థికశాఖ వెళ్లింది. ఈ నగదుతోనే వాయిదాల పద్ధతిపై కొంతమందికి జీతాలు చెల్లించగలిగారు. ఇదే సమయంలో ఆరో తేదీన సెక్యూరిటీ బాండ్ల తనఖా ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి బహిరంగ మార్కెట్‌ రుణాలుగా రూ.మూడు వేల కోట్లు తీసుకున్నారు. వెరటనే ఈ రుణంలో ఓవర్‌డ్రాఫ్ట్‌కు సంబంధించిన రూ.2,118 కోట్లు రిజర్వు బ్యాంకులో జమైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో కేవలం రూ.872 కోట్లు మాత్రమే ఇతర అవసరాలకు మిగిలినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలను ఎటువంటి ఓవర్‌డ్రాఫ్ట్‌ లేకుండానే నెట్టుకు వచ్చిన ఆర్థికశాఖ మే నెల్లో మాత్రం ఓడికి వెళ్లకతప్పలేదు. ఐదో తేదీన ఉపయోగించుకున్న ఓవర్‌డ్రాఫ్ట్‌ వరుసగా మూడు రోజులు కొనసాగడం గమనార్హం. ఏప్రిల్‌ ఆఖరులో మిగుల్చుకున్న నిధులతో మే ఒకటో తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. దీంతో ఖజానా ఖాళీ కావడంతో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లను అందించలేకపోయారు. మూడో తేదీ రంజాన్‌ కావడంతో నాలుగు, ఐదో తేదీల నుంచి జీతాల చెల్లింపులు ప్రారంభించారు. అందుకే ఐదో తేదీన తప్పనిసరిగా ఓడీకి వెళ్లి జీతాలు చెల్లించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ నిధులు కూడా చాలకపోవడంతో చాలామందికి ఇంకా జీతాలు పడలేదని తెలిసింది. బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా వచ్చిన నిధులను జీతాలు, పింఛన్లకు వినియోగించుకోవాలంటే అందులో కూడా సింహభాగం నిధులు ఓడి రూపంలో రిజర్వు బ్యాంకులో జమైపోయాయి. ఈ కారణంగానే పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించలేకపోయినట్లు ఒక అధికారి వ్యాఖ్యానించారు.

Related Posts