YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముందస్తు అడుగులు పడుతున్నాయా..

ముందస్తు అడుగులు పడుతున్నాయా..

హైదరాబాద్, మే 16,
తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. రేపో మాపో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి అనే విధంగా రాజకీయ పార్టీలు, పరుగులు తీస్తున్నాయి. మరో వంక ముఖ్యమంత్రి కేసీఆర్, ఒక సారి అచ్చొచ్చిన, ‘ముందస్తు’ కు మరోసారి వెళతారనే వదంతులు, ఉహాలు,ఉహాగానాలు, వ్యూహాగానాలు చాలా కాలంగా ఇటు పొలిటికల్ సర్కిల్స్’లో అటు మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే. ముఖ్యమంత్రి కేసీఆర్, అదే విధంగా అధికార తెరాస ముఖ్య నాయకులు మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తేల్చి పారేస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్’ అయితే మీడియా సమావేశంలోనే, “ముందస్తుకు వెళ్ళడం లేదు. ఐదేళ్ళ గడువు ముగిసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం” , అని కుండబద్దలు కొట్టారు. అయితే ఆయన అంత గట్టిగా చెప్పడం వల్లనే ముందస్తు అనుమానాలు మరింత బలపడుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు అంతే గట్టిగా ముందస్తు తధ్యం అంటున్నాయి.టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అయితే, ముందస్తు ఖాయమని అంటున్నారు. వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన చాలా విశ్వాసంతో ఉన్నారు. మరోవంక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తుకు వెళితే, ఆయన వెంట కేసీఆర్ కూడా వెళతారని కొందరు రాజకీయ విశ్లేషకులు, జోస్యం చెపుతున్నారు. అయితే, ఎవరు ఏమనుకున్నా చివరకు నిర్ణయం తీసుకోవలసింది, ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత, ముందస్తు బంతి కేంద్రంకోర్టుకు చేరుతుంది. ఆపైన ఏమి జరుగుతుంది అనేది ప్రస్తుతానికి సమాధానం చిక్కని చిక్కు ప్రశ్న. అందుకే ముఖ్యమంత్రి రెండు ఆలోచనలతో ఉన్నారని అంటున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికలు జరపక పోయినా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించినా, తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా చిక్కుల్లో పడిపోతుందని ఆలోచిస్తున్నారని, అందుకే స్థిరమైన నిర్ణయంతీసుకోలేదని, తెరాస వర్గాలు అంటున్నాయి.అయితే, ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, తెలంగాణలో తాము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అంటూ    సవాలు విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్ షా ఈ సవాలు విసిరారు. ఈనేపధ్యంలో, మరో మారు ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. అమిత్ షా స్వయంగా సవాలు విసిరారు కాబట్టి, అసెంబ్లీ రద్దు చేసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో ముందస్తుకు వెళ్లేందుకు తెరాస సిద్దంగా ఉందా అంటే, రాజకీయ, మీడియా వర్గాల్లోనే కాదు, తెరాసలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, కేసీఆర్ హ్యాట్రిక్ కల కలగానే మిగిలిపోతుందని,పీకే టీమ్ నిరహించిన స్వీయ సర్వేలలో స్పష్టమైందని, అందుకే ముఖ్యమంత్రి ముందస్తు అలోచనని వెనక్కి నెట్టారని అంటున్నారు.అయితే, సమయమ గడిచే కొద్దీ పరిస్థితి మరింత చేజారిపోయే ప్రమాదంలేకపోలేదనే హెచ్చరికలు వినవస్తున్నాయని తెరాస వర్గాలు ఆందోళన వ్యక్త పరుస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడంతో, కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని సమస్యలు సృష్టించే ప్రమాదం లేక పోలేదని అంటున్నారు.ఇప్పటికే, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేనంతటి ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతున్న రాష్ట ప్రభుత్వం ముందు ముందు మరింతగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని అంటున్నారు. మరో వంక కేంద్ర ప్రభుత్వం, ఒక్క తెలంగాణకే కాకుండా దేశం మొత్తంలో  ఆర్థిక క్రమశిక్షణ పేరిట, రాష్ట్రాల అప్పులకు కళ్ళెం వేసేవిధంగా నట్లు బొట్లు బిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పూచికత్తుతో వివిధ కార్పొరేషన్ల ద్వారా సేకరిస్తున్న రుణాల వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లో చేర్చి, ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తెచ్చే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతోంది. అదే జరిగితే, అప్పులు ఆగిపోతాయి. అప్పులు ఆగిపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. సంక్షేమ పథకాలు ఆగిపోతే, ఓటు బ్యాంకు దివాలా తీస్తుంది. అందుకే ఆ పరిస్థితి రాకముందే, ముందస్తుకు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఉత్తమమనే అభిప్రాయం కూడా అధికార పార్టీ నాయకులు వ్యక్త పరుస్తునారు. ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి అయితే, అమిత్ షా సవాలును స్వేకరించేది లేదని, తెరాస నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్’ఎప్పుడోనే ముందస్తు ఎన్నికల ఆలోచన లేదని స్పష్తం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.అయితే, వ్యూహ ప్రతి వ్యూహాల నడుమ సాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related Posts