YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ ముళ్లు

గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ ముళ్లు

హైదరాబాద్, మే 16,
టీఆర్ఎస్ నేతల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. ప్రజాప్రతినిధులుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు లభించడం లేదని మండిపడుతున్నారు. నియోజకవర్గాల్లో, గ్రేటర్ డివిజన్లలో జరిగే అధికారిక సమావేశాలకు సైతం ఆహ్వానించడం లేదని గుర్రుగా ఉన్నారు. దీంతో కొంతమంది నేతలు రాజీనామా యోచనలో ఉన్నట్లు సమాచారం. రోజురోజూకు నేతల మధ్య అంతరం పెరుగుతుండటంతో పార్టీ బలహీనపడుతోంది. ఈ విషయం గ్రేటర్ ఎన్నికల్లో సైతం స్పష్టం అయినప్పటికీ పార్టీ మాత్రం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి గడ్డుకాలం తప్పదని పార్టీనేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారుఉద్యమపార్టీగా, తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజల్లో గుర్తింపు పొందింది. రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టడంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం గులాబీ గూటికీ చేరారు. దీంతో నేతల మధ్య పంచాయతీ మొదలైంది. నియోజకవర్గాలకే పరిమితం అవుతుందనుకున్న నేతల పోరుగా గ్రేటర్‌కు చేరింది. కొత్తపాత నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో రాజీనామాలకు సైతం ఉద్యమకారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నేతలు సైతం రాబోయే ఎన్నికల్లో టికెట్ రేసులో ఉన్నారు. అయితే పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకే నియోజకవర్గంలో సర్వాధికారులు అప్పగించడంతో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు గతం నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ సమావేశాలకు సైతం ఆహ్వానించడం లేదని సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు.ఉప్పల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం టీఆర్ఎస్ సీనియర్ నేత బొంతు రాంమ్మోహన్ ఆ టికెట్ ఆశిస్తున్నాడు. ఇరువురి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుండగా, గత నెలలో నిర్వహించిన ప్లీనరీ సందర్భంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని పరోక్షంగా బొంతుపై సుభాష్ రెడ్డి సమీక్షా సమావేశంలో వ్యాఖ్యలు చేయడంతో మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపీనాథ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, ఉద్యమకాలం నుంచి పనిచేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే రాజీనామా వద్దని పలువురు సీనియర్ నేతలు వారించినట్లు సమాచారం. అదే విధంగా గ్రేటర్ లోని అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. టికెట్ రాని పక్షంలో పార్టీ మారే ఆలోచనలో ఆశావాహులు ఉన్నట్లు సమాచారం.గ్రేటర్‌లో 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 56 స్థానాలకే పరిమితం కావడం నేతల మధ్య వర్గపోరును స్పష్టం చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి తక్కువ స్థానాల్లో గెలువడంతో అధినేత సైతం నేతలపై ఆగ్రహించారు. ఏదీ ఏమైనప్పటికీ ఎక్స్ అఫీషియోలతో అధికారం చేజిక్కించుకున్నప్పటికీ వర్గపోరు మాత్రం సమసి పోలేదు. మరింత ఎక్కువ అయింది. దీంతో రాబోయే ఎన్నికల్లో మరింత గడ్డుకాలం ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లోస్థానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్ అభ్యర్థులకు సహకరించకపోవడంతోనే ఓటమిపాలైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక వైపు కార్పొరేటర్లు, పార్టీ నేతలు సిట్టింగ్ లకు సహకరిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Related Posts