YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరపైకి మండవ ..?

తెరపైకి మండవ ..?

నిజామాబాద్, మే 16,
టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్‌ది తిరుగులేని పాత్ర. కారు పార్టీలో ఆయన మాటే శాసనం, ఆయన బాటే అనుసరణీయం. తన ఆలోచన నుంచి ఏ మాత్రం సైడ్ అయిపోయినా ఆయన దాన్ని సహించరు. ఈ విషయం ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. అందుకే కేసీఆర్ మాటకు ఎదురు చెప్పడం కాదు కదా అలాంటి ఆలోచన చేయడానికి కూడా సాహసించరు. పార్టీపై ఇంతటి పట్టు ఉన్నప్పటికీ కేసీఆర్ ఆలోచనకు అంతుచిక్కని వారు కూడా లేకపోలేరు. అలాంటి వారిలో ఈటల రాజేందర్, డి.శ్రీనివాస్ ముఖ్యులు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోగా డీఎస్ మాత్రం అధికారికంగా ఇంకా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 21తో ముగియనుంది. కొంత కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా, కాంగ్రెస్‌కు చేరువ అవుతున్న డీఎస్‌కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ కేసీఆర్ కూతురు కవితను ఓడించి నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఏక కాలంలో చెక్ పెట్టేందుకు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు పేరును ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రంలో వేర్వేరు తేదీల్లో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సీట్లను ఆశించే వారి సంఖ్య టీఆర్ఎస్‌లో భారీగానే ఉంది. కేసీఆర్ మనసులో నిజామాబాద్ జిల్లాకు మండవ వెంకటేశ్వరరావు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అదే జిల్లాకు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే జిల్లా నుండి ఇద్దరికి రాజ్యసభకు కేసీఆర్ అవకాశం కల్పించగలుగుతారా? ఆ నిర్ణయంతో ఇతర జిల్లాల నుంచి వ్యతిరేకత ఏమైనా వస్తుందా? అనే అంశంలో రాజకీయ వర్గాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.మండవ వెంకటేశ్వర రావుతో సీఎం కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన మండవ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో 2019 ఏప్రిల్ 5న స్వయంగా సీఎం కేసీఆర్ హైదారాబాద్ లోని మండవ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరాలని కోరారు. కేసీఆర్ తో ఇంటికి వచ్చి చర్చలు జరిపిన మరుసటి రోజే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో మండవ గులాబీ కండువా కప్పుకున్నారు. సీనియర్ పొలిటీషియన్ అయిన మండవ వెంకటేశ్వర రావుకు రాజ్యసభకు పంపిస్తే నిజామాబాద్ జిల్లాలో పార్టీ పట్టు మరింత పెరగడంతో పాటు తనపై అసమ్మతి రాగం ఆలపిస్తున్న డీఎస్ కు చెక్ పెట్టవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. మొత్తంగా డీఎస్ కుటుంబంలో తండ్రి కొడుకులకు చెక్ పెట్టే వ్యవహారంలో చివరి వరకు ఏం జరుగుతుందో చూడాలి మరి.
భారీగా పోటీ
టీఆర్ఎస్‌లో రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థిని బలపరుస్తూ నాలుగు సెట్లు వేసే అవకాశం ఉండటంతో అన్నింటిపై శాసనసభ్యులతో సంతకాలు చేయిస్తుంది అధిష్టానం. అయితే ఆశావాహులు మాత్రం ఆరేళ్ల పదవికాలంను ఆశిస్తున్నట్లు సమాచారం. బండ ప్రకాశ్ స్థానం రెండేళ్లు మాత్రమే ఉండటంతో ఆ స్థానానికి నేతలు అనాసక్తి చూపుతున్నారు. నామినేషన్ల చివరి రోజు రాజ్యసభ స్థానాలకు ఎంపిక చేసే అభ్యర్థులకు మాత్రం అధినేత నేరుగా ఫోన్ చేసి నామినేషన్లు వేయాలని సూచించనున్నట్లు సమాచారం.రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు ఎవరిని నియమించాలనే దానిపై అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించారు. అయితే కొందరు నేతలకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వగా.. దానిని పలువురు బహిర్గతం చేశారు. దీంతో వారి స్థానంలో ఇతరులను తిరిగి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేలతో సంతకాలు చేయిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో రాజ్యసభ స్థానంను నాలుగు సెట్లు వేసే అవకాశం ఉంది. అయితే ఒక్కసెట్ పై అభ్యర్థిని బలపరుస్తూ 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ నామినేషన్ పత్రంపై అభ్యర్థి పేరు తప్పా మిగతా అన్ని ఫార్మాట్లను కంప్లీట్ చేస్తున్నారు. నామినేషన్ చివరి రోజూనే నామినేషన్ పత్రాలు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పదవుల కాలం ఆరేళ్లు(2028). అయితే ఎక్కువ కాలం ఉండటంతో ఆశావాహులు ఎక్కువగా ఈ స్థానాల కోసం మంతనాలు తీవ్రతరం చేశారు. ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి. ఇదిలా ఉంటే బండ ప్రకాశ్ రాజీనామాతో ఉప ఎన్నికతో ఎన్నికైన అభ్యర్థి మాత్రం రెండేళ్ల పదవికాలం మాత్రమే ఉంది. అయితే ఈ స్థానానికి నేతలు మొగ్గు చూపడం లేదని సమాచారం. స్థానాలు మూడు మాత్రమే ఉండటం పదుల సంఖ్యలో ఆశావాహులు ఉండటంతో పోటీ తీవ్రమైంది.ఉప ఎన్నికకు గడువు ఈ నెల 19 ఉండగా, మరో రెండు స్థానాలకు ఈ నెల 31 చివరి తేదీ. అయితే అదే రోజూ ఉదయం అధినేత కేసీఆర్ రాజ్యసభ స్థానాలకు ఎంపిక చేసే అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి నామినేషన్ వేయాలని సూచించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నామినేషన్లను మంత్రి కేటీఆర్ తో కలిసి అసెంబ్లీ సెక్రటరీ కి అందజేయనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఏదీ ఏమైనప్పటికీ ఆశావాహుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది.

Related Posts