YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మంలో పార్టీ ఫిరాయింపులు..?

ఖమ్మంలో పార్టీ ఫిరాయింపులు..?

ఖమ్మం, జూన్ 28,
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతలకు సీటు భయం పట్టుకుంది. పార్టీ ఫిరాయించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు నాయకులు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిన నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉండిపోయారు. అలాంటి వారంతా భవిష్యత్‌పై బెంగ పెట్టుకుని పక్క పార్టీలో బిస్తర్‌ వేసుకుంటున్నారు.గతంలో అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఓడిన తాటి వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఇదే బాటలో మరికొందరు ఉన్నట్టు సమాచారం. పినపాకలో ఓడిన టీఆర్ఎస్‌ నేత పాయం వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉన్నా.. అక్కడ రేగా కాంతారావు పాగా వేసేశారు. పాయానికి టీఆర్ఎస్‌ టికెట్ ఇస్తుందో లేదో తెలియదు. ఆయన అనుచరులు ఇదే గందరగోళంలో ఉన్నారట. పైగా పాయం మాజీ ఎంపీ పొంగులేటికి ముఖ్య అనుచరుల్లో ఒకరు. దీంతో పాయం టీఆర్ఎస్‌లోనే ఉంటారా.. లేక సీటు కన్ఫామ్‌ చేసే పార్టీలోకి జంప్‌ చేస్తారా అనేది పినపాకలో పెద్ద చర్చగా ఉంది.ఇల్లెందులో ఓడిన టీఆర్ఎస్‌ నేత కోరం కనయ్యది కూడా ఇలాంటి సంకటి స్థితే. కాకపోతే ఎన్నికల్లో ఓడిన కనకయ్యను పార్టీ జడ్పీ ఛైర్మన్‌ను చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు కనకయ్యకు ఇల్లెందులో అస్సలు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కనకయ్య చూస్తున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోతే జంప్‌ చేస్తారా లేదా అనేది స్పష్టత లేదు. ఈ మధ్య మాజీ ఎంపీ పొంగులేటితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు కోరం.గతంలో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడి.. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్న మట్టా దయానంద్‌ సైతం పోటీకి తహతహలాడుతున్నారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని సెంటిమెంట్‌ పండిస్తున్నారు కూడా. టీఆర్ఎస్‌ టికెట్‌ ఇవ్వకపోతే కాంగ్రెస్‌లో చేరొచ్చని సత్తుపల్లిలో ప్రచారం జోరందుకుంది. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందా? మదన్‌లాల్‌ మాత్రం పోటీ చేయాల్సిందే అని అనుచరులకు చెబుతున్నారట. దాంతో ఈ మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తారనేది కేడర్‌కు అంతుచిక్కడం లేదు. ఇలా జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న నాయకులు సేఫ్‌ ప్లేస్‌ కోసం జంప్‌ జిలానీలుగా మారే పనిలో ఉన్నారట. మరి.. తాటి తర్వాత క్యూ కట్టే నాయకులు ఎవరో కాలమే చెప్పాలి.

Related Posts