YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీ అంతా గులాబీ ఫ్లెక్సీలు.... మాస్టర్ ప్లాన్ తో టీఆర్ఎస్

సిటీ అంతా గులాబీ ఫ్లెక్సీలు.... మాస్టర్ ప్లాన్ తో టీఆర్ఎస్

హైదరాబాద్, జూన్ 28,
ఎవ‌ర‌యినా పెళ్లికో, మ‌రేద‌యినా శుభ‌కార్యానికో వూళ్లో అంద‌రినీ ఆహ్వానిస్తారు. అందుకు చేయాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తారు.  తెలిసి తెలిసి ప‌డ‌ని వారిని,  తిట్టుకునేవారిని  ఆహ్వానిస్తారా?  అస‌లు వారికి ఇంటివేపు వ‌చ్చే అవ‌కాశం కూడా ఇవ్వ‌రేమో!  ప్ర‌స్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ ఎస్ ఇలాంటి ప‌నిలోనే నిమ‌గ్న‌మ‌యింది.  త‌మ పాల‌నను, త‌మ నాయ‌కుల‌ను దాదాపు ప్ర‌తీ వేదిక  మీదా తిడుతూ, రెచ్చ‌గొట్టే ప్ర‌సంగాలు, కామెంట్లు చేస్తున్న బిజెపీ వారిని మాత్రం వూరికే వ‌దిలేస్తుందా? స‌రిగ్గా వారి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు నిర్వ‌హించాల్సిన స‌మ‌యానికి ఫ్లెక్సీల‌తో, బ్యాన‌ర్ల‌తో ఏమీ తోచ‌ని స్థితి క‌ల్పించింది. పాత‌ రోజుల్లో ప‌డ‌ని పార్టీవారి నాయ‌కులు, ప్ర‌చార‌క‌ర్త‌ల ఇళ్ల‌మీద పిడ‌క‌లు వేయ‌డం, బొగ్గుతో  నినాదాలు రాయ‌డం బాగా పోటా పోటీగా సాగేది. అప్ప‌ట్లో అదో యుద్ధం. ఇప్పుడు అత్యాధునికంగా ఫ్లెక్సీ ల‌తో దాదాపు యుద్ధ‌ ప్ర‌క‌ట‌నే కావిస్తున్నారు. టిఆర్ ఎస్ పాల‌న‌లో రాష్ట్రం దారుణంగా త‌యార‌యింద‌ని, కుటుంబ పాల‌న‌లో ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతాంగం నానా  అవ‌స్థ‌లూ ప‌డుతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో దాడుల‌కు దిగింది తెలంగాణా బిజెపీ. అవ కాశం దొరికిన‌ చోట‌ల్లా టిఆర్ ఎస్ నాయ‌కుల మీద వ్య‌తిరేక‌త‌ను వెళ్ల‌గ‌క్కుతున్నారు, బీజేపీ నేతలు. కేంద్రం నుంచి ఎంతో స‌హాయం అందుతున్నా పైసా అంద‌లేద‌ని,  రాష్ట్రం మీద సీత క‌న్నువేశార‌ని బిజెపిని దుమ్మెత్తి పోస్తున్న టిఆర్ ఎస్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీఠం దింపేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో  బిజెపి జాతీయ నాయ‌కుల సైతం రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ఇక్క‌డి పాల‌నా లోపాల‌ను, ప్ర‌జ‌ల్ని కేసీఆర్ కుటుంబం మోసం చేస్తోం ద‌ని ఎడ‌ తెగ‌ని ప్ర‌చారం చేస్తున్నారు. బండి లాంటి బిజెపీ నాయ‌కుల‌కు టిఆర్ ఎస్ పై వాగ్ధాటితో దాడి చేయ‌డం త‌ప్ప వేరే ప‌నిలేద‌ని టిఆర్ ఎస్ తిడుతోంది. రాష్ట్రం నుంచీ కేంద్రం ఎంతో పొందుతూ రాష్ట్రానికి మొండిచేయి చూప‌డం కేవ‌లం అధికార కాంక్ష‌తో వ్య‌వ‌హ‌రించడమేననీ, ఈ  తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని హెచ్చ‌రిస్తున్నారు. బిజెపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య ఈ యుద్ధాన్ని త‌మ‌కు అనుకూలం చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే  ఇక్క‌డ వ‌చ్చే నెల 3, 4 తేదీల్లో  బిజెపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాన్ని నిర్వహించ త‌ల‌పెట్టారు. అస‌లు రాష్ట్రం గురించి ప‌ట్టించుకోనివారు, త‌మ అభ్య‌ర్ధ‌న‌ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌వారికి ఇక్క‌డ అంత సుఖంగా ఏద‌న్నా కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకోను ఎలా వీలుంటుంది? మెట్టినింట కూతురు పడుతున్న  ఆరళ్ల‌ను విన్న త‌ల్లి వారిని ఎలా గౌర‌విస్తుంది?  బిజెపీ ఇక్క‌డ స‌మావేశాలు నిర్వ‌హించాల‌నుకోవ‌డం పెద్ద ర‌హ‌స్య మేమీ లేదు. ఇలాంటి పార్టీ స‌మావేశాలు కేవ‌లం ఇక్క‌డి అధికార పార్టీని, సీఎంను తిట్ట‌డానికి, బిజెపి చేస్తున్న సాయం వృధా చేస్తున్న‌ద‌ని భారీ ప్ర‌చారం చేసి ప్ర‌జ‌ల‌కు టిఆర్ ఎస్ ప‌ట్ల విముఖ‌త వ‌చ్చేలా చేయ‌డ‌మే క‌మ‌ల‌నాధుల ల‌క్ష్యం. అయితే ఈ స‌మావేశాల ల‌క్ష్యం ఏమాత్రం స‌ఫ‌ల‌మ‌వుతుంద‌న్న‌ది ప్ర‌జ‌ల స్పంద‌నే తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం స‌మావేశాల నిర్వ‌హ‌ణ గురించి భారీ ప్ర‌చారం చేసుకోవా ల‌నుకున్న పార్టీ వ‌ర్గాల‌కు  టిఆర్ ఎస్ శ్రేణులు  ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల‌కే  జానెడు స్థ‌లం ఏ గోడమీదా మిగల్చలేదు. ఆఖరికి మెట్రో స్తంభాలను కూడా తెరాస ప్రకటనలతో నింపేశాయి. తెలంగాణ‌లో టిఆర్ ఎస్‌, బిజెపీ మ‌ధ్య పోరు తీవ్రతను ఇది   స్ప‌ష్టం చేస్తోంది.  ఇపుడు మ‌రి వ్య‌తిరేక‌త‌ను త‌మ వాగ్ధాటితో ప్ర‌చారం చేసినంత‌గా బిజెపీ వ‌ర్గీయులు త‌మ స‌మావేశం గురించి ప్ర‌చారం ఎలా చేయ‌గ‌ల‌రో చూడాలి.  ఎందుకంటే  ఇక సిటీలో బీజేపీకి ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ కు  తావు లేకుండా చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. ఎల్ అండ్ టి, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో  టీఆర్ఎస్ వారం రోజులు ప్రి ప్లాన్డ్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక 2300 లకు పైగా మెట్రో పిల్లర్లపై ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తోంది. సిటీలోని వెయ్యి బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మొత్తానికి బీజేపీ తేరుకునే లోగా టీఆర్ఎస్ పని చక్కబెట్టేసింది. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందో వేచి చూడాలి.

Related Posts