YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాలుగో వేవ్ భయం..

నాలుగో వేవ్ భయం..

న్యూఢిల్లీ, జూన్ 29,
దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని.. కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కొవిడ్ కేసులను ముందస్తుగా గుర్తించడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. కొవిడ్ ప్రోటోకాల్‌ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. కొవిడ్ క్లస్టర్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.త్వరలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో యాత్రలు ప్రారంభం కానున్నాయని, పండుగల సీజన్ వస్తోందని తెలిపారు. దీనివల్ల ప్రజలు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారని, ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని సూచించారు. కరోనా పరీక్షల నిర్వహణ, నిర్ధారణ, వైద్యం, వ్యాక్సినేషన్ వంటివి కొనసాగించాలని లేఖలో స్పష్టం చేశారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, జిల్లా యంత్రాంగం వ్యాక్సినేషన్ సమగ్రస్థాయిలో పూర్తిచేసేందుకు కృషి చేయాలని తెలిపారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నుంచి మే వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి కేేసుల సంఖ్య పదివేలకు మించి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇవాళ 11,793 కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 17,073 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇది ఆదివారంతో పోలిస్తే దాదాపుగా 45 శాతం పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఇవాళ కేసులు తగ్గుముఖం పట్టాయి.

Related Posts