YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పువ్వాడ వర్సెస్ పొంగులేటీ

పువ్వాడ వర్సెస్ పొంగులేటీ

ఖమ్మం, జూన్ 30,
రాష్ట్ర రాజకీయాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ తెలియని వారుండరు. ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా.. మాజీ ఎంపీ పొంగులేటికి ప్రస్తుతం పార్టీలో 'బ్యాడ్ టైం' నడుస్తుందనే చెప్పాలి. ఇక పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో 'టైం' ఎలా ఉండబోతుందోననే చర్చ జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. ఇద్దరు అగ్రనేతలు ప్రస్తుతం 'టైం' కోసం ఎదురు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ 'టైం' గోల ఏంటనుకుంటున్నారా..? అవును.. ఈ ఇద్దరు నాయకులు గడియారాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. శుభకార్యాలు, వివాహాలకు గడియారాల్లో తమ ఫొటోలను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి కుమారుడు హర్ష రెడ్డి వివాహానికి రెండు జిల్లాల వ్యాప్తంగా వాల్ క్లాక్‌లు పంపిణీ చేశాడు. ప్రతీ ఇంటికి, షాపులకు అందేలాచూశాడు. మరో రెండునెలల్లో కూతురు స్వప్ని రెడ్డి వివాహం కూడా ఉండటంతో మరోసారి వాచ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టాడు. మంత్రి అజయ్ కుమార్ కుమారుడు నయన్ రాజ్ నిశ్చితార్థం కూడా ఈ మధ్యే హైదరాబాద్‌లో జరిగింది. వివాహం కూడా త్వరలో ఉండటంతో మంత్రి కూడా వాల్ క్లాక్‌ల పంపిణీకి సిద్ధమయ్యాడు. వాచ్‌ల మధ్యలో పొంగులేటి తన ఫొటో పెట్టుకుని పంపిణీకి సిద్ధం చేస్తుంటే.. మంత్రి మాత్రం తన ఫొటోతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటో పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే జిల్లాలోని ఇద్దరు అగ్రనేతలు శుభకార్యాలయాలకు గడియారాలను పంపిణీ చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టాప్ లీడర్లకు 'టైం' కలిసొచ్చేనా..? 'టైం' కలిసివచ్చేది ఎవరికి? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుండడం విశేషం.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల మధ్యలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో గతంలో తన కుమారుడు హర్షరెడ్డి వివాహం సందర్భంగా తన ఫొటోతో కూడిన గోడగడియారాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేశారు. త్వరలో తన కుమార్తె సప్నిరెడ్డి వివాహం సందర్భంగా గోడగడియారంపై తన ఫొటో ముద్రించి పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ సైతం తన కుమారుడు డాక్టర్ నయన్ రాజ్ నిశ్చితార్థ వేడుక జరగడం.. త్వరలో వివాహం జరుగనుండటంతో మంత్రి సైతం తన ఫొటోతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలను ముద్రించి గోడగడియారాలను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు 'టైం'ను నమ్ముకున్నట్లుంది అనే చర్చ నడుస్తోంది.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కొంతకాలం 'టైం' బాగున్నా.. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి అధిష్టానం పొంగులేటికి హామీల మీద హామీలు ఇస్తూనే ఉన్నా.. ఇంతవరకు నెరవేరలేదు. పార్టీ పొంగులేటిని దూరం పెట్టిందనే టాక్ రావడంతో.. పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైంది. కొందరు నాయకులు టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ మారాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు ఒత్తిడితీసుకొచ్చినా అధిష్టానం పలుమార్లు బుజ్జగిస్తూ వచ్చింది. ఇటీవల రాజ్యసభకు పంపిస్తామంటూ వార్తలు వచ్చినా.. అదీ నెరవేరలేదు.. దీంతో పొంగులేటితో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల పొంగులేటి తాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటూ ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది. అయితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు..? ఏ పార్టీ నుంచి పోటీచేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోడగడియారాల పంపిణీ సందర్భంగా ఈసారైనా పొంగులేటికి 'టైం' కలిసొచ్చేనా అనే చర్చ జరుగుతోంది.2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ కుమార్‌కు పేరుంది. అతితక్కువ కాలంలోనే పార్టీలో పట్టు సాధించడంతో పాటు మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. అప్పటి నుంచి నగరాన్ని అభివృద్ధి బాట పట్టించినా, ఎప్పటికప్పుడు జనాల్లోనే ఉంటున్నా.. కొద్దికాలంగా మంత్రికి 'టైం'అంతగా కలిసి రావడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరుల వల్ల మంత్రికి చెడ్డపేరు వస్తుండడం ఒకవైపు జరుగుతుంటే.. ప్రతిపక్షాలు పలు సంఘటనలకు మంత్రిపై ఆరోపణలు చేస్తుండడంతో అజయ్‌కు 'టైం' బాగోలేదని ఆయన అనుచరులు అంటుండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో అజయ్ పైనే ప్రతిపక్షాలు ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. సొంత పార్టీలోని కొందరు అజయ్‌కు వ్యతిరేకంగా జట్టుకడుతున్నట్లు కూడా ఇటీవల మంత్రే స్వయంగా అన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అజయ్ తన గెలుపును అంత తేలిగ్గా తీసుకోరని, ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్లో పనిచేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో పువ్వాడ 'టైం'ఎలా ఉండనుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.జిల్లాకు చెందిన ఇద్దరు టాప్ లీడర్లు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు గోడ గడియారాలు పంపిణీ చేస్తుండడంతో ఇద్దరూ టైంనే నమ్ముకున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఒక ఎంపీ స్థానంతో పాటు మూడు ఎమ్మెల్యేలను గెలిపించి.. ఆ తర్వాత కారెక్కారు. 2018లో పోటీ చేసే అవకాశం రాకవపోడంతో.. అప్పటినుంచి 'టైం' కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీ మారాల్సిన అవకాశం వచ్చినా 'టైం' కోసమే చూశారు. మరి వచ్చే ఎన్నికల్లో 'టైం' ఎలా కలిసొస్తుందో చూడాలి.. పువ్వాడ సైతం టీఆర్ఎస్లో చేరినప్పటినుంచి 'టైం' కలిసొచ్చినా.. మరోసారి తన 'టైం' కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అభివృద్ధి పనుల కోసం పాటుపడుతూ ఇంకా మంచి 'టైం' కోసం ఎదురు చూస్తున్నారు.త్వరలో అగ్రనేతల ఇంట్లో వివాహాలు ఉండటంతో ఎవరికి తోచిన విధంగా వారు ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పొంగులేటి ఇంట జరిగిన వివాహానికి జిల్లాలో అందరికీ గోడ గడియారాలు పంపిణీ చేశారు. కిరాణం షాపు మొదలుకొని టీస్టాల్ వరకు పొంగులేటి గడియారాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. త్వరలో కూతురు వివాహం కూడా ఉండటంతో మరోసారి పంపిణీకి సిద్ధమయ్యారు. అదేవిధంగా మంత్రి అజయ్ కుమారుడు డాక్టర్ నయన్ రాజ్ వివాహం కూడా ఉండటం.. మంత్రి కూడా వాల్ క్లాక్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వచ్చిన అతిథులతో పాటు.. ఖమ్మంలో ప్రతీ ఇంటికీ, షాపులకు గోడ గడియారం అందేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.

Related Posts