YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీల నుంచి రానీ యూసీలు 15వ ఆర్ధిక సంఘ నిధులకు బ్రేక్...

పంచాయితీల నుంచి రానీ యూసీలు 15వ ఆర్ధిక సంఘ నిధులకు బ్రేక్...

వరంగల్, జూలై 28,
పల్లెలకు నిధుల గండం వాటిల్లింది. రాష్ట్రానికి రావాల్సిన 15వ అర్థిక సంఘం నిధులకు బ్రేక్ వేసింది. ఈ ఏడాది రెండో విడుతలో రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. ఈ నిధుల విడుతలకు పేచీ పెడుతోంది. గతంలో విడుదల చేసిన రూ. 12,375 కోట్లకు ముడి పెట్టింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. దీంతో ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసమే వెతుకులాడుతున్న ప్రభుత్వానికి రూ. 12,375 కోట్లు సర్దుబాటు చేయడం అత్యసరమవుతోంది. దీంతో గతంలో చేసిన పనులను ఈ నిధుల కింద చూపించేందుకు అష్టకష్టాలు పడుతోంది. పాత పనులకు ఇప్పుడు చెక్కులను ఇచ్చి, ఆ తర్వాత నిధులు మంజూరు చేయాలని భావిస్తోంది. దీంతో కనీసం రూ. 3 వేల కోట్ల వరకు భారం తగ్గుతోంది. కానీ, ఇంకా మిగిలినవాటిని ఏం చేయాలో సర్కారుకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి నిధులు ఇవ్వక, కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రాక పంచాయతీలు ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్నాయి.15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు రావాల్సిన సెకండ్ క్వార్టర్ఫండ్స్కు కేంద్రం బ్రేక్వేసింది. తొలి విడతలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన నిధులు జారీ చేశారు. అయితే, కేంద్ర నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తుందనే ఉద్దేశంతో వినియోగంపై ఆంక్షలు పెట్టింది. ఇక నుంచి కేంద్రం విడుదల చేసే నిధులు పంచాయతీ ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. దీంతో మధ్యలో రాష్ట్ర సర్కారు ఎలాంటి సంబంధం ఉండదు. నిర్ధేశించిన పనులను చేసి, వాటికి సంబంధించిన రికార్డులు సబ్మిట్ చేస్తే కేంద్రం జారీ చేసే నిధులను తీసుకునే అవకాశం సర్పంచ్ లకు కల్పించింది. దీని కోసం పంచాయతీలన్నీ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తీశారు. వీటిని డిజిటల్సిగ్నేచర్స్ తో కేంద్రం వెబ్ సైట్ లో అప్లోడ్చేశారు. ఈ ప్రక్రియ గత నెల నుంచే మొదలుకాగా.. రాష్ట్రం నుంచి మాత్రం కొంత ఆలస్యమైంది.కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ పనులకు వినియోగించింది. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటుగా ఎస్ఎఫ్సీ ఫండ్స్ కూడా పెండింగ్పెట్టింది. వాస్తవానికి ఇవన్నీ గ్రామ పంచాయతీలకే ఇవ్వాలి. కానీ, ఆర్థిక సంక్షోభం కారణంగా వివిధ పథకాలకు మళ్లించింది. దీంతో కేంద్రం వీటిపై దృష్టిపెట్టింది. ఇలా ఆర్థిక సంఘం నిధులు రూ. 11,475 కోట్లు, ఎస్ఎఫ్సీ నుంచి రూ. 900 కోట్లను రాష్ట్రం వినియోగించుకుంది. ఇలా రూ. 12,375 కోట్లు పల్లెల నిధులను వాడుకోవడంతో వాటిని చెల్లించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇదే సమయంలో కేంద్రం కూడా ఈ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ హుకూం జారీ చేసింది. కేంద్రం నిధులు వాడుకుని, గ్రామ పంచాయతీలకు బిల్లుల చెల్లింపులు ఎలా ఆపేస్తారని, వెంటనే వాటిని రిలీజ్ చేయాలంటూ నోటీసులిచ్చింది.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలపై ఫ్రీజింగ్విధించింది. గ్రామాలకు సంబంధించిన రూపాయి కూడా తీసుకునే అవకాశం లేకుండా చేసింది. కొన్ని గ్రామాలకు సంబంధించిన ఖాతాల్లో పాత ఆర్థిక సంఘం నిధులతోపాటుగా కొన్ని పన్నుల రూపంలో వచ్చినవి కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు వాటిని విడుదల చేసుకునే అవకాశం లేదు. మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఈ నిధులకు సంబంధించిన వాటిపై నోటీసులు జారీ అయ్యాయి. ప్రస్తుతం నిబంధనలు మార్చడంతో సాప్ట్వేర్అప్డేట్ అయిందని, పాత బిల్లులన్నీ చెల్లించాలని కేంద్రం నుంచి రాష్ట్రానికి నోటీస్ రూపంలో లేఖను పంపించారు. ఇప్పటి వరకు ఆర్థిక సంఘం నిధులు రూ. 11,475 కోట్లు లెక్కలు చూపించలేదని, వాటిని వెంటనే చెల్లించాలని, ఆ తర్వాత వాటికి యూసీలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. వీటన్నింటిపైనా అడిట్చేసి రిపోర్ట్పంపించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసే నిధులను విడుదల చేయమంటూ కరాఖండిగా తేల్చింది.రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులను భారీగా మంజూరు చేస్తున్నా.. కేంద్రానికి క్రెడిట్ రానీయడం లేదనే నేపథ్యంలో ఈ నిధుల వినియోగంలో సంస్కరణలు చేసింది. రాష్ట్రాలకు విడుదల చేసే పథకాల్లో కేంద్రం ముద్ర కనిపించేలా.. గ్రామాల్లోని ప్రజలకు ఆ విషయం నేరుగా అర్థమయ్యేలా బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే గ్రామాలకు ఇచ్చే నిధులతో నేరుగా లింక్ పెట్టింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ఇచ్చే నిధులు వేరుగా.. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు వేరుగా రానున్నాయి. వాటిని ఢిల్లీ నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే కేంద్ర నిధులు జమ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రామాల్లో పనులు చేసే చోట కేంద్రం నిధులతో అంటూ ప్రత్యేక బోర్డులు కూడా దర్శనమివ్వనున్నాయి.కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదంగా మారినా.. ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామాలకు మాత్రం నిధులు ఆగిపోయాయి. అసలే పంచాయతీల్లో పైసల్లేక తంటాలు పడుతున్న గ్రామాలు.. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు కూడా నిలిచిపోవడంతో ఆర్థిక కష్టాల్లో సతమతమవుతున్నాయి. అటు రాష్ట్రం నుంచి కూడా ఆశించిన నిధులు రావడం లేదు. ఇప్పటికే నెల రోజులు దాటినా ఇంకా 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రం నుంచి రూ. 12,375 కోట్లను పంచాయతీలకు ఇచ్చి, వాటికి సంబంధించిన వినియోగపు ధృవీకరణ పత్రాలు, వాటిపై అడిట్ నివేదికలు ఇస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి. ఈ ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందోననే ఆందోళన గ్రామాల్లో కనిపిస్తోంది.

Related Posts