YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో ముందస్తు ఎన్నికల ఫీవర్

ఏపీలో ముందస్తు ఎన్నికల ఫీవర్

విజయవాడ, ఆగస్టు 1 ,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వేళాయిన సూచనలే కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నాయకులు, అధినాయకుల తీరును గమనిస్తే ముందస్తు ఎన్నికలు ఖాయమన్న భావనే కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.  బాదుడే.. బాదుడుతో టీడీపీ నేతల కార్యక్రమాలు, జిల్లాల పర్యటలో చంద్రబాబు, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ఉపక్రమిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. వైసీపీ అధినేత సీఎం పర్యటనలు, జనం నాడిని కనిపెట్టేందుకు ఆయన సర్వేలు చేయించుకుంటున్న తీరు, వైసీపీ జిల్లాల సమన్వయకర్తలు, నేతలతో భేటీలు నిర్వహిస్తున్న వైనం. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులను గ్రామాలకు తరుముతున్న తీరు, మధ్యలో అప్పుడప్పుడూ నేనున్నానంటూ ప్రజల మధ్యకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికార- విపక్షాల మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న మాటల యుద్ధాలు.. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు ముందస్తు సంకేతాలుగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.వీటన్నింటికీ తోడు తాజాగా ఏపీలో సంభవించిన భారీ వర్షాలు, ఆపైన గ్రామాలకు గ్రామాలను ముంచెత్తిన వరదలు.. వరద బాధితులకు మేం ఇంత చేశాం.. అంత చేశామని చెప్పుకుంటున్న అధికారపక్షం.. అంతలేదు.. అసలు బాధితులకు సాయమే లేదు.. వారిని ప్రభుత్వం తరఫున పట్టించుకున్న నాథుడే లేడంటూ తూర్పారపడుతున్న టీడీపీ అధినేత సహా ఆ పార్టీ నాయకులు. ఇవన్నీ ముందస్తు ఎన్నికలకు ఆయా పార్టీల సన్నాహాలుగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో ముందస్తు రాజకీయ సునామీ వచ్చిందా? అన్నట్లు అధికార, ప్రతిపక్ష నేతలిద్దరి నోటా ఒకే సారి ఎన్నికల మాట వినిపించడం విశేషం. అంటే రోగి కోరుకున్నదే వైద్యుడు చేశాడన్నట్లు.. ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షం తాను రెఢీ అంటూ కాలుదువ్వుతుంటే.. మేం తక్కువ తిన్నానా? అనే ధోరణిలో వైసీపీ కూడా విపక్షానికి సవాళ్లు విసురుతోంది. చంద్రబాబు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ కాపులను అమ్మేస్తున్నారంటూ జగన్ వ్యాఖ్యానించడం రాజీకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అంటే.. కాపు సామాజికవర్గం ఓట్లన్నీ గంపగుత్తగా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నాయనేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. జగన్ వ్యాఖ్యతో ఏపీ రాజకీయం ఒక్కసారిగి హీటెక్కిపోయింది. తానేమన్నా తక్కువా అంటూ.. చంద్రబాబు కూడా ‘ఏపీలో ఫ్యాన్ ను నిలిపేయాలం టూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. ఇరు పార్టీల అధినేత నుంచీ ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు నిర్ణీత సమయంలో వచ్చినా.. ముందుగానే వచ్చినా.. తమకు ఎవరు కావాలో తేల్చుకోవాల్సిన సమయం మాత్రం ఏపీ ఓటర్లకు వచ్చిందనడంలో సందేహం లేదు.ప్రజాధనాన్ని తినేవాళ్లు కావాలో.. ప్రజాధనాన్ని ప్రజలకే పంచేవాళ్లు కావాలో.. తేల్చుకోండి  అని ప్రజలకు సీఎం జగన్ పిలుపునివ్వడం కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు సన్నాహక సూచనగానే భావించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లలు కూడా అచ్చంగా ఎన్నికల సమయంలో చెప్పిన తీరునే గుర్తుచేస్తున్నాయంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫ్యాన్ ఆగిపోయిన విధంగానే.. ఎన్నికల్లో ఆ ఫ్యాన్ ను తిరగనివ్వకుండా చేయాలని పిలుపునివ్వడం గమనార్హం. అటు జగన్.. ఇటు చంద్రబాబు ఇద్దిరి నోటా వాడి వేడి గా  ఒకేసారి వ్యాఖ్యలు రావడాన్ని ముందస్తు ఎన్నికలకు సంకేతంగానే భావిస్తున్నారు. ఒక పక్కన జగన్ తన పాలనను చంద్రబాబు పాలనతో పోల్చి చెప్పుకుంటున్నారు. ప్రకృతి విలయాలు వచ్చిన సందర్భంలో తాను జీఓ9 తెచ్చి బాధితులకు పెద్ద ఎత్తున నిధులు అందించేలా చేసిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు కూడా తమ ఇద్దరి పాలనా విధానాలను పోల్చి చెబుతున్నారు.పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు పరిహారం విషయంలో కేంద్రం డబ్బులివ్వడం లేదని బాధితుల ముందు జగన్ చెప్పుకుంటే.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావో తేల్చుకుంటామంటూ చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల వారిని జగన్ గాలికి వదిలేశారని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆ మండలాలన్నీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు ఎన్నికల హామీగా బాధితులకు చెప్పడం విశేషం. వరద పీడిత కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుగానే పర్యటించారు. కష్టాల్లో ఉన్న బాధితులకు మనో ధైర్యం ఇచ్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక జగన్ వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసి వెళ్లారు.పనిలో పనిగా.. వచ్చే ఎన్నికల్లో .. అవి సాధారణంగా వచ్చేవైనా.. ముందుగా జరిగేవైనా.. వైసీపీకి 175 స్థానాలూ గెలుచుకుంటుందని, అలా గెలిచేలా చేయాలంటూ తమ పార్టీ నేతలను జగన్ పురమాయిస్తున్నారు. మరో పక్కన ప్రజల నాడి ఏ రకంగా ఉందో తెలుసుకునేందుకు రకరకాల సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. ఆ సర్వేల ఇస్తున్న నివేదికల సారాంశంతో ఏయే నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూలత ఉందో.. ఎక్కడ ప్రతికూలత ఉందో జగన్ అంచనా వేసుకుంటున్నారు. ప్రతికూలత ఉన్న చోట్ల తమ పార్టీ నేతలకు టార్గెట్లు పెట్టి మరీ జనంలోకి తరుముతున్నారు.
అనుభవ రాహిత్యంతో ఏపీని ఇబ్బందుల్లోకి, అభివృద్ధి లేకుండా దశాబ్దాల వెనక్కి నెట్టేసిన ప్రస్తుత ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం అంటున్నారు. ఇదే వ్యతిరేకత మరింత పెరిగిపోతే మొదలుకే మోసం వస్తుందనే భయం పట్టుకున్న జగన్ మరింతగా డ్యామేజ్ కాక ముందే ముందస్తు ఎన్నికలను ఎంచుకుంటారనే అంచనాకు విశ్లేషకులు వస్తున్నారు. ఈ అన్నింటినీ బేరీజు వేసుకుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు తథ్యం అనే అంచనాలే సర్వత్రా వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు ఎవరిని వరించినా.. ఏపీని ఇప్పటి నుంచే ఎన్నికల ఫీవర్ పట్టుకుందంటున్నారు.

Related Posts