YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గులాబీ అభ్యర్ధిపై నాన్చుడు ఎందుకో..

గులాబీ అభ్యర్ధిపై నాన్చుడు ఎందుకో..

హైదరాబాద్, సెప్టెంబర్ 23, 
మునుగోడు మొనగాడు ఎవరో తేల్చే ఉపఎన్నిక తేదీ ఇంకా ఖరారు కాలేదు. కానీ.. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి మాత్రం ఉలుకు పలుకు లేదు. నియోజకవర్గంలో గులాబీ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నా.. అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతున్నారు. కీలక మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రతిష్టాత్మక బైపోల్‌ కావడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తోంది. ముందుగా అధికారపార్టీలో అసంతృప్తుల బుజ్జగింపే నేతలకు పెద్ద సవాల్‌గా మారిపోయింది. వీరిలో బీసీ నేతలకు సర్దిచెప్పలేక తర్జనభర్జన పడుతున్నారట. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి పేర్లు ఖరారు కావడంతో.. వాళ్లు ఫీల్డ్‌లో దూసుకెళ్తున్నారు. ఈ ఇద్దరికీ పోటీగా టీఆర్ఎస్‌ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.టీఆర్‌ఎస్‌లో టికెట్‌ ఆశిస్తున్న బీసీ నాయకులు కొద్దిరోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై సైలెంట్‌ అయ్యారట. మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. బీసీలకు టికెట్‌ ఇవ్వాలని గొంతు చించుకున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ను టీఆర్ఎస్‌ పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శించినా నో రెస్పాన్స్‌. ఉపఎన్నికను పర్యవేక్షిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డిపైనే మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ నేరుగా బాణాలు సంధిస్తున్నారు. మండల స్థాయి కీలక ప్రజాప్రతినిధులు సైతం పార్టీ కార్యక్రమాలకు టచ్‌ మీ నాట్‌గా ఉంటున్నారట.ఇలాంటి తరుణంలో అభ్యర్థిని ప్రకటిస్తే.. కేడర్‌ రియాక్షన్‌ మరోలా ఉంటే మొదటికే మోసం వస్తుందని భావించి.. ఆ నిర్ణయం వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరుపై చర్చ జరిగినా.. 2018లో మునుగోడు సీటును కోల్పోవడానికి ఆయనే కారణమని కేడర్‌ ఆరోపిస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించినా.. అభ్యర్థిని ప్రకటించకపోవడానికి ఇదే ప్రధాన కారణమని పార్టీలో టాక్‌. ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ విస్తృతంగా సర్వేలు నిర్వహిస్తోంది. పార్టీ ఒక నిర్ణయం తీసుకునే వరకు కూసుకుంట్లను ఎక్కడా మాట్లాడవద్దని పెద్దలు సూచించారట. ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించినా.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కూసుకంట్ల పేరు ప్రస్తావనకు వస్తే ఇబ్బందులు వస్తున్నాయని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.అసంతృప్త నేతలను ముందుగా బుజ్జగించి.. ఆశావహుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్ఎస్‌ నేతలు చూస్తున్నారట. ఏతావాతా ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చాకే అభ్యర్థిని టీఆర్ఎస్‌ ఖరారు చేస్తుందని అనుకుంటున్నారట. ఈలోగా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించి.. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందుకే మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్థిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని చర్చ నడుస్తోంది.

Related Posts