YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఆర్ఎస్‌లో వర్గపోరు

టీఆర్ఎస్‌లో వర్గపోరు

ఖమ్మం, నవంబర్ 18, 
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు మరోసారి భగ్గుమంటోంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాక సందర్భంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సభకు మాజీ మంత్రిని ఆహ్వానించవద్దని గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే పట్టుపడుతున్నాడనే ప్రచారం ఆ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌‌గా మారింది. దీంతో సదరు మాజీ మంత్రి ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. రాజ్యసభకు ఎంపికైన తర్వాత మొదటిసారి బండి పార్థసారథి రెడ్డి రేపు తన స్వగ్రామం సత్తుపల్లి మండలం కందుకూరి గ్రామానికి వస్తున్నారు. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఆహ్వానించవద్దని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నిర్వహాకులపై ఒత్తిడి తీసుకొచ్చారనే ప్రచారం గుప్పుమంటోంది. దీంతో సమావేశానికి తుమ్మల హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కందాల ఉపేందర్ తుమ్మల నాగేశ్వర్ రావుపై విజయం సాధించారు.తర్వాత జరిగిన పరిణామాలతో కందాల టీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి కందాల వర్సెస్ తుమ్మల మధ్య వర్గపోరు బహిరంగ రహస్యంగా మారిపోయింది. పరస్పరం ఇరు వర్గాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలు మరో ఏడాదిలో రానుండటంతో తుమ్మల ఇటీవల రాజకీయంగా తిరిగి యాక్టీవ్ రోల్ పోషిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ తన అనుచరులను కలుస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి పార్థసారథి అభినందన సభకు తుమ్మలను ఆహ్వానిస్తే అది తనకు ఇబ్బందికరంగా మారే అవకాశాలుంటాయని భావించిన కందాల.. ఈ కార్యక్రమానికి తుమ్మలను ఆహ్వానించొద్దని పట్టుపడుతున్నట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఓ వైపు వచ్చే ఎన్నికల్లో తిరిగి సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన, మరోవైపు నియోజకవర్గంలో వర్గపోరుతో తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మొదలైంది. అయితే ముఖ్యమంత్రి ప్రకటనతోనే ఎమ్మెల్యే కందాల వర్గం తుమ్మల విషయంలో స్పీడ్ పెంచిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇరు వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది టీఆర్ఎస్‌ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Related Posts