YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎత్తులు- పై ఎత్తులు ఎన్నికలకు సిద్ధమౌతున్న పార్టీలు

ఎత్తులు- పై ఎత్తులు ఎన్నికలకు సిద్ధమౌతున్న పార్టీలు

హైదరాబాద్, నవంబర్ 22, 
తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్ని సన్నద్ధం అవుతున్నాయి. ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. అనూహ్య రీతిలో రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ ఇప్పుడు అధికార పార్టీతో నువ్వా నేనా అన్న రీతిలో సవాల్ విసురుతోంది. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్న బీజేపీ నేతలు జాతీయ నాయకులను రంగంలోకి దించుతున్నారు. పార్టీలో ప్రతిష్టాత్మకంగా భావించి కార్యవర్గ సమావేశాలను సైతం హైదరాబాద్‌ను వేదికగా చేసుకోవడం వెనుక తెలంగాణ రాజకీయం విషయంలో బీజేపీ పెద్దలు ఎంత ఫోకస్డ్ గా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతోంది. ఆ తర్వాత మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, మరి కొంత మంది కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ సైతం అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించేలా ప్రణాళికలు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.షెడ్యుల్ ప్రకారం మరో ఏడాదిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆలోపు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై కమలనాధులు లెక్కలు వేసుకుంటున్నారు. బూత్ లెవల్ వరకు సంస్థాగంతంగా పార్టీని పటిష్టం చేసుకుని కారు పార్టీ జోరుకు బ్రేకులు వేయాల్సిందేనని యోచిస్తున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఫలితాలు సంతృప్తినిచ్చినా మునుగోడులో మాత్రం చేదు ఫలితం చవిచూసింది బీజేపీ. అయితే ఫలితం కలిసి రాకున్నా తమ పార్టీకి పెరిగిన ఓట్ల శాతం తర్వాత ఎన్నికల్లో తప్పక విజయం దిశగా నడిపిస్తుందనే ధీమా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో బీజేపీని కట్టడి చేయాల్సిందేననే వ్యూహంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీని జిల్లా స్థాయిల్లో దెబ్బకొట్టేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అసంతృప్తిగా ఉన్న ఆయా జిల్లా బీజేపీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులపై అధికార పార్టీ దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న రంగారెడ్డి, నిర్మల్ జిల్లా అధ్యక్షులు, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం గుప్పుమంటోంది.రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బి.నర్సింహారెడ్డి తనకు తెలియకుండానే మహేశ్వరం నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ ను నియమించారనే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నాలుగైదు రోజులుగా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారనే టాక్ వినిపిస్తోంది. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి సైతం పార్టీలో అసంతృప్తితో ఉన్నారని, ఎంపీ సోయం బాపు పర్యటనలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలోకి ఇతరుల చేరికపై ఆమె అలకబూనారని త్వరలో ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి సైతం టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ స్థానికంగా జోరుగా వినిపిస్తోంది. ఇలా పలువురు బీజేపీకి చెందిన ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందనే వాదనలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీలోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు అధికార పార్టీలోని కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని తగిన సమయం చూసుకుని వీరిని కారెక్కించుకోవడం ద్వారా కమలం పార్టీకి కష్టాల్లోకి నెట్టేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ ప్రచారంపై బీజేపీ శ్రేణులు మరోలా స్పందిస్తున్నాయి. ఇదంతా వట్టి ప్రచారమేనని ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు పార్టీ బలపడుతోందని చెబుతున్నారు. టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇరు పార్టీల మధ్య రాజకీయం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Related Posts