YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒక్క రోజే 23 కోట్ల ఆదాయం

ఒక్క రోజే 23 కోట్ల ఆదాయం

గుంటూరు, జనవరి 21, 
ఏపీఎస్ ఆర్టీసీ మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈనెల 18న ఒక్క రోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని సాధించి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్‌ రికార్డు స్థాయి ఆదాయం నమోదవుతుంది. టిక్కెట్ల ధరలను పెంచకుండానే సంస్థకు ఆదాయం దక్కింది. సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణీకులు ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని అధికారులు అంటున్నారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులు ప్రయాణ భారాన్ని తగ్గించుకునేందుకు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులనే ఎంచుకున్నారు. ఇతర ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల కంటే ఆర్టీసీకే మొగ్గు చూపారని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా కూడా ఎక్కువ ఆదాయం  నమోదైంది. ఒక్క రోజులో రూ.55 లక్షలు సాధించింది. గతంలో ఒక రోజు ఆదాయం రూ.45 లక్షలుగా రికార్డులో ఉంది. ఈసారి దాన్ని అధిగమించింది. ప్రయాణికులకు ముందస్తుగా బస్సులను అందుబాటులో ఉంచడం, నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, సమర్ధవంతంగా నిర్వహించడం, ఎప్పటికప్పుడు బస్సులు పర్యవేక్షించడం,రద్దీకి తగ్గట్టు బస్సుల ఏర్పాటు వల్లనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. సంస్థలోని సిబ్బంది ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, వారి కృషి ఫలితంగానే ఈ సంక్రాంతి ప్రత్యేక సమయంలో ఈ ఘనత సాధించామని కితాబు ఇచ్చారు. పర్యవేక్షణలో అధికారుల సహాయసహకారాలనూ కూడా కొనియాడారు. కార్గో పట్ల, ప్రత్యేక సర్వీసుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణ మరువలేనిదంటున్నారు. సంక్రాంతికి ముందు రోజుల్లో జనవరి 6 నుంచి 14 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10శాతం రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులను ఏపీఎస్ వైపు ఆకర్షించేలా చేసిందని ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గత సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను నడిపిందని చెప్పారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారని అధికారులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి స్థూల ఆదాయం బాగా పెరిగిందని అంటున్నారు. గత సంవత్సరం సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే అదనంగా రూ. 7.90 కోట్ల ఆదాయాన్ని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఆర్జించిందని తిరుమలరావు తెలిపారు. గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీ సాధించగలిగిందని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి  మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

Related Posts