YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ దూరానికి కారణం ఏమిటీ

కేటీఆర్  దూరానికి కారణం ఏమిటీ

హైదరాబాద్, జనవరి 23, 
కేసీఆర్ నోటి వెంట జై తెలంగాణ నినాదం స్థానంలో జై భారత్ నినాదం వచ్చింది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికి కేసీఆర్ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది పక్కన పెడితే.. టీఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్‌ కూడా విజయవంతం అవుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు.  అయితే బీఆర్ఎస్ కీలక కార్యక్రమాలకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీ రామారావు దూరంగా ఉంటున్నారు. ఇంత వరకూ బీఆర్ఎస్ తరఫున జరిగిన ఏ కార్యక్రమంలోనూ ఆయన పెద్దగా కనిపించలేదు.  మంత్రి కెటిఆర్ కావాలనే దూరంగా బీఆర్ఎస్ తరఫున పార్టీ కార్యక్రమాలకుదూరంగా ఉంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  రాజకీయ వర్గాల్లోనూ, పార్టీ శ్రేణుల్లోనే కాదు.. తెలంగాణ ప్రజల్లో కూడా ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ తరఫున జరిగిన  కార్యక్రమాల్లోనూ కేటీఆర్ పాల్గొనకపోవడంతో టీఆర్ఎస్ ను కనుమరుగు చేసి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తనయుడు కేటీఆర్ స్వాగతించడం లేదా అన్న సందేహం ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్‌ బీఆర్ఎస్‌గా మార్చేందుకు  తీర్మానం చేయడానికి  ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్..  ఆ తరువాత ఏ కీలక సమావేశానికీ హాజరు కాలేదు.  ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం, ఏపీ నేతలు బీఆర్ఎస్‌లో చేరే సందర్భం, ఇటీవల బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిర్వహించిన ఖమ్మం సభ వీటి వేటిలోనూ కూడా కేటీఆర్ పాల్గొనలేదు.   కేటీఆర్ ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్లే ఆయన వీటికి హాజరుకాలేక పోతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేటీఆర్ ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాలలోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా జోరుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్‌కు ఆసక్తి  లేదని..  అందుకే బీఆర్ఎస్‌కు సంబంధించిన  కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని ఇటు పార్టీ వర్గాలూ, అటు తెలంగాణ ప్రజలూ భావిస్తున్నారు.కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినా.. తాను కేవలం తెలంగాణ రాజకీయాలకు మాత్రమే పరిమితమనే సంకేతాలు ఇవ్వడానికే మంత్రి కేటీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ జాతీయస్థాయి కార్యక్రమాలకు కేటీఆర్ దూరంగా ఉండొచ్చని.. అదే జరిగితే తాను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమనే సంకేతాలను కేటీఆర్ ఇచ్చినట్టు స్పష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. ఇక్కడ ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకుంటారని బీఆర్ఎస్ నేతలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత ఇదే జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేటీఆర్ తెలంగాణకు పరిమితమయ్యే విధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Posts