YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాదంలో సోమువీర్రాజు

వివాదంలో సోమువీర్రాజు

రాజమండ్రి, ఫిబ్రవరి 1, 
నిన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఏపీ బీజేపీలో హాట్‌ టాపిక్‌. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన శివప్రకాష్‌తో కన్నా భేటీ తర్వాత ఆ జోరు చాలా వరకు తగ్గిందని ఊపిరి పీల్చుకుంది ఏపీ శాఖ. ఇప్పుడు కొత్త అంశం దుమారం రేపుతోంది. ఆ మధ్య జాతీయ కార్యవర్గ సమావేశాలకు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. హస్తిన చేరుకోగానే సోము వీర్రాజు తీవ్ర అస్వస్థతకు లోనై.. ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని సోషల్‌ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. దానిని బాగా వైరల్‌ చేశారు కూడా. ఈ అంశమే బీజేపీలో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఏపీ నాయకత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తణుకుకు చెందిన బాలుశ్రీ.. కాకినాడకు చెందిన యార్లగడ్డ రాంకుమార్‌లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. యార్లగడ్డ రాంకుమార్ బీజేపీ అనుబంధ విభాగం కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యుడు. ఇదే కాషాయ పార్టీ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.బీజేపీకి యార్లగడ్డ రాంకుమార్ చాలాకాలంగా సేవలందిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సోము వీర్రాజు వ్యవహార శైలి.. ఆయన నిర్ణయాలతో రామ్ వివిధ సందర్భాల్లో విభేదించేవారట. బహిరంగంగా కాకున్నా.. పార్టీ నేతల సమక్షంలో తన అభిప్రాయాలను రామ్ కుండబద్దలు కొట్టేవారని సమాచారం. సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారట. తాజాగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అదే రాంకుమార్‌పై ఆరోపణలు చేయడం చూస్తుంటే.. పాత కక్షలను మనసులో పెట్టుకుని ఫిర్యాదు చేశారా? అని బీజేపీలోని ఓ వర్గంలో చర్చ జరుగుతోందట. సొంత పార్టీ వారి మీదే కేసు పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారట. సోము వీర్రాజు వర్గం మరో అంశాన్ని చర్చకు పెడుతోంది. రాంకుమార్ బీజేపీ నేతైనా ఆయన మనసు మాత్రం టీడీపీతో ఉందని ఆరోపిస్తున్నారు. టీడీపీతో పొత్తు ఉండబోదని వీర్రాజు చెప్పిన ప్రతీసారీ రాంకుమార్ తెగఇబ్బంది పడిపోయి.. సోషల్ మీడియాలో పార్టీ అధ్యక్షుడిపై వ్యంగ్యంగా కామెంట్స్‌ చేస్తుంటారని విమర్శిస్తున్నారు. రాంకుమార్‌కు సొంత పార్టీ ప్రయోజనాల కంటే.. పక్క పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనేది వీర్రాజు వర్గం చేస్తున్న వాదన. అందుకే రాంకుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.తాను తప్పుచేశానని భావిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు తన వివరణ ఎందుకు అడగలేదని రామ్‌ ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు స్వయంగా రామ్ ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనేది సోము వర్గం కౌంటర్‌ ఇస్తోంది. ఏపీ బీజేపీలో కొంతకాలంగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తున్న వారికి చిరాకు పుట్టిస్తోందట. పార్టీలో ఉన్నది పది మంది నేతలైతే.. 20 గొడవలు పెట్టుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రతి అంశాన్నీ భూతద్దంలో నుంచి చూడడం సోము వర్గానికి.. సోము వ్యతిరేకవర్గానికి రివాజుగా మారిందంటున్నారు. అసలు బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయాలి..? ఏయే కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల కంటే.. ఈ ఛోటా మోటా అంశాల మీద చిల్లర పంచాయితీలేంటని కొందరు కమలనాధులు గుర్రుగా ఉన్నారట.

Related Posts