
కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. ఇది ఆ పార్టీ నాయకులు తమకు కావాల్సినప్పుడల్లా చెప్పుకునే మాట. కానీ, ఈ అంతర్గత ప్రజాస్వమ్యమే పార్టీని ముంచేస్తున్నా, తమ కుస్తీపట్లతో పార్టీ క్యాడర్ చిన్నాభిన్నం అవుతున్నా ఆ పార్టీ నేతలకు పట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభ రోజురోజుకూ దిగజారుతోంది. ఆ పార్టీ ఉనికి కొంతలో కొంత బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కీలకమైనది. రానున్న ఎన్నికల్లో పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం, కేంద్రంలో అధికారం చేపట్టేందుకు ఇక్కడ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీకి చాలా అవసరం. ఇంత కీలకమైన రాష్ట్రం పట్ల ఆ పార్టీ అధిష్ఠానం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. విభేదాలతో నాయకులు పార్టీ పరువు తీస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ రోజుల తరబడి ప్రచారం చేసే రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించడానికి మాత్రం సమయం దొరకడం లేదు. రాహుల్ పర్యటన అప్పుడు, ఇప్పుడు అని చెప్పడమే కానీ, ఆయన వచ్చేది ఉండదు. పార్టీని ఓ దారిలోకి తెచ్చేది ఉండదు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున ఇకనైనా కాంగ్రెస్ నేతలు మారుతారో లేదో చూడాలి.కానీ, ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాత్రం గత ఎన్నికల ముందు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. దీనికి తోడు మేమే గెలుస్తామనే అపనమ్మకం, ఎన్నికల ముందే నాయకుల మధ్య విభేదాలతో పార్టీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. తెలంగాణ కోసం ఉద్యమించిన ఇమేజ్‌తో ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టారు.అవకాశాలు ఉన్నా అందుకోవడం లేదు…సరే, ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాతయినా తమ నాయకులు మారతారనుకుని ఆశించిన క్యాడర్‌కు నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతుంది. సుమారు 10 మంది నాయకులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా మాకు అర్హత ఉందండటే, మాకు ఉందంటూ చెప్పుకోవడం, ఒకరిని దెబ్బ తీసేందుకు ఒకరు ప్రయత్నించడం, సొంత పలుకుబడి కోసం ప్రయత్నించడంతో పార్టీ కోలుకోవడం లేదు. ఇటీవల టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి ఆండ్ కో చేరడం, పలు పార్టీల నుంచి నాయకుల చేరికలు పెరగడంతో క్యాడర్‌లో కొంత జోష్ వచ్చింది. దీనికి తోడు ఇప్పటికే మూడు జిల్లాల్లో నిర్వహించిన బస్సుయాత్రలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది. ఇలా పార్టీని గెలిపించుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఆ పార్టీ నాయకులు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు.పార్టీలో నాయకుల ఎదుగుదలను ఇతర నాయకులు ఓర్వలేకపోతున్నారు. బస్సు యాత్రతో ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై క్యాడర్‌లో కొంత నమ్మకం పెరుగుతున్న ఈ సమయంలో పీసీసీలో మార్పులుంటాయని, పార్టీ పదవుల భర్తీకి ఉత్తమ్ ఇచ్చిన లిస్టును రాహుల్ తిరస్కరించారని, ఉత్తమ్‌పై అధిష్ఠానానికి నమ్మకం పోయిందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వెనక కూడా స్వంత పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది. ఇలా అంతోఇంతో కష్టపడుతూ క్యాడర్‌లో భరోసా కలిపించేందుకు ప్రయత్నిస్తున్న ఉత్తమ్ ను సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారు.పార్టీకి గడ్డుకాలం ఉన్నప్పుడు కూడా నాయకుల మధ్య ఐక్యత, సమన్వయం కొరవడిందనే చెప్పుకోవాలి. ఇద్దరు ఎమ్మెల్యేలను బహిష్కరణ వేస్తే గాంధీ భవన్‌లో సదరు ఎమ్మెల్యేలు రెండు రోజులు నిరాహార దీక్ష చేశారు. దీనికి రాష్ట్రస్థాయి నెతలు అంతా రావడంతో, వీరి మధ్య ఐక్యత వచ్చినట్లు కనిపించింది. అయితే, తమకు పార్టీ నేతలు మద్దతుగా నిలవలేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడంతో అంతా ఆవిరైపోయింది. ఇక తాజాగా కూడా కోమటిరెడ్డి మరోసారి ఇదేరకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలను సీఎల్‌పీ నేత జానారెడ్డి ఖండించడం తో వారి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. ఇక దూకుడు స్వభావం కలిగిన రేవంత్‌రెడ్డికి అడ్డుకట్ట వేసేందుకు కూడా స్వంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారట. ఆయనకు ఏదైనా పదవి వస్తే ఎక్కడ పాతుకుపోతాడోనని వారిలో ఆందోళన కనపడుతోంది. ఇక పీసీసీ చీఫ్ పై కూడా రేవంత్ మీడియా ఎదుటే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. వీరి విభేదాలు కేవలం రాష్ట్ర స్థాయి నాయకుల వరకే కాదు, ఇంఛార్జిలుగా వచ్చిన ఏఐసీసీ నేతలకు కూడా తలనొప్పులు, తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. దిగ్విజయ్ సింగ్ ఉన్నన్ని రోజులూ ఆయన మారతాడని, ఇప్పుడు కుంతియా పోయి గులాం నబీ ఆజాద్ వస్తాడని ప్రచారం చేస్తున్నారు. దీంతో కుంతియా కూడా తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసే దాకా పరిస్థితి వచ్చింది.